బ్రెయిన్ డెడ్ అయిన భరత్‌కుమార్ అవయవాలను దానం చేసేందుకు వారి కుటుంబసభ్యులు ముందుకు వచ్చారు.
ఇబ్రహీంపట్నం :బ్రెయిన్ డెడ్ అయి అవయదానానికి వచ్చిన భరత్ కుమార్ అనే వ్యక్తి బ్రతికే ఉన్నాడని మంగళగిరి ఎన్నారై డాక్టర్లు నిర్థారించారు. దాంతో అతనికి డాక్టర్లు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. భరత్ కుమార్ క్షేమంగా ఉన్నాడని వైద్యులు చెప్పటంతో అతని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా గురువారం కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన భరత్‌కుమార్ అవయవాలను దానం చేసేందుకు వారి కుటుంబసభ్యులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
వివరాలు.. ఇబ్రహీంపట్నంకు చెందిన కనకమెడల భరత్‌కుమార్(45) మూడు లారీల ఓనర్. వాటితో వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే బుధవారం కంచికచర్ల వెళ్తుండగా వెనుక నుంచి ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన అతన్ని వెంటనే కంచికచర్లలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి గుంటూరుకు తరలించారు.
బ్రెయిన్ డెడ్ అయిందని అతన్ని గుంటూరులోని ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు మృతి చెందాడని చెప్పడంతో.. భరత్‌కుమార్ తమ్ముడు అశోక్‌కుమార్ , చెల్లెలు కృష్ణవేణిలు అతని అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులను ఒప్పించారు. వారి అంగీకారంతో భరత్ కుమార్ అవయవాలను మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రికి దానం చేశారు. భరత్ కుమార్‌కు భార్య , ఇద్దరు కుమారులు యశ్వంత్ సాయి(10), ఆజాద్(7)లు ఉన్నారు. కాగా, ఎన్నారై ఆస్పత్రి వైద్యులు భరత్ కుమార్ బ్రెయిన్ డెడ్ కాలేదని.. సరైన వైద్యం అందిస్తే.. బ్రతికే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దాంతో చనిపోయాడునుకున్న తమ కుమారుడు బ్రతికే ఉన్నాడనే వార్త తెలియడంతో తల్లిదండ్రుల్లో ఆశలు చిగురించాయి.