
మరణిస్తూ మహాదానం
► నెల్లూరులో దినేశ్‌రెడ్డి బ్రెయిన్‌డెడ్.. చనిపోతూ అవయవదానం
► పత్యేక హెలికాప్టర్‌లో గుండె, కాలేయం హైదరాబాద్‌కు తరలింపు
► కిమ్స్‌లో యువకుడికి కాలేయ మార్పిడి
► నెల్లూరులో మరో ఇరువురికి కిడ్నీల దానం
సాక్షి, హైదరాబాద్/నెల్లూరు రూరల్: తను కన్నుమూస్తూ మరో ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపి అమరజీవిగా నిలిచాడు నెల్లూరుకు చెందిన దినేశ్‌రెడ్డి (32). నెల్లూరు నవాబుపేటలో నివాసముంటున్న ఆయనకు ఈనెల 13న రాత్రి ఫిట్స్ వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు శ్రీహరిరెడ్డి, వసంతలక్ష్మిలు హుటాహుటిన నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు మెదడుకి శస్త్ర చికిత్స చేశారు. చికిత్స పొందుతుండగానే మరోమారు ఈనెల 18న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కోమాలోకి వెళ్లారు. దీంతో వైద్యులు దినేష్‌రెడ్డి బ్రెయిన్‌డెడ్ అయ్యాడని నిర్ధారించారు. అనంతరం శోకసంద్రంలోనే దినేశ్‌రెడ్డి అవయవదానానికి తల్లిదండ్రులు అంగీకరించగా, వైద్యులు జీవన్‌దాన్‌కు సమాచారమిచ్చారు.
జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసుకుని హైదరాబాద్ కిమ్స్‌లో కాలేయ, గుండె మార్పిడి చికిత్సకు ఎదురు చూస్తున్న ఇద్దరు బాధితులకు సమాచారం ఇచ్చారు. అవయవమార్పిడి చికిత్సకు వారు అంగీకరించడంతో వారికి చికిత్స చేస్తున్న వైద్య బృందం వెంటనే ప్రత్యేక హెలికాప్టర్‌లో నెల్లూరు చేరుకుంది. దాత నుంచి గుండె, కాలేయం, కిడ్నీలను సేకరించింది. రెండు కిడ్నీలను నెల్లూరు కిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులకు అమర్చగా, గుండె, కాలేయాన్ని ప్రత్యేక బాక్స్‌లో భద్రపరిచి ఉదయం 6.30 గంటలకు నెల్లూరులో గ్రీన్‌చానల్ ద్వారా జిల్లా పోలీసు కవాతు మైదానానికి తీసుకొచ్చి, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి ఉదయం 7.30కి చేర్చారు.
ట్రాఫిక్ పోలీసుల సహాయంతో కిమ్స్‌కు తరలించారు. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన 36 ఏళ్ల యువకునికి కాలేయాన్ని విజయవంతంగా అమర్చారు. ఒక కిడ్నీ నారాయణ ఆసుపత్రికి, మరో కిడ్నీని నగరంలోని కిమ్స్‌కు, కళ్లను మోడరన్ ఐ బ్యాంకుకి తరలించారు. దాత నుంచి సేకరించిన గుండె స్వీకర్తకు మ్యాచ్ కాలేదు. దాత హైబీపీతో బాధపడుతుండటం, 1సెంటీమీటర్ల మందం లో ఉండాల్సిన గుండె రక్త నాళాలు 1.5 సెంటీమీటర్ల మందంలో ఉండటంతో అవయవమార్పిడికి పనికి రాలేదు. దీంతో గుండె మార్పిడి చికిత్సను విరమించుకున్నట్లు కిమ్స్ సీఈవో భాస్కర్‌రావు వెల్లడించారు.