
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అవయవదానంపై అవగాహన పెరుగుతోంది. ఆరేళ్లలో దాతల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. 2013లో అవయవదానాలు 188 కాగా గతేడాది 573 కు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం జీవన్‌దాన్ అనే పథకాన్ని 2014లో ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా బ్రెయిన్‌డెడ్ కేసుల నుంచి అవయవాలు సేకరిస్తారు. వెబ్‌సైట్‌లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకుంటే, వారికి ప్రభుత్వం ఆర్గాన్ డోనర్ కార్డు అందజేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో 2002లో తొలిసారి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. ప్రతి సంవత్సరం వేలాది మంది అవయవాల మార్పిడి కోసం ప్రయత్నించి విఫలమై మరణిస్తున్నారు. దీంతో అవయవదానాలపై మరింత అవగాహన పెరగాల్సి ఉందని వైద్యులు అంటున్నారు.
ఎవరు దానం చేయవచ్చు?
ఏ ఏ అవయవాలు దానం చేయవచ్చు, ఎవరు చేయవచ్చు అనే సందేహాలున్నాయి. జీవించి ఉండగానే కొన్ని అవయవాలు, వాటి భాగాలను దానం చేయటం ఒక పద్ధతైతే, మరణించిన తర్వాత దానం చేయటం మరో పద్ధతి. ఎవరైనా తాము చనిపోయిన తర్వాత అవయవ దానం చేయాలని సంకల్పిస్తే, అలాంటి వారు తమ రక్త సంబంధీకులు, బంధువుల అనుమతి, అంగీకారంతో అవయవదానపత్రంపై సంతకాలు చేసి అధికారులకు సమర్పించవచ్చు. బ్రెయిన్‌డెడ్ అయినవారిలో చాలా అవయవాలు అవయవ మార్పిడికి అనువుగా ఉంటాయి. మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాలుగా చెప్పుకునే కళ్లు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె కవాటాలు, చర్మం, ఎముకలు, నరాలు తదితర అవయవాలన్నింటిని అవయవ మార్పిడికి ఉపయోగించవచ్చు. మృతి చెందిన వారినుంచి సేకరించిన అవయవాలను ఉపయోగించి అనేకమంది ప్రాణాలను కాపాడవచ్చు.
పెరిగిన డిమాండ్... సగమే లభ్యత
అవయవ లభ్యత ఎక్కువగా లేనందున మరణాలు జరుగుతూనే ఉన్నాయి. అవస రాలకు, లభ్యతకు పొంతనలేదు. గత ఆరేళ్లలో 4,728 మందికి అవయవాలు అవసరమైతే 2,402 మందికి మాత్రమే వాటిని అందించ గలిగారు. ప్రస్తుతం జీవన్‌దాన్ నెట్‌వర్క్‌తో అనుసంధానమైన ఆస్పత్రులకు రొటేషన్ పద్ధ తుల్లో రోగికి అవయవాలు అందేలా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో ఇలాంటి ఆస్పత్రులు 27 ఉన్నాయి. ఒత్తిళ్లు, పలుకుబడితో అవయవాలు పొందే పరిస్థితి ఎక్కడాలేదు. ఈ 27 ఆస్పత్రుల్లోని రోగుల వివరాలూ, వారి ప్రాధాన్యతల వారీగా అనుసంధానమై ఉన్నాయి. దాంతో కేటాయింపుల్లో ఏమాత్రం పొరపాటుకు తావులేదని జీవన్‌దాన్ అధికారులు అంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రులతోపాటు నిమ్స్, గాంధీ, ఉస్మానియాల్లోనూ అవయవ మార్పిడులు చేస్తున్నారు. అవయవాలు కావాల్సిన రోగులు కూడా జీవన్‌దాన్ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేయించుకోవాలి. వారికి సీరియల్ నంబరు ఇస్తారు. అవయవదానం చేసే కేసులు వచ్చినప్పుడు సీరియల్ నంబర్ ప్రకారం అవకాశం కల్పిస్తారు. ఎముక మజ్జ, కిడ్నీ, కాలేయంలో భాగం, ఊపిరితిత్తుల్లో కొంతభాగం, పాంక్రియాస్‌లో కొంతభాగం దానం ఇవ్వొచ్చు. ఎముక మజ్జ, కాలేయం, ఊపిరిత్తులు వంటివి రక్త సంబంధీకులవే బాగా పనికొస్తాయి.
బ్రెయిన్‌డెడ్‌ను ఎలా నిర్ధారిస్తారు?
ప్రమాదం వల్లగాని, నివారణకాని వ్యాధి వల్లగాని మనిషి అపస్మారకస్థితిలోకి చేరుకుంటాడు. కృత్రిమ ఆక్సిజన్ ద్వారా రక్త ప్రసరణ జరుగుతున్నప్పటికీ తిరిగి స్పృలోకి రాని స్థితిని బ్రెయిన్ డెడ్‌గా పేర్కొంటారు. ఆ సమయంలో గుండె స్పందనలూ, ఊపిరితిత్తుల పనితీరు, కిడ్నీలు, కాలేయం సజీవంగానే ఉంటాయి. రోగి ఎట్టి పరిస్థితుల్లోనూ బతికే అవకాశం ఉండదు. ఈ పరిస్థితిని నిర్ధారించాలంటే కొన్ని నిర్దిష్ట నిబంధనలున్నాయి. న్యూరాలజీ, న్యూరోసర్జరీ, అనస్థిసిస్ట్, జనరల్ ఫిజీషియన్‌లతోపాటు సదరు ఆస్పత్రి సూపరింటెండెంట్లతో కూడిన ఐదుగురు సభ్యులతో కూడిన బృందం కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాల ద్వారా బ్రెయిన్‌డెడ్ అనే విషయాన్ని నిర్ధారణ చేస్తారు. అప్పుడు ఆ బ్రెయిన్‌డెడ్‌కు గురైనవారి బంధువులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగమైన ’జీవన్‌దాన్’బృందం సభ్యులు కలసి, మాట్లాడి వారిని అవయవదానానికి ఒప్పిస్తారు.