
సోమాజిగూడ : బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువతి అవయవాలను ఆమె తల్లిదండ్రులు దానం చేసి మరికొందరి జీవితాలను నిలబెట్టారు. శనివారం జీవన్‌దాన్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా రామగిరికి చెందిన డీసీఎం డ్రైవర్ కె.మల్లిబాబు, లలితల కుమార్తె మౌనిక (21) స్థానిక ఎస్‌ఆర్‌టీఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. గతనెల 28న మధ్యాహ్నం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా.. ఆమెను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.
తీవ్ర గాయాలైన మౌనికను స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం మే 29న ఎల్బీనగర్‌లోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు చికిత్స చేస్తున్న న్యూరో ఫిజీషియన్ మౌనికకు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్థారించారు. ఆమె కుటుంబ సభ్యులకు జీవన్‌దాన్ ప్రతినిధులు అవయవ దానంపై కౌన్సిలింగ్ ఇవ్వగా అందుకు వారు అంగీకరించారు. దీంతో మౌనిక శరీరం నుంచి రెండు కిడ్నీలు, లివర్, రెండు కళ్లను సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment