మట్టిలో కలిసిపోయే గుండె ఇంకో మనిషిని బతికించగలదు. మంటల్లో కాలిపోయే కళ్లు మరో బతుకులో వెలుగు నింపగలవు. ఆయువు తీరిన దేహం మరొకరి ఆయుష్షు రేఖను పెంచగలదు. ఇందుకు ఒకటే దారి.. అదే అవయవదానం. అంపశయ్యపై ఉన్న వారి తలరాత మార్చాలన్నా.. చావు అంచుల్లో నించున్న వారిని తిరిగి బతుకు దారిలోకి తీసుకురావాలన్నా ఇదొక్కటే మార్గం. నేడు అవయవదాన దినోత్సవం. చనిపోయాక శరీర భాగాలను వృధా చేయడం కంటే మరో మనిషి కోసం వినియోగించడం మాధవ సేవ అని చెప్పే రోజు. అపోహలు వీడి ఓ చైతన్య కాగడాను ఊరూరా వెలిగించాల్సిన తేదీ.
ఇచ్ఛాపురం రూరల్: మనిషి చనిపోయాక దేహంతో పాటే అవయవాలన్నీ మట్టిలో కలిసిపోతాయి. లేదా చితిలో కాలి బూడిదవుతాయి. అవే అవయవాలను దానం చేస్తే ఎన్నో కుటుంబాల్లో చిరునవ్వులు నింపవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారణ అయిన వారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. బ్రెయిన్ డెడ్ కేసు అంటే మనిషి పూర్తిగా చనిపోయినట్లే లెక్క. సాధారణ మరణాల్లో నేత్రాలను తీసుకుంటారు.
నమోదు ఇలా
అవయవ దానం చేయాలనుకునే వారు ముందుగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తమకు తెలిసినవారందరికీ సమాచారం అందివ్వాలి. దీని వల్ల అతను చనిపోయాక అవయవ దానం చేసేందుకు వీలు కలుగుతుంది. జీవన్‌దాన్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టగా, రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ కేంద్రంగా 2015 నుంచి తమ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా బ్రెయిన్‌డెడ్ కేసుల నుంచి అవయవాలు సేకరిస్తారు. ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జీవన్‌దాన్ డాట్ జీవోవి డాట్ ఇన్’ వెబ్ సైట్‌లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్నవారికి ప్రభుత్వం ఆర్గాన్ డోనార్ కార్డును అందజేస్తుంది.
సజీవమూర్తి కిరణ్‌చంద్
సోంపేట పట్టణం గీతా మందిరం కాలనీకి చెందిన మల్లారెడ్డి మోహన్, గిరిజా కల్యా ణిల ఒక్కగానొక్క కుమారుడు కిరణ్‌చంద్(16) జిల్లా వాసుల్లో నింపిన స్ఫూర్తి అనన్యసామాన్యం. 2023 ఏప్రిల్ 15న పదో తరగతి ఆఖరి పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న కిరణ్‌చంద్ అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్రమైన తలనొప్పి, జ్వరంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అయితే మెదడులో సమస్య వచ్చిందని, వెంటనే విశాఖపట్నం వెళ్లాలని వైద్యులు సూచించడంతో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి రాగోలు జెమ్స్ ఆస్పత్రికి మార్చారు. వారం రోజుల అనంతరం పరిస్థితి విషమించడంతో వైద్యులు, ఆర్గాన్ డొనేషన్ సమన్వయకర్తలు తల్లిదండ్రులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. గుండె, కిడ్నీలు, లివర్, కళ్లను దానం చేసి మరికొందరి బతుకుల్లో వెలుగులు నింపారు.
8 మంది జీవితాల్లో ‘చంద్ర’కాంతులు
జి.సిగడాం మండలం మధుపాం గ్రామానికి చెందిన పట్నాన చంద్రకళ(32) సీఎఫ్‌గా పనిచేసేవారు. ఈ ఏడాది మే 30న తలనొప్పితో బాధపడుతూ శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను విశాఖ విమ్స్ ఆస్పత్రికి తరలించారు. చంద్రకళ తలలో నరాలు చిట్లిపోయి రక్తస్రావం అయినట్లు గుర్తించారు. దీంతో బ్రెయిన్‌డెడ్ అయిందని, ఈమె అవయవాలను ఇతరులకు దానం చేసి వారి జీవితాలకు నూతన వెలుగులు ప్రసాదించాలని వైద్యులు కుటుంబ సభ్యులకు సూచించారు. భర్త శివను, ఇద్దరు కుమార్తెలను ఒప్పించడంతో జూన్ 1న అవయవదానం చేసి ఎనిమిది మంది జీవితాల్లో వెలుగులు నింపారు.
Comments
Please login to add a commentAdd a comment