
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 55 ఏళ్లు. అటవీశాఖలో పనిచేస్తున్నాను. రెండునెలల కిందట డ్యూటీలో భాగంగా కొండప్రాంతంలో ఉండగా హఠాత్తుగా కుప్పకూలడంతో హుటాహుటిన వరంగల్‌కు తరలించి ఆసుపత్రిలో చేర్పించారు. హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా అలా జరిగిందన్నారు. ఇప్పుడు పరిస్థితిని అదుపు చేశామనీ, అయితే గుండెమార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. జీవన్‌దాన్‌లో పేరు కూడా నమోదు చేసుకున్నాం. నాకు ఇప్పటికే షుగర్, హైబీపీ సమస్యలు ఉన్నాయి. హార్ట్‌ట్రాన్స్‌ప్లాంటేషన్ నన్నెంతకాలం కాపాడుతుంది? దయచేసి వివరించండి. – కె.ఆర్. సమ్మారావు, హనమకొండ
అధిక రక్తపోటు, డయాబెటిస్ మీ గుండెకు బాగా నష్టం కలిగించినట్లు కనిపిస్తోంది. మీ ఆహారపు అలవాట్లు, ఇతర వ్యాధులతో వచ్చే ఇన్ఫెక్షన్ల వంటివి కూడా ఉంటే అవి కూడా మీ సమస్యకు తోడై ఉండవచ్చు. ఇవన్నీ హార్ట్‌ఫెయిల్యూర్‌కు దారితీస్తాయి. మీరు అలసిపోయినప్పుడు / పడుకున్నప్పుడు, శ్వాస అందకపోవడం, మితిమీరిన అలసట, ఒళ్లు వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండె ఇక ఏమాత్రం పనిచేయలేని స్థితి (ఎండ్ స్టేజ్ హార్ట్ ఫెయిల్యూర్)కి చేరుకున్నందున గుండెమార్పిడే మీకు ప్రాణరక్షణ అవకాశం.
మీరు తెలిపిన వివరాల ప్రకారం కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులకు సంబంధించి తీవ్రమైన వ్యాధులేవీ లేవు కాబట్టి మీరు నిర్భయంగా హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు వెళ్లవచ్చు.
సాధారణంగా హార్ట్ ఫెయిల్యూర్ వ్యాధిగ్రస్తులు చాలామంది హఠాత్తుగా కన్నుమూస్తుంటారు. గుండెకొట్టుకోవడంలో అసాధారణమైన హెచ్చుతగ్గులు ఇందుకు దారితీస్తుంటాయి. మీరు ఇప్పటికే జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసుకున్నందున, మీరు చెప్పిన వివరాల ప్రకారం పరిస్థితి తీవ్రంగా ఉన్నందువల్ల అధిక ప్రాధాన్యతతో బ్రెయిన్‌డెడ్ వ్యక్తి నుంచి మీకు గుండె కేటాయింపు జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా గుండెమార్పిడి అవకాశాన్ని ఉపయోగించుకోండి.
కార్డియోమయోపతి అంటే ఏమిటి..?
నా వయసు 38 ఏళ్లు. ఈ మధ్య కొంతకాలం నుంచి తరచూ శ్వాస అందని పరిస్థితి ఏర్పడుతోంది. విపరీతమైన అలసటతో పాటు కాళ్లవాపు కూడా కనిపిస్తోంది. నెల కిందట స్పృహతప్పి పడిపోయాను. మా ఫ్యామిలీ డాక్టర్‌కు చూపించుకుంటే కార్డియాలజిస్ట్ వద్దకు పంపారు. ఆయన ‘కార్డియో మయోపతి’ కావచ్చని అంటూ పరీక్షలు చేయిస్తున్నారు. ఈ వ్యాధి ఏమిటి? చికిత్స ఏమిటి? దయచేసి వివరంగా తెలపండి. – బి. నర్సిమ్ములు, ఆర్మూరు
కార్డియో మయోపతీ గుండె కండరాలకు సంబంధించిన వ్యాధి. ప్రారంభంలో ఎలాంటి ప్రత్యేక లక్షణాలూ వ్యక్తం కావు. మీలో కనిపిస్తున్న లక్షణాలు కార్డియోమయోపతినే సూచిస్తున్నాయి. దీన్ని గుర్తించి చికిత్స చేయడంలో జాప్యం జరిగితే అది అకాలమరణానికి దారితీయవచ్చు. చాలా కారణాల వల్ల డయలేటెడ్ కార్డియోమయోపతి రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని కుటుంబాలలో ఈ వ్యాధి వంశపారంపర్యంగా వస్తుంటుంది. కార్డియో మయోపతిలో మూడు ప్రధాన రకాలు కనిపిస్తాయి. అవి డయలేటెడ్ కార్డియో మయోపతి, హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతి, రెస్ట్రిక్టెడ్ కార్డియోమయోపతి.
వైరస్‌లతో ఇన్ఫెక్షన్, అదుపుతప్పిన అధిక రక్తపోటు (హైబీపీ), గుండె కవాటాలకు సంబంధించిన సమస్యలు, మితిమీరి మద్యపానం ఈ వ్యాధికి దారితీసే ప్రధాన కారణాలు. కొన్ని కుటుంబాలలో జన్యువుల మార్పు లేదా మ్యూటేషన్ కారణంగా వంశపారంపర్యంగా డయలేటెడ్ కార్డియోమయోపతి కనిపిస్తుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి డయలేటెడ్ కార్డియోమయోపతి ఉంటే పిల్లల్లో సగం మందికి ఈ వ్యాధి సంక్రమిస్తుంది. చాలా సందర్భాల్లో డయలేటెడ్ కార్డియోమయోపతి నెమ్మదిగా అభివృద్ధిచెందుతుంది. కానీ కొంతమందిలో వ్యాధి నిర్ధారణ కావడానికి ముందే తీవ్రమైన లక్షణాలు వ్యక్తమవుతుంటాయి. శ్వాస తీసుకోవడం కష్టం ఉండటం, పొట్ట – చీలమండ వాపు, విపరీతమైన అలసట, గుండెదడ డయలేటెడ్ కార్డియోమయోపతిలో కనిపించే ప్రథమ లక్షణాలు. కార్డియోమయోపతి కారణంగా గుండె కొట్టుకోవడంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు (అరిథ్మియాసిస్), ఛాతీలో నొప్పి, రక్తం గడ్డకట్టడం వంటి మరికొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వాటి తీవ్రతను బట్టి చికిత్స చేస్తారు. అధిక రక్తపోటు, గుండెస్పందనల్లో విపరీతమైన హెచ్చుతగ్గులను మందులతో అదుపు చేస్తారు. గుండెకొట్టుకోవడంలో అసాధారణ మార్పును అదుపుచేయడానికి అవసరమైతే పేస్‌మేకర్ అమర్చుతారు. ఇక కార్డియోమయోపతిలోని మిగతా రెండు రకాలు పూర్తిగా వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధులు. హైపర్ ట్రోఫిక్ రకంలో గుండెకండరాలు, గుండెగోడలు మందంగా తయారవుతాయి. రెస్ట్రిక్టివ్ రకంలో గుండెగదుల్లో రక్తం భర్తీ అయ్యేందుకు అవసరమైన ఒత్తిడికి సంబంధించిన లోటు ఏర్పడుతుంది. హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతి వ్యాధిగ్రస్తుల్లో గుండె కండరాలు, గోడలు మందంగా మారడం అందరిలో ఒకేలా ఉండదు. మొత్తం కార్డియోమయోపతి కేసుల్లో హైపర్‌ట్రోఫిక్ రకానికి చెందినవి 4 శాతం ఉంటే, రెస్ట్రిక్టెడ్ కార్డియోమయోపతి కేసులు ఒక శాతం మాత్రమే ఉంటాయి.
హైపోట్రోఫిక్, రెస్ట్రిక్టివ్ రకాల కార్డియోమయోపతీలో చికిత్స ప్రధానంగా వ్యాధి లక్షణాలను అదుపు చేయడం, పరిస్థితి విషమించకుండా అదుపు చేయడం లక్ష్యంగా జరుగుతుంది. గుండె ఏ మేరకు నష్టపోయింది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్న అంశాల ఆధారంగా డాక్టర్లు చికిత్సను నిర్ణయిస్తారు. అధికరక్తపోటు, గుండెకొట్టుకోవడంలో అసాధారణ పరిస్థితి వంటి లక్షణాలను అదుపు చేయడానికి డాక్టర్లు మందులు ఇస్తారు. హృదయస్పందనలు నిరంతరం సక్రమంగా జరిగేలా చూడటానికి అవసరాన్ని బట్టి పేస్‌మేకర్‌ను అమర్చుతారు. గుండెకొట్టుకోవడంలోని లోటుపాట్లు ప్రాణాపాయానికి దారితీసేలా కనిపిస్తే దాన్ని సరిచేయడానికి ఐసీడీ (ఇంప్లాంటబుల్ కార్డియాక్ డిఫిబ్రిలేటర్) పరికరాన్ని అమర్చుతారు.
డాక్టర్ పి.వి. నరేష్‌కుమార్, సీనియర్ కార్డియో థొరాసిక్,
హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్.
Comments
Please login to add a commentAdd a comment