మిస్డ్‌కాల్‌తో పరిచయం..ఆపై వేధింపులు
చెన్నై: ఫొటోను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్, వాట్సాప్‌లో పెడతానని ఇంజినీరింగ్ విద్యార్థినిని బెదిరించిన బీబీఏ పట్టభద్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రం తిరుప్పూరు జిల్లా అవినాశీ సమీపం పెరియ పాళయంకు చెందిన బీబీఏ పట్టభద్రుడైన భరత్‌కుమార్ నిరుద్యోగి. నామక్కల్ జిల్లా పుదుసత్రంలోని ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న కీర్తన (22)తో మిస్డ్‌కాల్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు.
ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో తమ ఫొటోలను ఇచ్చిపుచ్చుకునేవారు. విషయం కీర్తన తల్లికి తెలియడంతో ఇద్దర్నీ మందలించింది. దీంతో కీర్తన సెల్ నంబర్ మార్చి భరత్‌కుమార్‌తో స్నేహాన్ని తెంచుకుంది. కీర్తన సెల్‌ఫోన్ నంబరు ఇవ్వాల్సిందిగా ఆమె సమీప బంధువు, తల్లిని భరత్ ఒత్తిడి చేశాడు. సెల్‌ఫోన్ నంబరు ఇవ్వకుంటే తన వద్దనున్న కీర్తన ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో పెడతానని బెదిరించాడు. కీర్తన తల్లి సంగీత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా భరత్‌కుమార్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు. కీర్తనతో స్నేహం చేశాను, ఆమె ద్వారా తల్లి సంగీత, బంధువు దేవీ ఫోన్ నంబర్లను సేకరించి వారితో కూడా మాట్లాడటం ప్రారంభించానని భరత్ తెలిపాడు. కీర్తన సెల్‌ఫోన్ నంబర్ మార్చడంతో సంగీత, దేవీలను బెదిరించినట్లు భరత్ అంగీకరించాడు. నిందితుడిని పోలీసులు నామక్కల్ కోర్టులో హాజరుపరిచి సేలం జైలుకు తరలించారు.