సోమాజిగూడ : ప్రతిష్టాత్మక నిమ్స్ ఆస్పత్రిలోని పార్థివ అంబులెన్స్‌కు మంగళం పలికారు. గతంలో ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన రోగి మృతి చెందితే ఆయా వాహనాల్లో ఉచితంగా మృతదేహాన్ని ఇంటికి తరలించేవారు. దీంతో మృతుల బంధువులకు ఇబ్బందులు తప్పేవి. ఒక వాహనంలో రెండు దేహాలను తీసుకు వెళ్లే సామర్థ్యం గల రెండు అంబులెన్సులను 2016 నవంబర్‌లో కేటాయించారు. కొన్నాళ్లు సేవలు అందించిన ఈ వాహనాలు గతేడాది జూలై నుంచి సేవలు నిలిచిపోయాయి. అవి ఇప్పుడు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. దీంతో ప్రస్తుతం నిమ్స్‌లో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన నిమ్స్‌లో పార్థివ వాహనాలు మూలన చేరడం.. వాటిని తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యాజమాన్యం కృషి చేయ కపోవడాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
గాంధీలో 10, ఉస్మానియాలో నాలుగు
చికిత్స కోసం వచ్చి గాంధీలో ఎవరైనా రోగి మృతి చెందితే ఆ దేహాన్ని తరలించేందుకు అక్కడ 10 పార్థివ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఉస్మానియాలోనూ నాలుగు వాహనాలు నిత్యం సేవలు అందిస్తున్నాయి. ఈ ఆస్పత్రుల కంటే ఎంతో ఖ్యాతి గాంచిన నిమ్స్‌లో మాత్రం ఆ వాహనాల సేవలను నిలిపివేశారు. ఆస్పత్రిలోని మృతదేహాన్ని వారి ఇంటికి తరలించడం బంధువులకు వ్యయంతో కూడిన శ్రమ. ఈ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత పార్థివ అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చారు. సీఎం ఆశయం మంచిదైనా.. అధికారుల నిర్లక్ష్యం వల్ల వాహనాలు మూలకు చేరాయి.
అడిగినంత ఇచ్చికోవాల్సిందే..
రోగి వైద్యానికి ఎంత వ్యయం చేసినా ఇబ్బందులు పడని వారు.. పరిస్థితి విషమించి ఆ రోగి మృతి చెందితే ఆ దేహాన్ని దూరప్రాంతానికి తీసుకెళ్లడంలో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అర్ధరాత్రి వేళ తరలించేందుకు వాహనాలు అందుబాటులో ఉండవు. సమీపంలోని అంబులెన్సుల కోసం వెతులాట తప్పదు. అయితే వాహనం దొరికినా వారు ఎంత అడిగితే అంత ఇచ్చుకోవాలి. గతంలో నిమ్స్‌లో ఆ సమస్య ఎదురయ్యేది కాదు. సంబంధిత ఆర్‌ఎంను సంప్రదిస్తే వాహనం ఉచితంగా అందుబాటులోకి వచ్చేది. ఇప్పటికైనా నిమ్స్ యాజమాన్యం స్పందించి పార్థివ వాహనాన్ని అందుబాటులోకి తేవాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment