
పాత్రికేయుడి అవయవదానం
తమ ఎదుట కొండంత కష్టం కనపడుతున్నా, పది మందికీ సాయపడాలనుకున్నారు ఆ కుటుంబ సభ్యులు.
తమ ఎదుట కొండంత కష్టం కనపడుతున్నా, పది మందికీ సాయపడాలనుకున్నారు ఆ కుటుంబ సభ్యులు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీయూడబ్ల్యుజే నాయకుడు చేరాల కృష్ణ (30)కు బ్రెయిన్ డెడ్ కావడంతో.. ఆయన అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు.
సాక్షి దినపత్రిక అబ్దుల్లాపూర్ మెట్ విలేకరిగా పనిచేస్తున్న కృష్ణ గత గురువారం రాత్రి విధులు ముగించుకుని రాత్రి 11గంటల ప్రాంతంలో బైక్‌పై ఇంటికి వెళ్తుండగా వనస్థలిపురం ఆటోనగర్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. తలకు తీవ్రగాయాలు కావడంతో కోమాలోకి వెళ్లిన కృష్ణను ఎల్‌బినగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. తల లోపలి భాగంలో బలమైన గాయాలు కావడంతో బ్రెయిన్‌లో అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం జరిగింది. చిన్నమెదడుకు బలమైన గాయాలు కావడంతో.. ఆయనను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఆపరేషన్ జరిగిన మూడు రోజుల తర్వాత బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో కృష్ణ భార్య గౌతమి, తల్లి , సోదరుడు లింగస్వామి తదితరులు అవయవ దానానికి అంగీకరించారు. కృష్ణ అకాల మరణం పట్ల టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ, ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్ తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కాగా, కృష్ణ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లిలో మంగళవారం ఉదయం జరుగుతాయి.