గుంటూరు మెడికల్: బ్రెయిన్ డెడ్ అయిన లారీ డ్రైవర్ అవయవాలను వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు దానం చేసేందుకు అంగీకరించారు. గుంటూరులో వైద్యులు శనివారం అతని అవయవాలను సేకరించారు. వివరాల్లోకి వెళితే.. క్రోసూరు మండలం నాగవరానికి చెందిన ఆంజనేయులు (45) లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారం రోజుల క్రితం బ్రెయిన్‌స్ట్రోక్ రావటంతో కుటుంబ సభ్యులు అతడిని గుంటూరు జీజీహెచ్‌కు చికిత్స కోసం తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గురువారం గుంటూరు సిటీ హాస్పిటల్‌కు తీసుకురాగా బీపీ తగ్గిపోయి ఆరోగ్యం విషమించింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆంజనేయులుకు శుక్రవారం బ్రెయిన్‌డెడ్ అయినట్లుగా ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు.
9 మందికి పునర్జన్మ..
ఈ సందర్భంగా వారు అవయదానం గురించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. శనివారం భార్య మాలతి, కుమారుడు మహేష్, కుమర్తె నాగమణి.. ఆంజనేయులు అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్, న్యూరాలజిస్ట్ డాక్టర్ చక్కా శివరామకృష్ణ, న్యూరో సర్జన్ డాక్టర్ చిట్టెం లక్ష్మణరావు, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ఐసీయూ స్పెషలిస్టు డాక్టర్ రాజశేఖర్, యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్‌లు బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి నుంచి అవయవాలను సేకరించారు.
బీపీ పూర్తిగా పడిపోవటంతో తొలుత గుండె, ఊపిరితిత్తులు ఇతర అవయవాలు పనిచేయటం మానివేశాయి. కిడ్నీలు, కళ్లు సేకరించినా కిడ్నీలు వినియోగించే అవకాశం లేకపోవటంతో నేత్రాలను మాత్రమే పెదకాకాని శంకర కంటి ఆస్పత్రికి తరలించారు. అవయవదానం చేసిన ఆంజనేయులు భౌతిక కాయాన్ని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు సందర్శించి నివాళులర్పించారు. ఆంజనేయులు కుటుంబ సభ్యులను అభినందించారు. అవయవ దానంపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఒక వ్యక్తి అవయవదానంతో 9 మందికి నూతన జీవితాన్ని ప్రసాదించవచ్చని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment