పెంచుకున్న ప్రేమను పంచిపెట్టిన అమ్మ | Increase of love To Mother distribution | Sakshi
Sakshi News home page

పెంచుకున్న ప్రేమను పంచిపెట్టిన అమ్మ

Published Tue, May 12 2015 11:25 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

మే 8న హైదరాబాద్ నిమ్స్‌లో జరిగిన ‘జీవన్‌దాన్’ కార్యక్రమంలో తన కుమారుడు ప్రతీన్‌ను తలుచుకుంటూ ఉద్వేగానికి లోనైన రత్నమాల - Sakshi

మే 8న హైదరాబాద్ నిమ్స్‌లో జరిగిన ‘జీవన్‌దాన్’ కార్యక్రమంలో తన కుమారుడు ప్రతీన్‌ను తలుచుకుంటూ ఉద్వేగానికి లోనైన రత్నమాల

కన్నీటితో కూడా చెట్టుకు ప్రాణం పోయొచ్చు అనుకున్నది ఈ అమ్మ. సేవను మాటల్లోకన్నా చేతల్లోనే చూపించాలనుకుంది ఈ అమ్మ. దండ వేసి పరిమళాల్ని తనకే పరిమితం చేయకూడదనుకుంది ఈ అమ్మ. దీపం పెట్టి ఆ వెలుగుని తన ఇంటి గోడల్లోనే బంధించకూడదనుకుంది ఈ అమ్మ. కొడుకైనా సరే మట్టిపాలు చేయకూడదని... వాడి ఉనికి బూడిదలో పోసిన పన్నీరు కాకూడదని...పెంచుకున్న మమకారాన్ని పంచిపెట్టింది ఈ అమ్మ.
 
‘‘నా ఆయుష్షు 60 ఏళ్లే. కానీ నా కొడుకు ఆయుష్షు 480 ఏళ్లు’’ అని చెప్పారు రత్నమాల. కొడుకు గొప్పతనాన్ని తెలియజేస్తుంటే ఆమె కంఠం జీరబోయింది. కనుకొలుకుల్లో నీరు నిలిచింది. ఎనిమిది మందికి పునర్జన్మను తన కొడుకు ప్రతీన్ కుమార్ ద్వారా ఇచ్చిన రత్నమాల వరంగల్ జిల్లా వాసి. రత్నమాల భర్త ఏడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఇద్దరు పిల్లల పెంపకం కోసం తను ఓ చిన్న ఉద్యోగంలో చేరింది. పిల్లలే లోకంగా బతికింది. వారిని చదివించింది. ‘నాన్నలేడని బాధపడకమ్మా! నిన్నూ, చెల్లిని బాగా చూసుకుంటాను’ అని చెప్పిన కొడుకు అర్ధంతరంగా దూరమయ్యాడు. సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పిన వాడు మరణాన్నే తన కానుకగా ఇచ్చాడు.
 
‘వస్తానమ్మా’ అని చెప్పాడు...
కొడుకు బి.టెక్, కూతురు బి.డి.ఎస్ చదువుతున్నారు. ఇంకో ఏడాది కష్టపడితే చాలు బిడ్డలిద్దరూ ఉద్యోగాల్లో స్థిరపడతారు అనుకుంది. కానీ, దేవుడు మరొకటి తలచాడు. కిందటేడాది నవంబర్ 25న స్నేహితున్ని కలవడానికని వెళ్లిన ప్రతీన్ అర్థరాత్రి ఫోన్ చేసి అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ‘ఇంకా మేల్కొనే ఉన్నావా, ఇంటికి ఎప్పుడు వస్తున్నావ్’ అని అడిగితే ‘నీకు విషెష్ చెప్పడానికే మేల్కొన్నాను. ఇప్పుడు పడుకుంటానమ్మా! ఈ రోజు ఫ్రెండ్ ఇంట్లోనే ఉంటున్నాగా. రేపు పొద్దున్నే వచ్చేస్తాను. నీకో సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను..’ అన్నాడు. ‘నీకన్నా నాకు గిఫ్ట్‌లు ఏముంటాయిరా’ అంటే ‘థాంక్యూ అమ్మా’ అంటూ ఫోన్‌లో అమ్మకు ముద్దిచ్చాడు. ఆమె నవ్వుతూనే గుడ్‌నైట్ చెప్పి ఫోన్ పెట్టేసింది.
 
సర్‌ప్రైజ్ ఇస్తానన్నాడు...
ఉదయాన్నే రత్నమాలకు ఫోన్ వచ్చింది ‘మీ అబ్బాయికి రోడ్డు ప్రమాదం జరిగింద’ని. హతాశురాలైంది రత్నమాల. ఉన్నఫళాన ఆసుపత్రికి చేరుకుంది. అయ్యప్పదుస్తుల్లో రక్తసిక్తమైన ప్రతీన్. మాట మాత్రమైనా చెప్పకుండా మాల వేసుకున్నాడు. ‘‘పై చదువులకు అమెరికా వెళ్లడానికి పరీక్షకు సిద్ధపడుతున్నాడు. కుదురుగా కూర్చోని చదవడానికి దీక్ష అవసరం అనేవాడు. తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్న దైవభక్తి, చదువుకు ఎక్కడా ఆటంకం కలగకూడదని తీసుకున్న నిర్ణయమ’’దని తర్వాత తెలిసింది. ఏమీ మాట్లాడలేని స్థితి నాది. ప్రతీన్‌ను పరీక్షించిన వైద్యులు వెంటనే హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రతీన్ బ్రెయిన్ డెడ్ అయ్యాడని చెప్పారు. పుట్టిన రోజుకు తన మరణాన్ని సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఇస్తాడని ఊహించని నా ... జీవితంలో ఎన్ని ఒడిదొడుకులనైనా తట్టుకోవచ్చు. కానీ, కన్నబిడ్డను కోల్పోవడం అంటేనే...’’ వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ వివరించారు రత్నమాల.
 
సేవే పరమావధిగా....
నలుగురికి సాయపడటం అంటే ఎప్పుడూ ముందుండే ప్రతీన్ తల్లి పుట్టిన రోజున తప్పక రక్తదానం చేసేవాడు. తన స్నేహితులచేతనూ రక్తదానం చేయించేవాడు. ‘‘23 ఏళ్ల కొడుకు... ఎంతో జీవితం చూడాల్సిన వాడు. అంతలోనే కనుమరుగైపోతున్నాడు. ఎంతో ఆపురూపంగా ఈ చేతులతో పెంచుకున్నాను. అలాంటిది, ఆ శరీరాన్ని నిప్పు పాల్జేయ్యాలా, మట్టిలో కలిపేయాలా.. ఆ ఆలోచన నన్ను కుదురుగా ఉండనివ్వలేదు. వాడు ఈ లోకంలో బతికే ఉండాలి... అందుకే అక్కడి వైద్యులతో మాట్లాడాను. నా కొడుకు అవయవాలు మరొకరికి ఉపయోగపడితే వాడి సేవా నిరతికి ఓ అర్థం చేకూరుతుందని చెప్పాను.

అంగీకార పత్రాలతోపాటు అన్ని ఏర్పాట్లూ సిద్ధమయ్యాయి. గుండె, కాలేయం, కళ్లు.... ఇలా ఎనిమిది అవయవాలు మరో ఎనిమిది మంది చావుబతుకులతో పోరాడుతున్నవారికి కొత్త జన్మను ఇచ్చాయి. వారెవరో నాకు తెలియదు. కానీ, నా కొడుకు ఎనిమిది అవతారాలు దాల్చి ఈ ప్రపంచంలో ఇప్పటికీ ఉన్నాడు. ఒక్క జన్మలోనే 8 జన్మలు... అంటే 480 ఏళ్లు అన్నట్టే కదా! గతంలో నేను ఇద్దరు బిడ్డలకు తల్లిని మాత్రమే. ఇప్పుడు మరో ఎనిమిది మందికీ తల్లినయ్యాను. వారెక్కడ ఉన్నా నన్నూ, నా కొడుకును తలుచుకుంటూనే ఉంటారు’’ అంటూ ఉబికివస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ చెప్పారు రత్నమాల. అమ్మ గొప్పతనాన్ని, ఆమె త్యాగనిరతిని చాటి చెప్పాలని మళ్ళీ మళ్లీ ఆమె కడుపున పుడుతూనే ఉన్నాడు దేవుడు. ఒక బిడ్డగా ఆమెకు పుట్టి, మనందరికి దారి చూపిస్తున్నాడు. ఆ దారిలో మనమూ వెళదాం. అవయవదానం అంగీకారపత్రంపై నేడే సంతకం చేద్దాం.
 - నిర్మలారెడ్డి
ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్

 
అవగాహనలో ముందంజ...
మొట్టమొదటి అవయవదానం (కార్నియల్ ట్రాన్స్‌ప్లాంట్) 1905లో జరిగింది.
ప్రపంచ దేశాల్లో అవయవదానం అవగాహనలో స్పెయిన్ ముందంజలో ఉంది. ఇక్కడ కోటికి 34 మంది అవయదాతలుగా ఉన్నారు.
అమెరికాలో కిందటేడాది 18 ఏళ్ల వయసున్న వారు 5,538 మంది అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు.
మనదేశంలో ప్రతియేటా 90 శాతం మంది  అవయవదాతలు లేని కారణంగా మరణిస్తున్నారు.
మనదేశంలో 25,000 వేల మందికి కాలేయ మార్పిడి అవసరం ఉంటే ప్రస్తుతం 800 మందికే ఆ అవకాశం ఉంది.
మనదేశంలో అవయవదానం చేసేవారి జాబితాలో వరుసగా ముందు వరసలో తమిళనాడు ఉండగా ఐదో స్థానంలో తెలుగురాష్ట్రాలు ఉన్నాయి.
ఆర్థిక, అవగాహన లేమి కారణంగా భారత్, ఆఫ్రికాలు చివరిస్థానంలోఉన్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం (2013) భారతదేశంలో కోటికి 10 మంది మాత్రమే అవయవదానం చేశారు. కానీ యేటా 5 లక్షల మంది అవయవలోపం కారణంగా మరణిస్తున్నారు.
 
ప్రతి ఏడు సంవత్సరాలకు మన శరీరంలోని కణాలన్నీ కొత్తవిగా మారిపోయినంత మాత్రాన మన అస్థిత్వం ఒరిజినాలిటీ కోల్పోతుందా? ‘షిప్ ఆఫ్ థీసియస్’లో పాడైపోయిన చెక్కల్ని తొలగించి కొత్త చెక్కల్ని అమర్చినంతమాత్రాన దాని ఉనికి లేకుండా పోతుందా?
 
అవయవదానం థీమ్‌తో ఆమిర్‌ఖాన్ భార్య కిరణ్‌రావు సమర్పించిన సినిమానే ‘షిప్ ఆఫ్ థీసియస్’. 2013లో ఈ సినిమా బ్రోచర్ విడుదల సందర్భంగా అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, దీపికపదుకొనె, షారూఖ్‌ఖాన్.. మొదలైన 15 మంది బాలీవుడ్ నటీ నటులు అవయవదానం పత్రాలపై తమ అంగీకారం తెలుపుతూ సంతకాలు చేశారు.

 
అక్కినేని నాగార్జున, అక్కినేని అమల ఎయిడ్స్ అవగాహనకు భారీ ప్రచారం కల్పించారు. అదేవిధంగా అవయవదానం పట్ల అంగీకారాన్ని తెలుపుతూ పత్రాలపై సంతకం చేశారు.
 
మరణానంతరం నా శరీరంలోని అవయవాలన్నీ దానం చేసేలా, ఇప్పటికే వాగ్దానపత్రంపై సంతకాలు చేశాను. అలాగే, మా ఇంట్లో అందరూ ఆర్గాన్ డొనేషన్ చేస్తూ, పత్రాలు రాసిచ్చారు.
- త్రిష, నటి
 
మోహన్‌ఫౌండేషన్ 10వ వార్షికోత్సవ సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న నేనూ అవయవదానం చేశాను. మానవత్వంగల ప్రతి ఒక్కరూ అవయవదానం తప్పనిసరిగా చేయాలి. - నవదీప్, నటుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement