
బాలప్రసన్న కుమార్ (ఫైల్)
హైదరాబాద్, మూసాపేట: తాను చనిపోతూ ఓ యువకుడు అవయవ దానం చేసి మరికొందరి జీవితాల్లో వెలుగు నింపాడు. మూసాపేట ఆంజనేయనగర్ కాలనీకి చెందిన కూచుంపూడి నాగేశ్వరరావు, తులసి దంపతుల కుమారుడు బాల ప్రసన్న కుమార్(21) మల్లారెడ్డి కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం దూలపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అయితే ఆదివారం సాయంత్రం బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు గుర్తించారు. అతడి గుండె, లివర్, కిడ్నీ, లంగ్స్‌తో మరికొందరికి జీవితాన్నివ్వవచ్చని బాధితుడి తల్లిదండ్రులకు సూచిండడంతో అందుకు వారు అంగీకరించారు. దీంతో జీవన్మృతుడి అవయవాలను శస్త్ర చికిత్స ద్వారా తీసి అత్యవసరంగా చెన్నైకి తరలించారు. తన కుమారుడు లేడన్న బాధ ఉన్నప్పటికీ అతడి అవయవాలు అమర్చిన ఇంకొందరిలో చిరంజీవిగా ఉంటాడని తల్లిదండ్రులు తెలిపారు.