సాక్షి, విజయవాడ : టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి అన్నారు. ఏపీలో పేదవాడికి ఉన్నత విద్య అందని ద్రాక్షగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడు వందల ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే.. ప్రభుత్వం ఇప్పటి వరకు 1252 కోట్ల రూపాయలు బకాయి పడిందని అన్నారు. అయినప్పటికీ కేవలం రూ. 400 కోట్లు మాత్రమే బాకీ ఉన్నామంటూ కాకి లెక్కలు చెప్పడం దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. కాకినాడ జేఎన్‌టీయూ పరిధిలోని కాలేజీలలో ప్రభుత్వ కనుసన్నల్లో అవినీతి జరుగుతోందని ఆరోపించారు.
స్వర్ణయుగం మళ్లీ వస్తుంది
దివంగత నేత వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కులమతాలకు అతీతంగా ప్రతీ పేద విద్యార్థి ఉన్నత విద్య అభ్యసించేలా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పెట్టారని అంజిరెడ్డి గుర్తుచేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ యువత జీవితాలతో ఆడుకుంటోందని మండిపడ్డారు. విద్యా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి యువత, విద్యార్థులు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే విద్యార్థులతో సహా అన్ని వర్గాల కష్టాలు తీరతాయని, మరలా వైఎస్సార్ స్వర్ణయుగం వస్తుందని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment