
దర్శి (ప్రకాశం): వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యాలను టీవీలో చూసి పట్టరాని ఆనందం పొందిన ఓ అభిమాని.. ఉద్వేగానికి లోనై ప్రాణాలు వదిలాడు. మృతుని కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వెంకటాపురం ఎస్సీ కాలనీకి చెందిన బిల్లా ఇస్రాయేల్ (66) వైఎస్సార్ సీపీ వీరాభిమాని. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూసేందుకు గురువారం కుటుంబ సభ్యులంతా టీవీ ముందు కూర్చున్నారు.
‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను..’ అని జగన్ అనగానే.. ఇస్రాయేల్ పెద్దగా కేకలు, ఈలలు వేస్తూ అక్కడ ఉన్న వారందరిలో ఉత్సాహం నింపారు. ప్రమాణ స్వీకారం అయిన తరువాత జగన్ తన తల్లిని ఆప్యాయంగా కౌగిలించుకునే సమయంలో ఇస్రాయేల్ కుర్చీలో కూర్చుని.. ‘జగన్ ప్రమాణ స్వీకారం చేశాడు. ముఖ్యమంత్రి అయ్యాడు’ అంటూ ఉద్వేగంతో కూడిన ఆనందంలో తేలియాడారు. ఆ కొద్దిసేపటికే ప్రాణం వదిలాడు. కుటుంబ సభ్యులు ఆయనను కుర్చీలోంచి లేపేందుకు ప్రయత్నించగా చలనం లేదు. కాగా, ఎప్పుడూ తన ఇంటిపై వైఎస్సార్ సీపీ జెండా పెట్టుకుని ఉంటాడని ఇస్రాయేల్ భార్య వజ్రమ్మ కన్నీటి పర్యంతమైంది.
Comments
Please login to add a commentAdd a comment