
సాక్షి, గుంటూరు : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అక్రమాల పంచాయితీ తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వద్దకు చేరింది. కోడెలను సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జిగా తొలగించాలంటూ టీడీపీ స్థానిక నేతలు తాజాగా చంద్రబాబును కలిశారు. సత్తెనపల్లి స్థానిక టీడీపీ నేతలు బుధవారం చంద్రబాబునాయుడిని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా కోడెలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా తొలగించాలని వారు చంద్రబాబును కోరినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో పార్టీ కార్యాలయం ఎదుట కూడా టీడీపీ శ్రేణులు కోడెలకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. అంతకుముందు కోడెల శివప్రసాదరావు స్వయంగా చంద్రబాబును కలిసి తన వాదన వినిపించారు. ఇటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అటు కోడెల వాదనలు వేర్వేరుగా చంద్రబాబు విన్నారు. కోడెలకు వ్యతిరేకంగా స్థానిక నేతలు, కార్యకర్తల వాదనను విన్న చంద్రబాబు.. ‘యూ డోంట్ వర్రీ.. నేను చూసుకుంటా’ అని వారితో చెప్పి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.
కోడెల శివప్రసాద్‌ను ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నియోజకవర్గాన్ని పదేళ్లు వెనక్కు నెట్టారని, కే–ట్యాక్స్‌ల పేరుతో సొంత పార్టీ నేతలను కూడా వదలకుండా దోచుకున్నారని, ఇక ఆ కుటుంబ పెత్తనం మేం భరించలేమని సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి వారు తీసుకెళ్లారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆ నియోజకవర్గ నాయకులు చంద్రబాబును కలవడం ఇదే తొలిసారి. కే–ట్యాక్స్ కారణంగా నియోజకవర్గంలో పార్టీ పరువుపోయిందని, కోడెల నాయకత్వంతో పని చేయలేమని టీడీపీ నేతలు అధినేత వద్ద గోడు వెళ్లబోసుకున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment