సత్తెనపల్లిలో కోడెలకు వ్యతిరేకంగా ప్రదర్శన చేస్తున్న టీడీపీ నాయకులు (ఫైల్)
సాక్షి, గుంటూరు : టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. కోడెల చివరి రోజుల్లో ఆయన్ను పట్టించుకోని టీడీపీ నాయకులు అనంతరం శవరాజకీయాలకు దిగి నానాయాగీ చేశారు. కోడెల మరణంతో సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పదవి ఖాళీ అయింది. ఈ పదవిని కోడెల తనయుడు శివరామకృష్ణకు ఇచ్చి రాజకీయంగా సానుభూతి సంపాదించుకోవాలని చంద్రబాబు యోచించినట్టు తెలిసింది. గత ఐదేళ్లలో తమను వేధించిన శివరామ్‌కే ఇన్‌చార్జి పదవిని ఇస్తామంటే ఒప్పుకునేది లేదని కోడెల వ్యతిరేకవర్గం తేల్చి చెప్పినట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు ముందే కోడెల శివప్రసాదరావుకు సత్తెనపల్లి టిక్కెట్ ఇవ్వొద్దని సొంత పార్టీలోని వ్యతిరేక వర్గం నాయకులు రోడ్లపై నిరసనలు చేపట్టారు.
ఎన్నికల అనంతరం కోడెల కుటుంబంపై కే–ట్యాక్స్ కేసులు వరుసగా నమోదవుతూ పార్టీ పరువు బజారున పడుతుండటంతో అప్పట్లో కోడెల వ్యతిరేక వర్గం నాయకులు పార్టీ ఇన్‌చార్జిగా కోడెలను తొలగించాలని డిమాండ్ చేశారు. 200 వాహనాలతో సత్తెనపల్లి నుంచి ర్యాలీగా గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో కోడెలను పార్టీ నుంచి పోమ్మనలేక పొగబెట్టాలని భావించిన చంద్రబాబు రాయపాటి రంగబాబును రంగంలోకి దించాడు. కోడెల వ్యతిరేక వర్గంతో రంగబాబు పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. రంగబాబే నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జని కోడెల వ్యతిరేకవర్గం నాయకులు ప్రచారం చేశారు. కోడెల మరణంతో నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి తానేనని శివరామ్ సైతం సన్నిహితులతో చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నట్టు ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు.
ఎటూ తేల్చుకోలేని పరిస్థితి...
రాజకీయంగా సానుభూతి సంపాదించడం కోసం కోడెల శివరామ్‌ను నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా నియమిస్తే క్యాడర్ పార్టీ మారే అవకాశం ఉంది. క్యాడర్ డిమాండ్‌ను శిరసా వహిస్తూ వేరే వ్యక్తిని నియమిస్తే కోడెల కుటుంబంపై చంద్రబాబు నకిలీ ప్రేమ బయటపడుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేక సతమతవుతున్నారని టీడీపీకి చెందిన ఓ సీనియర్ నాయకులు అంటున్నారు. మరో వైపు ఇన్‌చార్జి పదవి కోసం రాయపాటి రంగబాబు, టీడీపీ అనుబంధ సంస్థ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అబ్బూరి మల్లి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో సత్తెనపల్లి టిక్కెట్ ఆశించి భంగపడినవారిలో అబ్బూరి మల్లీ కూడా ఒకడు. శివరామ్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు దక్కకుండా కోడెల వ్యతిరేక వర్గాన్ని ఈ ఇద్దరూ లీడ్ చేస్తున్నట్టు సమాచారం. కోడెల మరణించినప్పుడు ఆయన కుటుంబంపై వల్లమాలిన ప్రేమాభిమానాలు ఒలకబోసిన జిల్లా టీడీపీ నాయకులు సైతం శివరామ్‌ను ఇన్‌చార్జిగా నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment