హత్నూర, న్యూస్‌లైన్ : పదహారేళ్ల బాలికలు బాల్య వివాహం చేస్తుండగా జిల్లా అధికారులు అడ్డుకున్న సంఘటన మండలం మల్కాపూర్‌లో గల టీఎఫ్‌టీ ఫంక్షన్ హాల్‌లో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. సంగారెడ్డి మండలం చిదురుప్ప గ్రామానికి చెందిన మంజుల, స్వామిగౌడ్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె దివ్య (16) హత్నూర మండలం చింతల్ చెరువు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అయితే దివ్యకు పెళ్లీడు రాకపోయినా శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన సావిత్రి, తిరుపతిగౌడ్ దంపతుల కుమారుడు రాఘవేంద్రర్‌గౌడ్ (28)తో వివాహం జరిపించాలని నిర్ణయించారు.
ఈ మేరకు బుధవారం పెళ్లి జరిపేందుకు హత్నూర మండలం మల్కాపూర్ శివారులోని ఫంక్షన్ హాల్‌లో ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే పెళ్లి కుమార్తె మైనర్ అని సమాచారం రావడంతో పోలీసులు, రెవెన్యూ, ఇతర శాఖలకు చెందిన అధికారులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. మైనర్‌కు పెళ్లి జరపకూడదని, వెంటనే ఆపాలని డీసీపీఓ రత్నం, కౌన్సెలర్ బీ రాజు, సోషల్ వర్కర్ రాంరెడ్డి, ఓఆర్‌డబ్లూలు విఠల్, శంకర్, చైల్డ్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ ఎంఎస్ చంద్ర, ఎస్‌ఐ భరత్‌కుమార్, ఆర్‌ఐ మల్లేశంలు బాలిక తల్లిదండ్రులను కోరారు. 16 ఏళ్ల వయస్సున్న బాలికకు పెళ్లి చేయడం నేరమని, చేస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అనంతరం ఇరు కుటుంబాల తల్లిదండ్రులకు, బంధువులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో చేసేది లేక రూ. లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన పెళ్లిని రద్దు చేసుకుని రెండేళ్ల తరువాత పెళ్లి జరిపిస్తామని అధికారులకు రాతపూర్వకంగా రాసి ఇచ్చారు. దానిని తీసుకుని అధికారులు వెనుతిరిగారు.
కఠిన చర్యలు తప్పవు : డీసీపీఓ రత్నం
బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డీసీపీఓ రత్నం అన్నారు. అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేయాలన్నారు. ఒక వేళ మైనర్ పిల్లలకు వివాహాలు చేస్తే కేసులు నమోదు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చదువుకునే వయస్సులో పెళ్లిళ్లు చేయడం వల్ల వారు శారీరకంగా ఎదగక, ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ఎవరైనా బాల్య వాహాలు చేసిన ట్లు అయితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.