సాక్షి, అమరావతి : ఓవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ అభ్యర్థుల ఎంపికపై సమీక్షలు మీద సమీక్షలు జరుపుతుంటే...మరోవైపు ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీమంత్రి, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురువారం ఎమ్మెల్సీ పదవితో పాటు టీడీపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుకు పంపించారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకు మంచి అనుబంధం ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబ సభ్యులు, మాగుంట అభిమానులు, శ్రేయోభిలాషుల నిర్ణయం మేరకే తాను టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. కాగా గత ఎన్నికల్లో మాగుంట ఒంగోలు నుంచి టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో స్థానిక సంస్థలు తరపున ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు నాయుడు మోసం చేశారు. గత మూడేళ్లుగా ఆయన టీడీపీలో తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment