డాక్టర్ బీరప్పతో బాలుడు శశికిరణ్, ఉప్పలయ్య.. డాక్టర్‌తో సెల్ఫీ
సాక్షి, హైదరాబాద్: ఆ బాలుడికి తల్లి జన్మనిస్తే... తండ్రి పునర్జన్మను ప్రసాదించాడు. దీనికినగరంలోని నిమ్స్ ఆస్పత్రి వేదికైంది. ఆ బాలుడి పేరు శశికిరణ్. ఆయన తండ్రి ఉప్పలయ్య. లివర్ సిరోసిస్ (కాలేయం పనితీరు దెబ్బతినడం)తో బాధపడుతున్న కుమారుడికి కాలేయం దానం చేసిన ఉప్పలయ్య ఫాదర్ ఆఫ్ శశికిరణ్ అనిపించుకున్నారు. అందరి మన్ననలుఅందుకున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల చరిత్రలోనే తొలి లైవ్ లివర్‌ట్రాన్స్‌ప్లాంటేషన్‌గా ఇది నిలిచిపోయింది. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ ఈ చికిత్సవివరాలను సోమవారం ఆస్పత్రిలో వెల్లడించారు.
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం విడవల్లి గ్రామానికి చెందిన పోలియో బాధితుడు దొంతగాని ఉప్పలయ్య టైలర్. ఈయన కుమారుడు మాస్టర్ శశికిరణ్(14) కామెర్లతో బాధపడగా, ఏడాది క్రితం నిమ్స్‌కు తీసుకొచ్చారు. సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ బీరప్ప వైద్య పరీక్షలు నిర్వహించి, బాలుడు లివర్ సిరోసిస్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీనికి కాలేయ మార్పిడి చికిత్స ఒక్కటే పరిష్కారమని వైద్యులు సూచించారు. ఈ మేరకు జీవన్‌దాన్ సహా ఆరోగ్యశ్రీలోనూ పేరు నమోదు చేయించారు. అయితే బ్రెయిన్‌డెడ్ దాత కాలేయం లభించకపోవడంతో తన కాలేయంలోని కొంత భాగాన్ని కుమారుడికి ఇచ్చేందుకు ఉప్పలయ్య ముందుకొచ్చారు.
30 రోజులు... 8 కిలోలు
వైద్యులు ఉప్పలయ్యకు పరీక్షలు నిర్వహించగా, ఆయన ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. కాలేయంలో కొవ్వు కరిగిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత చికిత్స చేయాలని వైద్యులు భావించారు. దీంతో వ్యాయామం చేయాలని సూచించారు. కుమారుడిపై ప్రేమతో ఉప్పలయ్య నెల రోజుల్లోనే 8 కిలోల బరువు తగ్గాడు. జూన్ 4న డాక్టర్ బీరప్ప నేతృత్వంలోని 20 మందితో కూడిన వైద్యబృందం 12గంటలు శ్రమించి కాలేయ మార్పిడి చికిత్సను విజయవంతంగా చేశారు. ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సెంటర్ ఫర్ లివర్ సైన్సెన్ (యూకే) డైరెక్టర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ వైద్య సహకారం అందించారు.
‘సర్కారీ’లో తొలిసారి...
జీవన్‌దాన్ పథకంలో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఇప్పటి వరకు బ్రెయిన్‌డెడ్ డోనర్ నుంచి సేకరించిన కాలేయ మార్పిడి చికిత్సలు మాత్రమే జరిగాయి. తొలిసారిగా లైవ్ డోనర్ కాలేయ మార్పిడి చికిత్స జరగడం విశేషం. ప్రస్తుతం దాత, స్వీకర్తలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ బీరప్ప తెలిపారు. చికిత్సకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.20 లక్షలకు పైగా ఖర్చవుతుంటే.. ఆరోగ్యశ్రీ సహకారంతో నిమ్స్‌లో కేవలం రూ.10.80 లక్షలకే చేసినట్లు తెలిపారు. విలేకర్ల సమావేశంలో డాక్టర్లు పద్మజ, వేణుమాధవ్, సూర్యరామచంద్రవర్మ, నవకిషోర్, జగన్‌మెహన్‌రెడ్డి, గంగాధర్, దిగ్విజయ్, అభిజిత్, హితేష్, వికాశ్, నిర్మల, మధులిక, ఇందిరా, కవిత పాల్గొన్నారు.
11వేల సర్జరీలు...
ఆస్పత్రిలో మౌలిక వసతులు మెరుగుపరచడంతో ఈ మూడేళ్ల కాలంలో సర్జరీలు రెట్టింపయ్యాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఏటా 7వేల సర్జరీలు జరిగితే... 2017లో 13వేలకు పైగా సర్జరీలు నిర్వహించగా, ఈ ఏడాది ఇప్పటికే 11వేల సర్జరీలు చేశాం. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న ఏడుగురు బాధితులు ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పటికే వెయ్యికి పైగా కిడ్నీమార్పిడి చికిత్సలు నిర్వహించాం.
– డాక్టర్ మనోహర్, డైరెక్టర్, నిమ్స్
Comments
Please login to add a commentAdd a comment