సుబ్బారెడ్డి కుటుంబానికి ఆర్థిక సాయం | Organ Donor subbareddy family met ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

సుబ్బారెడ్డి కుటుంబానికి ఆర్థిక సాయం

Published Sat, Nov 12 2016 4:35 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

Organ Donor subbareddy family met ys jagan mohan reddy

హైదరాబాద్ : ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందిన 35 ఏళ్ల పెల్లేటి సుబ్బారెడ్డి గత అక్టోబర్ 2న రాత్రి జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తక్షణం స్థానిక నారాయణ ఆస్పత్రిలో చేర్పించగా తీవ్రంగా గాయపడిన సుబ్బారెడ్డి బ్రెయిన్ డెడ్గా వైద్యులు ప్రకటించారు.  చిన్నపాటి ప్రైవేటు పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సుబ్బారెడ్డి మరణం ఆ కుటుంబాన్ని దిక్కుతోచని స్థితిలో పడేసింది. రేపటి నుంచి కుటుంబం ఎలా గడవాలో తెలియని పరిస్థితి ఉన్నప్పటికీ ఆ కుటుంబం ఔదార్యం ప్రదర్శించి అవయవదానం చేయడానికి సిద్ధపడ్డారు. 
4వ తేదీ అవయవ దానం చేశారు. సుబ్బారెడ్డి ఊపిరితిత్తులను చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి, అలాగే గుండెను గుంటూరు ఆస్పత్రిలో ఉన్న రోగి కోసం, కాలేయం విజయవాడ ఆస్పత్రికి, కిడ్నీలు, కళ్లు నెల్లూరు, తిరుపతిలలో ఉన్న ఆస్పత్రులకు తరలించి మరణించిన సుబ్బారెడ్డి తన అవయవదానంలో మరో అయిదుగురికి ప్రాణం పోశారు.
 
చిన్నపాటి ప్రైవేటు పనులు చేసుకుంటున్న సుబ్బారెడ్డికి భార్య శివకుమారి, తల్లి సుబ్బమ్మ, పిల్లలు సమీర (9 సంవత్సరాలు), జశ్వంత్ (7 సంవత్సరాలు) ఉన్నారు. వారిది నిరుపేద కుటుంబం. ఇంటిపెద్ద చనిపోవడంతో ఆ కుటుంబం దిక్కులేకుండా పోయింది. ప్రభుత్వం నుంచిగానీ ఇతరుల నుంచి గానీ ఎలాంటి సహాయం అందకపోవడంతో వారు దిక్కులేని వాళ్లయ్యారు. 
 
ఆ విషయం తెలిసిన తర్వాత వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరగా, స్పందించిన వైఎస్సార్ సీపీ నేతలు, ప్రవాసాంధ్రులు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. కుటుంబంలోని పిల్లలు ఇద్దరి పేరిట చెరో లక్ష రూపాయలు, తల్లి పేరిట మరో 60 వేల రూపాయలు మొత్తంగా 2,60,000 ఆర్థిక సహాయం చేస్తామంటూ ప్రవాసాంధ్రులు ఆపన‍్నహస్తం అందించారు. వర్జీనియాకు చెందిన పాటిల్ సత్యారెడ్డి ఆ ఇద్దరు పిల్లలు చదువుకున్నంత కాలం వారికయ్యే ఫీజులు చెల్లించడానికి అంగీకరించారు. వర్జీనియాకే చెందిన రాంప్రసాదరెడ్డి బయ్యపరెడ్డి ఆ కుటుంబానికయ్యే ఇంటి ఖర్చును భరిస్తానని ప్రకటించారు.
 
వీధిన పడిన ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ రకంగా పలువురు ముందుకు రాగా, శనివారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో దాతలు ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పుట్టపర్తి వైఎస్సార్ సీపీ నాయకుడు డాక్టర్ హరికృష్ణ తదితరులు ఉన్నారు. డాక్టర్ హరికృష్ణ ఆ కుటుంబ పరిస్థితిని వైఎస్‌ జగన్కు వివరించగా, అదే సందర్భంగా ఎంపీ మేకపాటి ఆ కుటుంబానికి మరో 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఆ కుటుంబానికి తన వంతు కూడా చేయూతనందిస్తానని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
 
అవయవదానం చేసి నలుగురికి ప్రాణం పోసిన సుబ్బారెడ్డి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన సహాయం ప్రకటించిన వారందరినీ ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ చూపి హైదరాబాద్ వరకు రప్పించి సహాయాన్ని అందించినందుకు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement