సాక్షి, నరసరావుపేట(గుంటూరు) : దివంగత మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు బలవన్మరణానికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో పాటు కోడెల కుమారుడు, కుమార్తె కారణమని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గతంలోనే కోడెల ఆత్మహత్యకు పాల్పడి గుంటూరులోని తన అల్లుడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా గుంటూరులోనే ఉన్న చంద్రబాబు కనీసం పరామర్శించక పోగా, దగ్గరుండాల్సిన ఆయన కుమారుడు కెన్యాలో ఉన్నాడని, కుమార్తె, భార్య హైదరాబాద్‌కే పరిమితమయ్యారన్నారు. దీంతో అన్ని విధాలుగా తాను ఏకాకినయ్యానని భావించిన కోడెల విరక్తితో హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. ఇది ప్రభుత్వ హత్య అంటూ పదే పదే టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. నరసరావుపేటలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ సోమవారం నిర్వహించిన కోడెల సంతాప సభలో మాజీ సీఎం చంద్రబాబు తమ ప్రభుత్వంపైన, సీఎం జగన్‌మోహనరెడ్డిపైన, తనపైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సంతాప సభను టీడీపీ నాయకులు రాజకీయ వేదికగా మార్చుకున్నారే కాని నిజంగా కోడెలకు నివాళులు అర్పించలేదన్నారు.
రూ.లక్ష ఇస్తాం, ఫర్నిచర్ ఇస్తావా?
కోడెల తీసుకొచ్చిన ఫర్నిచర్ కేవలం రూ.లక్ష విలువే నంటూ చంద్రబాబు పదే పదే చెబుతున్నారని, దీనిలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఈ ఫర్నిచర్‌కు తాము రూ.లక్ష ఇస్తామని తీసుకొచ్చి ఇవ్వలగలరా అని ప్రశ్నించారు. దీనిలో 14 కుర్చీలతో గల బిజినెస్ టేబుల్ రూ.65 లక్షలని, ఇవి ఇతరదేశాలకు చెందిన ఫర్నిచర్ అని, గతంలో పనిచేసిన స్పీకర్లు తెప్పించారన్నారు. మొత్తం ఫర్నిచర్ విలువ రూ.1.5 కోట్ల విలువ ఉంటుందన్నారు.
వాస్తవాలు బయటకు రావాలి
కోడెల అసలు ఎందుకు చనిపోయాడో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఒక వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడితే ఆ వ్యక్తి దగ్గర 21 రోజుల పాటు కుటుంబ సభ్యులు ఉండాలనే నిబంధన ప్రతి డాక్టర్‌కు తెలుసు అన్నారు. ఈ విషయం డాక్టర్లు అయిన కోడెల కుమారుడు, కుమార్తెకు కూడా తెలియంది కాదన్నారు. ఆయన వెంట ఎవరూ లేకుండా ఒంటరిగా ఉంచటం ఎంతవరకు సమంజసం అన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈ కేసుల్లో ఎవరినీ అరెస్టు చేయవద్దని స్వయంగా ఆదేశాలు ఇచ్చారన్నారు. ఆరోజు 9.45 గంటలకు ఆత్మహత్య చేసుకుంటే పోలీసులకు 10.30కు సమాచారం ఇచ్చారన్నారు. చివరిసారిగా తన కుమార్తెకు దండం పెట్టి పైన ఉన్న తన గదికి వెళ్లారన్నారు. గదిలోకి పోయిన కోడెల ఏం చేస్తున్నాడనేది కూడా వారు పరిశీలించలేదన్నారు. తన మిత్రులకు ఫోన్ చేసి తాను చివరిసారిగా మాట్లాడుతున్నానని చెప్పారన్నారు. తమపై పెట్టిన కేసుల్లో బాధితులకు రూ.6,7 కోట్లు డబ్బులు ఇచ్చేద్దామని కుమారుడు, కుమార్తెకు చెప్పినా వారు వినలేదన్నారు. వీటన్నింటిపై విచారణ తప్పకుండా జరగాలన్నారు.
చంద్రబాబు తమపై వ్యాఖ్యానించిన ‘‘పనికిమాలిన ఎమ్మెల్యే’’, ‘‘గెలిచారో.. లేదో’’ అన్న మాటలపై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ కూడా తీసుకొస్తామని చెప్పారు. ఈనెల 3వతేదీన అసెంబ్లీ కార్యదర్శికి నోటీసు ఇస్తామన్నారు. నిజంగా కోడెల కుటుంబంపై ప్రేమ ఉంటే కుమారుడు, కుమార్తెకు నరసరావుపేట, సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కోడెల చావును శవరాజకీయం చేయటం మానుకోవాలని చంద్రబాబును కోరారు.
చీకటి రాజకీయాలు చంద్రబాబుకే ఎరుక
ముఖ్యమంత్రి నేరస్తుడైతే ఇలాగే ఉంటుందని చంద్రబాబు మాట్లాడుతున్నాడని, జగన్‌మోహనరెడ్డి నేరస్తుడని ఏ కోర్టు అయినా ముద్ర వేసిందా అని ప్రశ్నించారు. ఆయనపై ఉన్న కేసులు విచారణ జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు లాగా కేసులకు భయపడి చీకట్లో చిదంబరాన్ని కలవటం, తన పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్‌లను బీజేపీలోకి పంపించి వారి కాళ్లు పట్టుకునే పనులు జగన్ చేయలేదన్నారు. ధైర్యంగా కేసులు ఎదుర్కొం టున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment