
అవయవ దాతలు.. చిరంజీవులు!
అవయవదానం చేసిన కుటుంబసభ్యులకు నిమ్స్‌లో సన్మానం
హైదరాబాద్: తాను కన్నుమూస్తూ మరొకరి జీవితాల్లో వెలుగులు నింపిన అవయవ దాతలు చిరంజీవులని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌చంద అన్నారు. 2013-14లో ‘జీవన్‌దాన్’కు అవయవాలు దానం చేసిన 50 మం ది బ్రెయిన్‌డెడ్ బాధిత కుటుంబసభ్యులను శుక్రవారం హైదరాబాద్ నిమ్స్‌లో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవయవదానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, అవసరమున్నవారికి అందించడంలో జీవన్‌దాన్ బృందం చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. డీఎంఈ పుట్టా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆత్మీయులను కోల్పోతూ పుట్టెడు దుఃఖంలోనూ తమవారి అవయవాలను దానం చేయాలనే సామాజిక స్పృహ కుటుంబసభ్యుల్లో ఉండటం గొప్ప విషయమన్నారు. నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్ మాట్లాడుతూ స్వీకర్తల పూజాగదుల్లో దేవుని ప్రతిరూపాల సరసన దాతల ఫొటోలు చేరాయని చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో మహత్తర దానం చేయడం అభినందనీయమన్నారు. జీవన్‌దాన్ ప్రోగ్రామ్ ఇన్‌చార్జీ డాక్టర్ స్వర్ణలత మాట్లాడుతూ 2012లో నిమ్స్ వేదికగా జీవన్‌దాన్ నెట్‌వ ర్క్‌ను ఏర్పాటు చేసినా 2013 నుంచి ఆర్గాన్ డొనేషన్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పటివరకు 105 మంది బ్రెయిన్‌డెడ్ బాధితుల నుంచి 1050 అవ యవాలు సేకరించి, 551 మందికి ఉచితంగా అందజేసినట్లు తెలిపారు.
మొదట్లో బాధపడ్డా..
నా భర్త ఫ్రాన్సిస్ గత సెప్టెంబర్ 20న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. గ్లోబల్ ఆస్పత్రిలో 4 రోజులపాటు చికిత్స చేసినా.. బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరుకున్నారు. అవయవదానం చేస్తే మరో పదిమందికి పునర్జన్మను ప్రసాదించవ్చని వైద్యులు చె ప్పడంతో ఇష్టంలేకపోయి నా అవయవాలు దానం చేసేందుకు అంగీ కరించాను. తప్పు చేశానేమోనని చాలా రోజులు బాధపడ్డాను. కానీ అవయవదానం గొప్పతనం తెలిసిన తర్వాత గర్వపడుతున్నా.
- విజయ, దాత ఎస్పీ ఫ్రాన్సిస్ సతీమణి
నలుగురికి పునర్జన్మ ఇచ్చారు
గత అక్టోబ ర్ 24న ఇంట్లో ప్రమాదవశాత్తూ రాధాకృష్ణ కిందపడిపోయాడు. తలకు దెబ్బతగిలి మెదడులో రక్తం గడ్డ కట్టింది. నాలుగు రోజులుగా పౌలోమీ ఆసుపత్రిలో వైద్యమందించినా ఫలితంలేకపోయింది. 28న బ్రెయిన్‌డెడ్‌గా వైద్యులు నిర్ధారించారు. అవయవ దానానికి తాను అంగీకరించడంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించి గుండె, గుండె రక్తనాళాలు, కాలేయం, కిడ్నీలు సేకరించారు. కన్నుమూస్తూ కూడా ఆయన మరో నలుగురికి పునర్జన్మను ప్రసాదించారు.
- శిరీష, దాత రాధాకృష్ణ సతీమణి