బ్రెయిన్ డెడ్ వ్యక్తి కుటుంబ సభ్యుల ఆదర్శం
రాష్ట్రం విడిపోయిన తరువాత ఇది రెండో సంఘటన
ఒక దీపం వెలిగింది. ఐదు కుటుంబాల్లో కాంతులు నింపింది. ప్రాణం పోయినా చిరంజీవిగా వర్థిల్లవచ్చని నిరూపించింది. బ్రెయిన్ డెడ్ అయిన కృష్ణ చంద్రరావు చనిపోతూ ఐదుగురు వ్యక్తులకు జీవన దానం చేశారు. ఈ అపురూప సన్నివేశానికి విశాఖ వేదికైంది. నవ్యాంధ్రప్రదేశ్‌లో ఇది రెండో అవయవదానం కావడం విశేషం.
విశాఖ-మెడికల్: పుట్టెడు దుఃఖం... ఇంటి యజమాని కన్నుమూసిన క్షణాన తీరని శోకం... అయినా ఆ కుటుంబం స్పందించింది. ప్రజాప్రతినిధిగా సేవాభావం కలిగిన మతుని ఆశయం నెరవేరాలని కోరుకుంది. అవయవ దానానికి అంగీకరించింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి పంచాయతీ అయ్యంవారిపేట వార్డు సభ్యుడు రౌశో కష్ణచంద్రరావు (54) గురువారం రక్తపోటు పెరిగి నడుస్తుండగానే అకస్మాత్తుగా పడిపోయారు. తలకు తీవ్రగాయమై అపస్మారక స్థితిలోకి వెళిపోయారు. మెరుగైన చికిత్స కోసం శుక్రవారం నగరంలోని కేర్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న అతడు బ్రెయిన్‌డెడ్ అయినట్లు ఆస్పత్రి వైద్యులు శనివారం ప్రకటించారు.
ఆస్పత్రి అవయవదాన కౌన్సెలర్ సీహెచ్ ఇందిర అతని కుటుంబ సభ్యులతో చర్చించి అవయవ దానానికి ఒప్పించారు. రాష్ట్ర ప్రభుత్వ అవయవదాన సాధికారక సంస్థ జీవనదాన్ అనుమతి రావడంతో ఆదివారం మధ్యాహ్నం కృష్ణచంద్రరావు కాలేయాన్ని కేర్ ఆస్పత్రిలోనే కాలేయం దెబ్బతిన్న మరో రోగికి శస్త్రచికిత్స ద్వారా మార్పిడి చేశారు. అదే ఆస్పత్రిలో రెండో కిడ్నీలు పూర్తిగా పాడై చికిత్స పొందుతున్న మరో రోగికి కిడ్నీని అమర్చారు. రెండో కిడ్నీని నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో కిడ్నీ బాధితునికి అమర్చారు. రెండు కళ్లను నగరంలోని మొహిసిన్ ఐ బ్యాంకు అందచేశారు.
గ్రామస్తులు వద్దన్నారు
చనిపోయిన నా భర్త కృష్ణచంద్రరావు కండక్టర్‌గా పనిచేస్తూనే వార్డు సభ్యునిగా ఉంటూ గ్రామస్తులకు తలలో నాలుకగా సేవలు చేసేవారు. ఆయన లేని లోటు మా కుటుంబానికి తీరకపోయినా ఆయన అవయవదానంతో ఐదుగురికి ఆయుష్షుపోశారు. అదే నాకు సంతోషం ఇచ్చింది. మొదట మా గ్రామస్తులంతా అవయవదానం చేయవద్దని, కులాచారానికి కట్టుబడి దహన సంస్కారం చేయాలని చెప్పినా, ఆస్పత్రి వైద్యుల కోరిక మేరకు అవయవ దానానికి మనస్ఫూర్తిగా అంగీకరించాం.
- శారద (అవయవ దాత భార్య)
గర్వంగా ఉంది
కృష్ణచంద్రరావు కుమారునిగా నాకెంతో గర్వంగా ఉంది. ప్రత్యక్షంగా మా నాన్న మాకు దూరమైనా, పరోక్షంగా ఐదుగురు వ్యక్తుల్లో సజీవంగా ఉండటం మానసికంగా మాకెంతో సంతోషాన్ని మిగిల్చింది. అందుకే అవయవ దానానికి అంగీకరించాం. ప్రజాప్రతినిధిగా ఉన్న మా నాన్న అందరికీ ఆదర్శంగా నిలవడం నాకు గర్వంగా ఉంది.
- జగదీష్ (కుమారుడు)
స్ఫూర్తి దాయకం.. అవయవ దానం
ఇచ్ఛాపురం: కృష్ణచంద్రరావు మృతి ఇచ్ఛాపురంలో తీవ్ర విషాదాన్ని నింపినప్పటికీ అతని అవదానం స్ఫూర్తి దాయకంగా నిలిచింది. అవయవ దానం ప్రాధాన్యంపై స్థానికంగా ఈ సంఘటన తీవ్ర చర్చకు దారితీసింది. చనిపోయినా బతికే ఉండాలంటే అవయవ దానం చేయడం ఉత్తమమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మృతుడి స్వగ్రామం మండలంలోని అయ్యవారిపేటలో గ్రామస్తులంతా గ్రామ మండపం వద్దకు చేరుకుని విలపించారు.
నేడు అంత్యక్రియలు
కృష్ణ మృత దేహం సోమవారం విశాఖ నుంచి గ్రామానికి చేరుకుంటుంది. గ్రామంలోనే ఆయన అంత్యక్రియలు నిర్విహ స్తామని గ్రామస్తులు చెప్పారు.