అతడు జీవితాన్ని ఎంత ఆరాధించాడో తెలియదు కానీ, చనిపోతూ ఆరిపోతున్న దీపాలకు ఆరో ప్రాణమయ్యాడు. అతడు అతడ్ని ఎంతగా ప్రేమించాడో తెలియదు గానీ, నలుగురికి పునర్జన్మ ప్రసాదించి ప్రాణానికి అసలైన అర్థం చెప్పాడు. కళ్ల ముందు తిరుగుతున్న బిడ్డ కుప్పకూలిపోతే.. మరణానికి చేరువైతే.. కూలబడి కూర్చోకుండా కన్నీటిని దిగమింగుతూనే కొడుకు అవయవాలను దానంచేసి ఆదర్శమూర్తులుగా నిలిచారు ఆ తల్లిదండ్రులు. కన్నీటికే కన్నీరు తెప్పించే ఈ విషాద గాథ గుంటూరు నెహ్రూనగర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
గుంటూరు నెహ్రూనగర్ తొమ్మిదో లైనుకు చెందిన సూరగాని శివలక్ష్మయ్య, గోవర్ధన లక్ష్మికి ఇద్దరు సంతానం. పెద్దకుమారుడు మహేష్‌కుమార్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా, చిన్న కుమారుడు అశోక్‌కుమార్ (25) అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఆర్‌వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నారు. కుమారులిద్దరూ మంచి భవిష్యత్తు పొందడం ఆ తల్లిదండ్రులకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది. కానీ, ఇంతలోనే విధి వక్రించింది. గత మంగళవారం తమ చిన్న కుమారుడు నిద్రలోనే పెద్దగా గురకపెడుతూ అపస్మారక స్థితిలోకి చేరు కున్నాడు. భయాందోళనతో ఆస్పత్రికి తీసుకువెళ్లిన ఆ తల్లిదండ్రులు చేదువార్త విన్నారు. అశోక్ కోమాలోకి వెళ్లిపోయాడని డాక్టర్లు స్పష్టం చేశారు.
అయితే, మెరుగైన వైద్యం కోసం తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రిలో చేర్పించారు. నాలుగు రోజుల అనంతరం శస్త్ర చికిత్సల వల్ల స్పందన లేదని, అశోక్ బ్రెయిన్‌డెడ్ అయ్యాడని అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఉబికి వస్తున్న కన్నీటిని దిగమింగుకుని అవయవదానానికి ముందుకొచ్చారు ఆ తల్లిదండ్రులు. ఈ క్రమంలో జీవన్ దాన్‌ను ఆశ్రయించారు. జీవన్ దాన్‌లో అప్పటికే అవయవాల కోసం నమోదు చేసుకున్న వారి జాబితాను అనుసరించి అశోక్ అవయవాలను దానం చేశారు. ఆదివారం వేకువజామున ఈ అవయవ దాన ప్రక్రియను మణిపాల్ వైద్యులు పూర్తిచేశారు. లివర్, ఒక కిడ్నీ మణిపాల్ ఆస్పత్రిలోని ఇద్దరు రోగులకు అమర్చగా, కళ్లు శంకర్ కంటి ఆస్పత్రికి, మరొక కిడ్నీ ఆయుష్ ఆస్పత్రికి అందజేశారు. తాను చనిపోతూ నలుగురిలో తిరిగి జీవించాడు అశోక్. ఈ సందర్భంగా అశోక్ తల్లిదండ్రులు మాట్లాడుతూ అవయవ దానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పడం విశేషం. - తాడేపల్లి రూరల్