Jeevandhan program
-
అవయవదానం.. ఆరేళ్లలో మూడింతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అవయవదానంపై అవగాహన పెరుగుతోంది. ఆరేళ్లలో దాతల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. 2013లో అవయవదానాలు 188 కాగా గతేడాది 573 కు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం జీవన్‌దాన్ అనే పథకాన్ని 2014లో ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా బ్రెయిన్‌డెడ్ కేసుల నుంచి అవయవాలు సేకరిస్తారు. వెబ్సైట్లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకుంటే, వారికి ప్రభుత్వం ఆర్గాన్ డోనర్ కార్డు అందజేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో 2002లో తొలిసారి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. ప్రతి సంవత్సరం వేలాది మంది అవయవాల మార్పిడి కోసం ప్రయత్నించి విఫలమై మరణిస్తున్నారు. దీంతో అవయవదానాలపై మరింత అవగాహన పెరగాల్సి ఉందని వైద్యులు అంటున్నారు. ఎవరు దానం చేయవచ్చు? ఏ ఏ అవయవాలు దానం చేయవచ్చు, ఎవరు చేయవచ్చు అనే సందేహాలున్నాయి. జీవించి ఉండగానే కొన్ని అవయవాలు, వాటి భాగాలను దానం చేయటం ఒక పద్ధతైతే, మరణించిన తర్వాత దానం చేయటం మరో పద్ధతి. ఎవరైనా తాము చనిపోయిన తర్వాత అవయవ దానం చేయాలని సంకల్పిస్తే, అలాంటి వారు తమ రక్త సంబంధీకులు, బంధువుల అనుమతి, అంగీకారంతో అవయవదానపత్రంపై సంతకాలు చేసి అధికారులకు సమర్పించవచ్చు. బ్రెయిన్‌డెడ్ అయినవారిలో చాలా అవయవాలు అవయవ మార్పిడికి అనువుగా ఉంటాయి. మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాలుగా చెప్పుకునే కళ్లు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె కవాటాలు, చర్మం, ఎముకలు, నరాలు తదితర అవయవాలన్నింటిని అవయవ మార్పిడికి ఉపయోగించవచ్చు. మృతి చెందిన వారినుంచి సేకరించిన అవయవాలను ఉపయోగించి అనేకమంది ప్రాణాలను కాపాడవచ్చు. పెరిగిన డిమాండ్... సగమే లభ్యత అవయవ లభ్యత ఎక్కువగా లేనందున మరణాలు జరుగుతూనే ఉన్నాయి. అవస రాలకు, లభ్యతకు పొంతనలేదు. గత ఆరేళ్లలో 4,728 మందికి అవయవాలు అవసరమైతే 2,402 మందికి మాత్రమే వాటిని అందించ గలిగారు. ప్రస్తుతం జీవన్‌దాన్ నెట్‌వర్క్‌తో అనుసంధానమైన ఆస్పత్రులకు రొటేషన్ పద్ధ తుల్లో రోగికి అవయవాలు అందేలా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో ఇలాంటి ఆస్పత్రులు 27 ఉన్నాయి. ఒత్తిళ్లు, పలుకుబడితో అవయవాలు పొందే పరిస్థితి ఎక్కడాలేదు. ఈ 27 ఆస్పత్రుల్లోని రోగుల వివరాలూ, వారి ప్రాధాన్యతల వారీగా అనుసంధానమై ఉన్నాయి. దాంతో కేటాయింపుల్లో ఏమాత్రం పొరపాటుకు తావులేదని జీవన్‌దాన్ అధికారులు అంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రులతోపాటు నిమ్స్, గాంధీ, ఉస్మానియాల్లోనూ అవయవ మార్పిడులు చేస్తున్నారు. అవయవాలు కావాల్సిన రోగులు కూడా జీవన్‌దాన్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేయించుకోవాలి. వారికి సీరియల్ నంబరు ఇస్తారు. అవయవదానం చేసే కేసులు వచ్చినప్పుడు సీరియల్ నంబర్ ప్రకారం అవకాశం కల్పిస్తారు. ఎముక మజ్జ, కిడ్నీ, కాలేయంలో భాగం, ఊపిరితిత్తుల్లో కొంతభాగం, పాంక్రియాస్లో కొంతభాగం దానం ఇవ్వొచ్చు. ఎముక మజ్జ, కాలేయం, ఊపిరిత్తులు వంటివి రక్త సంబంధీకులవే బాగా పనికొస్తాయి. బ్రెయిన్‌డెడ్‌ను ఎలా నిర్ధారిస్తారు? ప్రమాదం వల్లగాని, నివారణకాని వ్యాధి వల్లగాని మనిషి అపస్మారకస్థితిలోకి చేరుకుంటాడు. కృత్రిమ ఆక్సిజన్ ద్వారా రక్త ప్రసరణ జరుగుతున్నప్పటికీ తిరిగి స్పృలోకి రాని స్థితిని బ్రెయిన్ డెడ్‌గా పేర్కొంటారు. ఆ సమయంలో గుండె స్పందనలూ, ఊపిరితిత్తుల పనితీరు, కిడ్నీలు, కాలేయం సజీవంగానే ఉంటాయి. రోగి ఎట్టి పరిస్థితుల్లోనూ బతికే అవకాశం ఉండదు. ఈ పరిస్థితిని నిర్ధారించాలంటే కొన్ని నిర్దిష్ట నిబంధనలున్నాయి. న్యూరాలజీ, న్యూరోసర్జరీ, అనస్థిసిస్ట్, జనరల్ ఫిజీషియన్‌లతోపాటు సదరు ఆస్పత్రి సూపరింటెండెంట్లతో కూడిన ఐదుగురు సభ్యులతో కూడిన బృందం కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాల ద్వారా బ్రెయిన్‌డెడ్ అనే విషయాన్ని నిర్ధారణ చేస్తారు. అప్పుడు ఆ బ్రెయిన్‌డెడ్‌కు గురైనవారి బంధువులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగమైన ’జీవన్‌దాన్’బృందం సభ్యులు కలసి, మాట్లాడి వారిని అవయవదానానికి ఒప్పిస్తారు. -
అవయవదానంతో ఐదుగురికి జీవితం
గుంటూరు మెడికల్:తాను చనిపోతూ తన అవయవదానం ద్వారా ఐదుగురికి నూతన జీవితాన్ని దుర్గారావు ప్రసాదించారు. గుంటూరు రమేష్ హాస్పిటల్లో జీవన్‌ధాన్ పథకం ద్వారా అవయవాలను సేకరించి చికిత్స కోసం ఎదురు చూస్తున్నవారికి అందజేశారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట శృంగావరప్పాడు గ్రామానికి చెందిన బలే దుర్గారావు (22) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 8న ఇంటి వద్ద మెట్లపై జారిపడి తలకు గాయమైంది.కుటుంబ సభ్యులు అతడిని చికిత్స కోసం భీమవరం, ఏలూరు ఆశ్రమ ఆస్పత్రి, విజయవాడ ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం అందించి, ఈనెల 18న గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. దుర్గారావును పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెత్‌గా నిర్ధారించి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. రమేష్ హాస్పిటల్ వైద్యులు జీవన్ ధాన్ పథకం ద్వారా దుర్గారావు అవయవాలను సేకరించి ఆస్పత్రుల్లో ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్న బాధితులకు తరలించారు. లివర్‌ను విజయవాడ మణిపాల్ హాస్పిటల్‌కు, ఒక కిడ్నిని గుంటూరు వేదాంత హాస్పిటల్‌కు, మరో కిడ్నిని శ్రీలక్ష్మి సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌కు, కళ్లను గుంటూరులోని సుదర్శిని హాస్పిటల్‌కు పంపారు. దుర్గారావుకు నాలుగేళ్ల కిందట రాధతో వివాహమైంది. మూడేళ్ల అఖిల, ఏడాది వయస్సు ఉన్న హాసిని ఉన్నారు. ఆపరేషన్ ప్రక్రియలో డాక్టర్ శైలజ, డాక్టర్ కార్తీక్, డాక్టర్ ప్రకాశం పాల్గొన్నారు. ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆపరేషన్ ప్రక్రియ జరిగినట్లు రమేష్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్‌బాబు తెలిపారు. -
పెంచుకున్న ప్రేమను పంచిపెట్టిన అమ్మ
కన్నీటితో కూడా చెట్టుకు ప్రాణం పోయొచ్చు అనుకున్నది ఈ అమ్మ. సేవను మాటల్లోకన్నా చేతల్లోనే చూపించాలనుకుంది ఈ అమ్మ. దండ వేసి పరిమళాల్ని తనకే పరిమితం చేయకూడదనుకుంది ఈ అమ్మ. దీపం పెట్టి ఆ వెలుగుని తన ఇంటి గోడల్లోనే బంధించకూడదనుకుంది ఈ అమ్మ. కొడుకైనా సరే మట్టిపాలు చేయకూడదని... వాడి ఉనికి బూడిదలో పోసిన పన్నీరు కాకూడదని...పెంచుకున్న మమకారాన్ని పంచిపెట్టింది ఈ అమ్మ. ‘‘నా ఆయుష్షు 60 ఏళ్లే. కానీ నా కొడుకు ఆయుష్షు 480 ఏళ్లు’’ అని చెప్పారు రత్నమాల. కొడుకు గొప్పతనాన్ని తెలియజేస్తుంటే ఆమె కంఠం జీరబోయింది. కనుకొలుకుల్లో నీరు నిలిచింది. ఎనిమిది మందికి పునర్జన్మను తన కొడుకు ప్రతీన్ కుమార్ ద్వారా ఇచ్చిన రత్నమాల వరంగల్ జిల్లా వాసి. రత్నమాల భర్త ఏడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఇద్దరు పిల్లల పెంపకం కోసం తను ఓ చిన్న ఉద్యోగంలో చేరింది. పిల్లలే లోకంగా బతికింది. వారిని చదివించింది. ‘నాన్నలేడని బాధపడకమ్మా! నిన్నూ, చెల్లిని బాగా చూసుకుంటాను’ అని చెప్పిన కొడుకు అర్ధంతరంగా దూరమయ్యాడు. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పిన వాడు మరణాన్నే తన కానుకగా ఇచ్చాడు. ‘వస్తానమ్మా’ అని చెప్పాడు... కొడుకు బి.టెక్, కూతురు బి.డి.ఎస్ చదువుతున్నారు. ఇంకో ఏడాది కష్టపడితే చాలు బిడ్డలిద్దరూ ఉద్యోగాల్లో స్థిరపడతారు అనుకుంది. కానీ, దేవుడు మరొకటి తలచాడు. కిందటేడాది నవంబర్ 25న స్నేహితున్ని కలవడానికని వెళ్లిన ప్రతీన్ అర్థరాత్రి ఫోన్ చేసి అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ‘ఇంకా మేల్కొనే ఉన్నావా, ఇంటికి ఎప్పుడు వస్తున్నావ్’ అని అడిగితే ‘నీకు విషెష్ చెప్పడానికే మేల్కొన్నాను. ఇప్పుడు పడుకుంటానమ్మా! ఈ రోజు ఫ్రెండ్ ఇంట్లోనే ఉంటున్నాగా. రేపు పొద్దున్నే వచ్చేస్తాను. నీకో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను..’ అన్నాడు. ‘నీకన్నా నాకు గిఫ్ట్‌లు ఏముంటాయిరా’ అంటే ‘థాంక్యూ అమ్మా’ అంటూ ఫోన్లో అమ్మకు ముద్దిచ్చాడు. ఆమె నవ్వుతూనే గుడ్‌నైట్ చెప్పి ఫోన్ పెట్టేసింది. సర్ప్రైజ్ ఇస్తానన్నాడు... ఉదయాన్నే రత్నమాలకు ఫోన్ వచ్చింది ‘మీ అబ్బాయికి రోడ్డు ప్రమాదం జరిగింద’ని. హతాశురాలైంది రత్నమాల. ఉన్నఫళాన ఆసుపత్రికి చేరుకుంది. అయ్యప్పదుస్తుల్లో రక్తసిక్తమైన ప్రతీన్. మాట మాత్రమైనా చెప్పకుండా మాల వేసుకున్నాడు. ‘‘పై చదువులకు అమెరికా వెళ్లడానికి పరీక్షకు సిద్ధపడుతున్నాడు. కుదురుగా కూర్చోని చదవడానికి దీక్ష అవసరం అనేవాడు. తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్న దైవభక్తి, చదువుకు ఎక్కడా ఆటంకం కలగకూడదని తీసుకున్న నిర్ణయమ’’దని తర్వాత తెలిసింది. ఏమీ మాట్లాడలేని స్థితి నాది. ప్రతీన్‌ను పరీక్షించిన వైద్యులు వెంటనే హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రతీన్ బ్రెయిన్ డెడ్ అయ్యాడని చెప్పారు. పుట్టిన రోజుకు తన మరణాన్ని సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ఇస్తాడని ఊహించని నా ... జీవితంలో ఎన్ని ఒడిదొడుకులనైనా తట్టుకోవచ్చు. కానీ, కన్నబిడ్డను కోల్పోవడం అంటేనే...’’ వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ వివరించారు రత్నమాల. సేవే పరమావధిగా.... నలుగురికి సాయపడటం అంటే ఎప్పుడూ ముందుండే ప్రతీన్ తల్లి పుట్టిన రోజున తప్పక రక్తదానం చేసేవాడు. తన స్నేహితులచేతనూ రక్తదానం చేయించేవాడు. ‘‘23 ఏళ్ల కొడుకు... ఎంతో జీవితం చూడాల్సిన వాడు. అంతలోనే కనుమరుగైపోతున్నాడు. ఎంతో ఆపురూపంగా ఈ చేతులతో పెంచుకున్నాను. అలాంటిది, ఆ శరీరాన్ని నిప్పు పాల్జేయ్యాలా, మట్టిలో కలిపేయాలా.. ఆ ఆలోచన నన్ను కుదురుగా ఉండనివ్వలేదు. వాడు ఈ లోకంలో బతికే ఉండాలి... అందుకే అక్కడి వైద్యులతో మాట్లాడాను. నా కొడుకు అవయవాలు మరొకరికి ఉపయోగపడితే వాడి సేవా నిరతికి ఓ అర్థం చేకూరుతుందని చెప్పాను. అంగీకార పత్రాలతోపాటు అన్ని ఏర్పాట్లూ సిద్ధమయ్యాయి. గుండె, కాలేయం, కళ్లు.... ఇలా ఎనిమిది అవయవాలు మరో ఎనిమిది మంది చావుబతుకులతో పోరాడుతున్నవారికి కొత్త జన్మను ఇచ్చాయి. వారెవరో నాకు తెలియదు. కానీ, నా కొడుకు ఎనిమిది అవతారాలు దాల్చి ఈ ప్రపంచంలో ఇప్పటికీ ఉన్నాడు. ఒక్క జన్మలోనే 8 జన్మలు... అంటే 480 ఏళ్లు అన్నట్టే కదా! గతంలో నేను ఇద్దరు బిడ్డలకు తల్లిని మాత్రమే. ఇప్పుడు మరో ఎనిమిది మందికీ తల్లినయ్యాను. వారెక్కడ ఉన్నా నన్నూ, నా కొడుకును తలుచుకుంటూనే ఉంటారు’’ అంటూ ఉబికివస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ చెప్పారు రత్నమాల. అమ్మ గొప్పతనాన్ని, ఆమె త్యాగనిరతిని చాటి చెప్పాలని మళ్ళీ మళ్లీ ఆమె కడుపున పుడుతూనే ఉన్నాడు దేవుడు. ఒక బిడ్డగా ఆమెకు పుట్టి, మనందరికి దారి చూపిస్తున్నాడు. ఆ దారిలో మనమూ వెళదాం. అవయవదానం అంగీకారపత్రంపై నేడే సంతకం చేద్దాం. - నిర్మలారెడ్డి ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ అవగాహనలో ముందంజ... ⇒ మొట్టమొదటి అవయవదానం (కార్నియల్ ట్రాన్స్‌ప్లాంట్) 1905లో జరిగింది. ⇒ ప్రపంచ దేశాల్లో అవయవదానం అవగాహనలో స్పెయిన్ ముందంజలో ఉంది. ఇక్కడ కోటికి 34 మంది అవయదాతలుగా ఉన్నారు. ⇒ అమెరికాలో కిందటేడాది 18 ఏళ్ల వయసున్న వారు 5,538 మంది అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. ⇒ మనదేశంలో ప్రతియేటా 90 శాతం మంది అవయవదాతలు లేని కారణంగా మరణిస్తున్నారు. ⇒ మనదేశంలో 25,000 వేల మందికి కాలేయ మార్పిడి అవసరం ఉంటే ప్రస్తుతం 800 మందికే ఆ అవకాశం ఉంది. ⇒ మనదేశంలో అవయవదానం చేసేవారి జాబితాలో వరుసగా ముందు వరసలో తమిళనాడు ఉండగా ఐదో స్థానంలో తెలుగురాష్ట్రాలు ఉన్నాయి. ⇒ ఆర్థిక, అవగాహన లేమి కారణంగా భారత్, ఆఫ్రికాలు చివరిస్థానంలోఉన్నాయి. ⇒ ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం (2013) భారతదేశంలో కోటికి 10 మంది మాత్రమే అవయవదానం చేశారు. కానీ యేటా 5 లక్షల మంది అవయవలోపం కారణంగా మరణిస్తున్నారు. ప్రతి ఏడు సంవత్సరాలకు మన శరీరంలోని కణాలన్నీ కొత్తవిగా మారిపోయినంత మాత్రాన మన అస్థిత్వం ఒరిజినాలిటీ కోల్పోతుందా? ‘షిప్ ఆఫ్ థీసియస్’లో పాడైపోయిన చెక్కల్ని తొలగించి కొత్త చెక్కల్ని అమర్చినంతమాత్రాన దాని ఉనికి లేకుండా పోతుందా? అవయవదానం థీమ్‌తో ఆమిర్‌ఖాన్ భార్య కిరణ్‌రావు సమర్పించిన సినిమానే ‘షిప్ ఆఫ్ థీసియస్’. 2013లో ఈ సినిమా బ్రోచర్ విడుదల సందర్భంగా అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, దీపికపదుకొనె, షారూఖ్‌ఖాన్.. మొదలైన 15 మంది బాలీవుడ్ నటీ నటులు అవయవదానం పత్రాలపై తమ అంగీకారం తెలుపుతూ సంతకాలు చేశారు. అక్కినేని నాగార్జున, అక్కినేని అమల ఎయిడ్స్ అవగాహనకు భారీ ప్రచారం కల్పించారు. అదేవిధంగా అవయవదానం పట్ల అంగీకారాన్ని తెలుపుతూ పత్రాలపై సంతకం చేశారు. మరణానంతరం నా శరీరంలోని అవయవాలన్నీ దానం చేసేలా, ఇప్పటికే వాగ్దానపత్రంపై సంతకాలు చేశాను. అలాగే, మా ఇంట్లో అందరూ ఆర్గాన్ డొనేషన్ చేస్తూ, పత్రాలు రాసిచ్చారు. - త్రిష, నటి మోహన్‌ఫౌండేషన్ 10వ వార్షికోత్సవ సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న నేనూ అవయవదానం చేశాను. మానవత్వంగల ప్రతి ఒక్కరూ అవయవదానం తప్పనిసరిగా చేయాలి. - నవదీప్, నటుడు