గుండె మార్పిడి ఆపరేషన్లు చేస్తున్న వైద్యుల బృందం(ఫైల్)
గుంటూరు మెడికల్ : దానాలలో కెల్లా గొప్ప దానం ఏదంటే.. టక్కున అవయవదానం అనేమాట వినిపిస్తోంది. ఆధునిక వైద్యం అందించిన మహాదానం ఇది. మరణంలోనూ మానవత్వాన్ని పరిమళింప చేస్తోంది. సామాజిక స్పృహతో ఎన్నో నిండు ప్రాణాలను నిలబెడుతోంది. చనిపోయిన తర్వాత కూడా పది మంది గుర్తుంచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. నేడు అవయవదానం దినోత్సవం సందర్భంగా సాక్షి కథనం.
ఇది మరో జీవితం..
ప్రతిరోజూ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 20మందికి పైగా వివిధ రకాల వ్యాధులతో, రోడ్డు ప్రమాదాల్లో గాయపడి చికిత్స పొందుతూ మరణిస్తున్నారు. ఆస్పత్రుల్లో, ఇళ్ల వద్ద మరణించిన వారి కుటుంబ సభ్యులను కలిసి కౌన్సిలింగ్ చేసి అవయవదానం చేయించటం ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేసి నూతన జీవితాన్ని ప్రసాదించవచ్చు. అవయవదానంపై ప్రజలకు అవగాహన లేకపోవటం, మూఢనమ్మకాలతో చనిపోయిన వారి భౌతిక కాయాన్ని దహనం, ఖననం చేస్తున్నారు. వాస్తవానికి చనిపోయిన వారి అవయవాలను దానం చేయడం వల్ల ఎంతో మంది బతుకుల్లో వెలుగులు నింపొచ్చు. మరణంలోనూ జీవించవచ్చు.
122 మంది అవయవదానం చేశారు..
గుండె, కిడ్నీలు, కళ్లు, లివర్, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాసిస్ అవయాలను దానం చేయటం ద్వారా ఆపరేషన్లు చేసి బాధితులకు ప్రాణదానం చేయవచ్చు. ఇప్పటి వరకు 122 మంది అవయవాలను దానం చేసినట్లు జీవన్‌ధాన్ కార్యక్రమం సీఈఓ డాక్టర్ గాదె కృష్ణమూర్తి తెలిపారు. బ్రెయిన్‌డెడ్ అయిన దాతల నుండి కిడ్నీలు 218, లివర్‌లు 103, గుండెలు 38, ఊపిరితిత్తులు 34 సేకరించి ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి అమర్చి నూతన జీవితాన్ని ప్రసాదించినట్లు వెల్లడించారు.
ఎంత సమయం పడుతుంది..
మానవ శరీరంలోని ఉపయోగపడే అవయవాలు బ్రెయిన్ డెడ్ కేసు నుంచి బయటకు తీసేందుకు ఐదు గంటల సమయం పడుతుంది. అవయవాలు సేకరించిన తర్వాత గుండె, లంగ్స్‌ను మూడు గంటల్లోగా అమర్చాలి. లివర్‌ను ఐదు నుంచి 8 గంటల లోపు, కిడ్నీలను 15 నుంచి 18 గంటల్లోపు అమర్చాలి. లేని పక్షంలో సేకరించిన అవయవాలు పనిచేయకుండా పోతాయి. కళ్లు చాలా కాలం వరకు స్టోర్ చేయవచ్చు. శరీరం నుంచి సేకరించిన అవయవభాగాలను ‘యూ డబ్ల్యూయూ సొల్యూషన్’ అనే చల్లని ద్రావకంలో ఉంచి ఐస్‌బాక్సుల్లో భద్రం చేసి అవయవాదనం కోసం ఎదురు చూస్తున్నవారికి అమర్చుతారు.
గుంటూరు, విజయవాడల్లో కేంద్రాలు..
జీవన్‌ధాన్ పథకం రాష్ట్ర వ్యాప్తంగా 39 ఆస్పత్రుల్లో ఉంది. గుంటూరు జిల్లాలోని గుంటూరు జీజీహెచ్‌లో, గుంటూరు సిటీ హాస్పిటల్, వేదాంత హాస్పిటల్‌లో, అశ్విని హాస్పిటల్‌లో, రమేష్ మల్టీస్పెషాలిటి హాస్పిటల్‌లో, శ్రీలక్ష్మీ సూపర్‌స్పెషాలిటి, ఎన్‌ఆర్‌ఐ, మణిపాల్ ఆస్పత్రిలలో అందుబాటులో ఉంది. కృష్ణా జిల్లాలో ఆయుష్, ఆంధ్రాహాస్పిటల్, అరుణ్‌కిడ్నీ సెంటర్, సెంటిని, విజయ సూపర్‌స్పెషాలిటి, సన్‌రైజ్, స్వరూప్, కామినేని, మెట్రో సూపర్‌స్పెషాలిటి ఆస్పత్రుల్లో ఉంది.
గుండె మార్పిడి ఆపరేషన్లు..
జీజీహెచ్‌లో సహృదయ హెల్త్, మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణగోఖలే ఆధ్వర్యంలో 2016 మే 20న తొలి గుండె మార్పిడి ఆపరేషన్ జరిగింది. గుంటూరుకు చెందిన డ్రైవర్ ఉప్పు ఏడుకొండలు అనే వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్‌తో జాతీయస్థాయిలో గుండెమార్పిడి ఆపరేషన్ చేసిన ఐదో ప్రభుత్వ ఆస్పత్రిగా గుంటూరు జీజీహెచ్ రికార్డు సృష్టించింది.
అధికారికంగా 385 మంది ఎదురుచూపులు..
అనారోగ్యంతో అవయవాలు చెడిపోయి వారు ఆపరేషన్లు చేయించుకునేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అందుకోసం జీవన్‌ధాన్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ కేంద్రంగా 2015 నుంచి జీవన్‌ధాన్ తన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 509 మంది కిడ్నీ మార్పిడి ఆపరేషన్ల కోసం, 74 మంది లివర్ మార్పిడి ఆపరేషన్లు కోసం, 15 మంది గుండె మార్పిడి ఆపరేషన్లు కోసం, ఇద్దరు లంగ్స్ మార్పిడి ఆపరేషన్ల కోసం దరఖాస్తు చేసుకుని అవయవాల కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. సకాలంలో వీరికి అవయవాలు లభించకపోతే వీరు ప్రాణాలు కోల్పోతారు. ఆపరేషన్లుకు అయ్యే ఖర్చులు భరించలేక జీవన్‌ధాన్‌లో పేర్లు నమోదు చేయించుకోని కిడ్నీ బాధితులు, గుండెజబ్బు బాధితులు అధికంగానే ఉన్నట్లు సమాచారం.
ఏ అవయవాలు దానం చేయవచ్చు
మనిషి మరణానంతరం కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్, జీర్ణ వ్యవస్థలోని ఫ్యాంక్రియాస్, ప్రేగులు దానం చేయవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి తలకు రక్త సరఫరా నిలిచిపోవడంతో బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారణ అయిన వారి నుండి మాత్రమే అవయవాలను సేకరిస్తారు.
ఎలా రిజిస్టార్ కావాలి..
అవయవదానం చేయాలనుకునే వ్యక్తులు ముందస్తుగా తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తనకు తెలిసిన వాళ్లకు తాను అవయవదానం చేస్తున్నట్లు తెలపాలి. ఇలా తెలియజేయడం వల్ల సదరు వ్యక్తి మరణానంతరం అతని కోరిక మేరకు కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు వీలు కలుగుతుంది. ప్రభుత్వం జీవన్‌ధాన్ అనే పథకాన్ని 2014లో ప్రవేశపెట్టింది. దీని ద్వార బ్రెయిన్‌డెడ్ అయిన కేసుల నుంచి అవయవాల నుండి సేకరిస్తారు. ఠీఠీఠీ. ్జ్ఛ్ఛఠ్చిnఛ్చీn. జౌఠి. జీn వెబ్‌సైట్‌లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్నవారికి ప్రభుత్వం ఆర్గాన్ డోనార్ కార్డును అందజేస్తుంది.
అవయవాలు కావాల్సి వస్తే..
అవయవమార్పిడి కోసం జీవన్‌ధాన్ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేయించుకోవాలి. నమోదు చేయించుకున్నవారికి సీరియల్ నంబర్ ఇస్తారు. ఎవరైనా అవయవదానం చేసేందుకు వెబ్‌సైట్‌కు సమాచారం ఇస్తే తక్షణమే సీరియల్ నంబర్ ప్రకారం ముందస్తు వరుసలో ఉన్నవారికి అవయవాలు అమర్చేలా చర్యలు తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment