లబ్బీపేట(విజయవాడ తూర్పు)/గన్నవరం/తిరుపతి తుడా: తనువు చాలించినా.. అవయవాల దానంతో ఆరుగురు జీవితాల్లో వెలుగులు నింపాడు 23 ఏళ్ల యువకుడు గారపాటి జయప్రకాష్. కొడుకు ఇక లేడన్న చేదు నిజం గుండెలను పిండేస్తున్నా.. పుట్టెడు దుఃఖంలో కూడా అతడి కుటుంబ సభ్యులు తీసుకున్న అవయవదానం నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే... కృష్ణాజిల్లా మొవ్వ మండలం చినముత్తేవి గ్రామానికి చెందిన గారపాటి జయప్రకాష్ (23) ఈ నెల 25న నిడుమోలు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
తలకు బలమైన గాయం కావడంతో ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. చిన్న వయసులోనే తమ బిడ్డ దూరమైనా, కనీసం ఇతరుల జీవితాల్లో అయినా వెలుగులు నింపాలని భావించిన ఆ తల్లిదండ్రులు తమ కుమారుడి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. జయ ప్రకాష్ గుండెను తిరుపతిలోని పద్మావతి ఆస్పత్రికి, లివర్, ఒక కిడ్నీని తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి, మరో కిడ్నీని విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రికి, కళ్లను విజయవాడలోని ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించారు. గుండెను తిరుపతి తరలించేందుకు ఆయుష్ ఆస్పత్రి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టు వరకు పోలీసులు గ్రీన్‌చానల్ ఏర్పాటు చేశారు.
32 ఏళ్ల యువకుడికి గుండె మార్పిడి
వైఎస్సార్ కడప జిల్లా వేముల ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల యువకుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గుండె సంబంధిత సమస్యతో తిరుపతిలోని శ్రీపద్మావతి గుండె చికిత్సాలయంలో చేరాడు. గుండె మారి్పడి అనివార్యమని నిర్ధారించి తాత్కాలిక చికిత్సను ప్రారంభించారు. ఈ క్రమంలో జయప్రకాష్ అవయవదానం విషయమై శ్రీపద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ డైరెక్టర్ శ్రీనాథ్‌రెడ్డికి సమాచారం అందింది.
సంబంధిత వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపగా వారు అనుమతి మంజూరు చేశారు. గుండె మార్పిడి చికిత్సకు అవసరమైన రూ.12 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా విడుదల చేశారు. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గుండెను తిరుపతికి తరలించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి గ్రీన్ చానల్ ద్వారా పద్మావతి కార్డియాక్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శనివారం రాత్రి వైద్య బృందం సుదీర్ఘంగా శ్రమించి విజయవంతంగా గుండె మార్పిడిని పూర్తి చేశారు. యువకుడికి పునర్జన్మను ప్రసాదించారు.
అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ
ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ లభించింది. శ్రీకాకుళానికి చెందిన బి.రామరాజు, లావణ్య దంపతుల కుమారుడు బి.కృష్ణశ్రావణ్ (17) ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఈ నెల 25న స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో విశాఖపట్నం ఎంవీపీ కాలనీ మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. శ్రావణ్‌కు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర దుఖఃలోనూ శ్రావణ్ తల్లిదండ్రులు అవయవదానం చేసేందుకు ముందుకొచ్చారు. ఒక కిడ్నీ మెడికవర్ ఆస్పత్రికి, మరో కిడ్నీ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment