రొండా అంజిరెడ్డి
ఒంగోలు: ప్రచార పిచ్చితో చంద్రబాబు ప్రజల ప్రాణాలు తీస్తున్నాడని, ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణాల రక్షణకు ప్రభుత్వం జీవో నంబర్ 1 తీసుకొస్తే దానిని టీడీపీ, జనసేన, సీపీఐలు విమర్శించడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి రొండా అంజిరెడ్డి మండిపడ్డారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరుకు సందుల్లో సమావేశాలు నిర్వహించి కందుకూరులో 8 మంది ప్రాణాలు, చీరెలు ఇస్తామంటూ అమాయక పేద ప్రజలను ఆశపెట్టిన కారణంగా ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారన్నారు.
ఇటువంటి మరణాలు పునరావృతం కారాదని, పేదల హృదయ వేదన అర్థం చేసుకున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జీవో నంబర్ ఒకటి తీసుకొచ్చారన్నారు. అది అర్థం చేసుకోకుండా పేదల ప్రాణాలు పోయినా ఫర్వాలేదు... తమ మీటింగ్‌లు మాత్రం యధాతథంగా జరగాలంటే ఎలా అంటూ ప్రశ్నించారు. ఇటువంటి చర్యలను ప్రజలు హర్షించరన్నారు.
కేవలం చంద్రబాబు ప్రచార పిచ్చి కారణంగానే 11 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. సీపీఐ, జనసేన, టీడీపీ మూడు కలిసి పనిచేసినా 2024 ఎన్నికల్లో జగన్‌ను సీఎం కాకుండా ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. తనకు శ్రీవెంకటేశ్వర పొలిటికల్ సర్వే సంస్థ ఉందని, ఎన్ని విధాలుగా సర్వేచేసినా ప్రజలు మాత్రం జగన్ వైపు ఉన్నారని, కేవలం ప్రచార ఆర్భాటం ద్వారా టీడీపీ మైలేజీ పెంచుకోవాలని చూస్తోందన్నారు. ప్రకాశం జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో కూడా వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగిస్తుందని, ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని పాతిక వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కనీసం ప్రతిపక్ష పార్టీ నేత అందుబాటులో లేకపోవడం, ఒక వేళ వస్తే పేదలను ఆదుకోవడానికి డబ్బు వెచ్చించాల్సి వస్తుందంటూ హైదరాబాదు, బెంగళూరులో దాక్కున్నారనే భావన సర్వత్రా వ్యక్తమవుతోందన్నారు.
చంద్రబాబు ఏదోలా జనాలను నమ్మించి టికెట్లు అంటగట్టాలని ఆరాట పడుతున్నారని, టీడీపీ నాయకులు పోటీ చేసి ఉన్నదంతా పోగొట్టుకుని తరువాత బాధపడేకంటే ముందుగానే ఆలోచించుకోవడం మంచిదని సూచించారు. ఇటీవల చంద్రబాబు పెట్టిన రెండు రకాల బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాలు కూడా ప్రజల్లో ఆయనకు వ్యతిరేకత పెంచేవిగానే ఉన్నాయన్నారు. మిణుగురు పురుగుల్లా చంద్రబాబు వద్దకు చేరవద్దని, దగ్గరకు వెళితే కాలిపోయేది మీరే అని గుర్తుంచుకోవాలని అన్నారు. మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు షేక్ మీరావలి మాట్లాడుతూ బాలినేనిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం దామచర్ల జనార్దన్ మానుకోవాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment