
గుంటూరు : బ్రెయిన్ డెడ్‌తో మరణం అంచున ఉన్న వ్యక్తి కనీసం కాలు కూడా కదపలేడు. కానీ తన అవయవదానంతో మరొకరి ప్రాణాలను నిలుపగలడు. ఇది నమ్మిన ఆ వ్యక్తి కుటుంబసభ్యులు అవయవదానానికి ముందుకొచ్చి మంచి మనసును చాటుకున్నారు. మనవత్వం బతికే ఉందని తెలిపే ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. జిల్లాలోని క్రోసూరు మండలం నాగవరం గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తికి అధిక రక్తపోటుతో బ్రెయిన్ డెడ్ అయి కోమాలోకి వెళ్లారు. ఆయన తిరిగి కోలుకునే అవకాశం లేదని వైద్యులు తేల్చారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు ఆంజనేయులు అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. తమ ఆత్మీయుడు చనిపోతున్న బాధలో ఉండి కూడా ఒక మంచి పనికి ఒప్పుకున్న ఆంజనేయులు కుటుంబసభ్యుల తీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆంజనేయులు కుటుంబసభ్యులను శనివారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ సతీష్ పరామర్శించారు.