bharath kumar
-
ఆ పేరు పెట్టినప్పుడే నమ్మకం వచ్చేసింది
‘‘ప్రేక్షకులకు దగ్గర కావడానికి కొత్తగా ఏదైనా ట్రై చేస్తే బావుంటుందని అనుకున్నా. ‘చి..ల..సౌ’ కథ వినగానే నాకు మరో కొత్త మెట్టు అవుతుందనిపించింది. నా నమ్మకం నిజమైంది. కరెక్ట్ సినిమా చేశావని చాలామంది అభినందిస్తుంటే సంతోషంగా ఉంది’’ అని హీరో సుశాంత్ అన్నారు. సుశాంత్, రుహానీ శర్మ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చి..ల..సౌ’. అక్కినేని నాగార్జున, భరత్ కుమార్, జస్వంత్ నడిపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో సుశాంత్ మాట్లాడుతూ– ‘‘చి..ల..సౌ’ చిత్రానికి నాకు అభినందనలు వచ్చాయంటే ఆ క్రెడిట్ రాహుల్‌కే దక్కుతుంది. బయటి బ్యానర్లో సినిమా చేద్దామని అనుకున్నప్పుడు నాతో సినిమా చేయడానికి ముందుకు వచ్చిన సిరుని సినీ క్రియేషన్స్ వారికి థ్యాంక్స్. సమంత, చైతన్యకు సినిమా నచ్చడం, సినిమాలో భాగమవుతానని చైతన్య చెప్పడం హ్యాపీగా అనిపించింది. నిర్మాతగా నాగార్జునగారి పేరు కూడా పెట్టినప్పుడే సినిమాపై నమ్మకం వచ్చేసింది’’ అన్నారు. ‘‘ప్రీమియర్ షో నుంచి సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది. టాక్ వచ్చినంతగా ప్రేక్షకులు థియేటర్‌కి రావడం లేదేమో అనిపించేది. ఈ సినిమా స్లోగా ఎక్కుతుందని నాగార్జునగారు అన్నారు. ఆయన అన్నట్లుగానే ఫస్ట్ డేతో పోల్చితే తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువయ్యాయి’’ అన్నారు రాహుల్ రవీంద్రన్. ‘‘సినిమా చేసేటప్పుడు రిస్క్ చేస్తున్నానని చాలామంది అన్నారు. కానీ ‘చి..ల..సౌ’ రిలీజ్ తర్వాత ఫోన్ చేసి అభినందిస్తున్నారు. సుశాంత్‌కు ఒక వే క్రియేట్ అయింది’’ అన్నారు నిర్మాత జస్వంత్. -
రాష్ట్ర సాఫ్ట్‌బాల్ జట్టుకు ‘అనంత లక్ష్మి’ విద్యార్థి
అనంతపురం సప్తగిరి సర్కిల్: రాష్ట్ర సాఫ్ట్‌బాల్ జట్టుకు అనంత లక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి భరత్ కుమార్ ఎంపికైనట్లు కళాశాల చైర్మెన్ అనంతరాముడు తెలిపారు. అనంత క్రీడా గ్రామంలో ఎంపిక ప్రక్రియ సాగిందన్నారు. సెప్టెంబర్ 10 నుంచి 12 వరకు గుంటూరు జిల్లా మాచెర్లలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు. ఈ పోటీలలోనూ విజయం సాధించి కళాశాలకు, రాష్ట్రానికి పేరు తేవాలని డైరెక్టర్ రమేష్ నాయుడు, ప్రిన్సిపాల్ రమేష్ బాబు, ఫిజికల్ డైరెక్టర్ నరసింహులు ఆకాంక్షించారు. -
మిస్డ్‌కాల్‌తో పరిచయం..ఆపై వేధింపులు
చెన్నై: ఫొటోను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఫేస్బుక్, వాట్సాప్‌లో పెడతానని ఇంజినీరింగ్ విద్యార్థినిని బెదిరించిన బీబీఏ పట్టభద్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రం తిరుప్పూరు జిల్లా అవినాశీ సమీపం పెరియ పాళయంకు చెందిన బీబీఏ పట్టభద్రుడైన భరత్‌కుమార్ నిరుద్యోగి. నామక్కల్ జిల్లా పుదుసత్రంలోని ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న కీర్తన (22)తో మిస్డ్‌కాల్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. ఫేస్బుక్, వాట్సాప్‌లలో తమ ఫొటోలను ఇచ్చిపుచ్చుకునేవారు. విషయం కీర్తన తల్లికి తెలియడంతో ఇద్దర్నీ మందలించింది. దీంతో కీర్తన సెల్ నంబర్ మార్చి భరత్‌కుమార్‌తో స్నేహాన్ని తెంచుకుంది. కీర్తన సెల్‌ఫోన్ నంబరు ఇవ్వాల్సిందిగా ఆమె సమీప బంధువు, తల్లిని భరత్ ఒత్తిడి చేశాడు. సెల్‌ఫోన్ నంబరు ఇవ్వకుంటే తన వద్దనున్న కీర్తన ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఫేస్బుక్, వాట్సాప్‌లలో పెడతానని బెదిరించాడు. కీర్తన తల్లి సంగీత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా భరత్‌కుమార్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు. కీర్తనతో స్నేహం చేశాను, ఆమె ద్వారా తల్లి సంగీత, బంధువు దేవీ ఫోన్ నంబర్లను సేకరించి వారితో కూడా మాట్లాడటం ప్రారంభించానని భరత్ తెలిపాడు. కీర్తన సెల్‌ఫోన్ నంబర్ మార్చడంతో సంగీత, దేవీలను బెదిరించినట్లు భరత్ అంగీకరించాడు. నిందితుడిని పోలీసులు నామక్కల్ కోర్టులో హాజరుపరిచి సేలం జైలుకు తరలించారు. -
బ్రెయిన్ డెడ్ కాదు... భరత్ కుమార్ క్షేమం
ఇబ్రహీంపట్నం :బ్రెయిన్ డెడ్ అయి అవయదానానికి వచ్చిన భరత్ కుమార్ అనే వ్యక్తి బ్రతికే ఉన్నాడని మంగళగిరి ఎన్నారై డాక్టర్లు నిర్థారించారు. దాంతో అతనికి డాక్టర్లు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. భరత్ కుమార్ క్షేమంగా ఉన్నాడని వైద్యులు చెప్పటంతో అతని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా గురువారం కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన భరత్‌కుమార్ అవయవాలను దానం చేసేందుకు వారి కుటుంబసభ్యులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వివరాలు.. ఇబ్రహీంపట్నంకు చెందిన కనకమెడల భరత్‌కుమార్(45) మూడు లారీల ఓనర్. వాటితో వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే బుధవారం కంచికచర్ల వెళ్తుండగా వెనుక నుంచి ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన అతన్ని వెంటనే కంచికచర్లలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి గుంటూరుకు తరలించారు. బ్రెయిన్ డెడ్ అయిందని అతన్ని గుంటూరులోని ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు మృతి చెందాడని చెప్పడంతో.. భరత్‌కుమార్ తమ్ముడు అశోక్‌కుమార్ , చెల్లెలు కృష్ణవేణిలు అతని అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులను ఒప్పించారు. వారి అంగీకారంతో భరత్ కుమార్ అవయవాలను మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రికి దానం చేశారు. భరత్ కుమార్‌కు భార్య , ఇద్దరు కుమారులు యశ్వంత్ సాయి(10), ఆజాద్(7)లు ఉన్నారు. కాగా, ఎన్నారై ఆస్పత్రి వైద్యులు భరత్ కుమార్ బ్రెయిన్ డెడ్ కాలేదని.. సరైన వైద్యం అందిస్తే.. బ్రతికే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దాంతో చనిపోయాడునుకున్న తమ కుమారుడు బ్రతికే ఉన్నాడనే వార్త తెలియడంతో తల్లిదండ్రుల్లో ఆశలు చిగురించాయి. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
హత్నూర, న్యూస్‌లైన్ : పదహారేళ్ల బాలికలు బాల్య వివాహం చేస్తుండగా జిల్లా అధికారులు అడ్డుకున్న సంఘటన మండలం మల్కాపూర్‌లో గల టీఎఫ్టీ ఫంక్షన్ హాల్లో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. సంగారెడ్డి మండలం చిదురుప్ప గ్రామానికి చెందిన మంజుల, స్వామిగౌడ్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె దివ్య (16) హత్నూర మండలం చింతల్ చెరువు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అయితే దివ్యకు పెళ్లీడు రాకపోయినా శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన సావిత్రి, తిరుపతిగౌడ్ దంపతుల కుమారుడు రాఘవేంద్రర్గౌడ్ (28)తో వివాహం జరిపించాలని నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం పెళ్లి జరిపేందుకు హత్నూర మండలం మల్కాపూర్ శివారులోని ఫంక్షన్ హాల్లో ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే పెళ్లి కుమార్తె మైనర్ అని సమాచారం రావడంతో పోలీసులు, రెవెన్యూ, ఇతర శాఖలకు చెందిన అధికారులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. మైనర్‌కు పెళ్లి జరపకూడదని, వెంటనే ఆపాలని డీసీపీఓ రత్నం, కౌన్సెలర్ బీ రాజు, సోషల్ వర్కర్ రాంరెడ్డి, ఓఆర్డబ్లూలు విఠల్, శంకర్, చైల్డ్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ ఎంఎస్ చంద్ర, ఎస్ఐ భరత్‌కుమార్, ఆర్ఐ మల్లేశంలు బాలిక తల్లిదండ్రులను కోరారు. 16 ఏళ్ల వయస్సున్న బాలికకు పెళ్లి చేయడం నేరమని, చేస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఇరు కుటుంబాల తల్లిదండ్రులకు, బంధువులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో చేసేది లేక రూ. లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన పెళ్లిని రద్దు చేసుకుని రెండేళ్ల తరువాత పెళ్లి జరిపిస్తామని అధికారులకు రాతపూర్వకంగా రాసి ఇచ్చారు. దానిని తీసుకుని అధికారులు వెనుతిరిగారు. కఠిన చర్యలు తప్పవు : డీసీపీఓ రత్నం బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డీసీపీఓ రత్నం అన్నారు. అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేయాలన్నారు. ఒక వేళ మైనర్ పిల్లలకు వివాహాలు చేస్తే కేసులు నమోదు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చదువుకునే వయస్సులో పెళ్లిళ్లు చేయడం వల్ల వారు శారీరకంగా ఎదగక, ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ఎవరైనా బాల్య వాహాలు చేసిన ట్లు అయితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.