ఆత్మీయ స్పర్శే అండ!
రోజుకో పల్లెలో రైతుమిత్ర సమావేశాలతో రైతుకు భరోసా, ఆత్మగౌరవం
విప్లవాత్మక వ్యవసాయ విస్తరణ నమూనాకు పన్నెండేళ్ల క్రితమే శ్రీకారం చుట్టిన అశోక్‌కుమార్
రైతు ఆత్మహత్యల నివారణకు ఇదే రాచబాట అంటున్న అప్పటి జగిత్యాల ఏవో
చుట్టూ అందరూ ఉన్నా నికరంగా తనకంటూ ఎవరూ లేని వాడు రైతన్న. అందరూ అన్నదాత అని.. దేశానికి వెన్నెముక అని.. రైతే రాజు అని గొప్ప గొప్ప మాటల రొద మధ్యలో.. కుప్పలు తెప్పలుగా అప్పుల దిగుబడినిస్తున్న కన్నీటి సేద్య క్షేత్రంలో దిక్కుతోచని అభిమన్యుడవుతున్నాడు సగటు రైతన్న. అసలు.. రైతుకు సంబంధించి ప్రభుత్వం అంటే ఎవరు? ప్రభుత్వ పథకాలను రైతుల దగ్గరకు చేర్చే యజ్ఞ క్రతువును నిర్వహించాల్సిందెవరు? ఉన్న ఊళ్లోనే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లున్న రైతులను సంఘటిత శక్తిగా మార్చే జీవ చైతన్యాన్నివ్వగలిగేదెవరు? ఎదురీతలో అలసిసొలసిన రైతు మదిలో జీవితేచ్ఛ కొండెక్కకుండా కాపాడే ఆత్మీయ భరోసానివ్వగలిగేదెవరు? ఎవరు?? ఎవరు..??? అనుదినం అన్నదాతల బలవన్మరణాలను మౌనంగా వీక్షిస్తున్న పౌరసమాజానికి ఇవి శేష ప్రశ్నలే. కానీ, దన్నపనేని అశోక్‌కుమార్‌కు మాత్రం కాదు..! విప్లవాత్మక వ్యవసాయ విస్తరణ నమూనా అమలు ద్వారా బడుగు రైతుకు క్షేత్రస్థాయిలో బతుకు భరోసా ఇవ్వడం ఎలాగో పుష్కరం కిందటే ఆయన రుజువు చేశారు!
ఎందుకంటే.. ఈ ప్రశ్నలకు ఆయన పుష్కరకాలం కిందటే విజయవంతంగా ఆచరణాత్మక సమాధానాలు వెతికినవాడు! పల్లెను, రైతును గుండెల నిండుగా ప్రేమతో బాధ్యతనెరిగిన మండల వ్యవసాయాధికారిగా వినూత్న పథకాలను అమల్లోకితేవడం ద్వారా తెలుగునాట వ్యవసాయాభివృద్ధి చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ముంచుకొచ్చిన కరువు రైతుల బతుకులను నిలువునా మింగేస్తుంటే.. రైతు గురించి ఎన్నో వట్టిమాటలు చెబుతున్న మనం వ్యవసాయ సంక్షోభం పరిష్కారానికి వాస్తవానికి చేస్తున్నదేమిటి? అని మండల వ్యవసాయాధికారులను, నాయకులను నిలదీసి ప్రశ్నిస్తున్నారాయన.
కరీంనగర్ జిల్లా సారంగపూర్ మండలం నాగనూర్ లచ్చక్కపేటలో 60 ఏళ్ల క్రితం జన్మించిన అశోక్‌కుమార్ వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. 1976లో అచ్చంపేట(మహబూబ్‌నగర్) సమితి వ్యవసాయాధికారిగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2000-2002 మధ్యకాలంలో కరీంనగర్ జిల్లా జగిత్యాల మండల వ్యవసాయాధికారిగా పనిచేస్తూ రైతు జనాభ్యుదయం కోసం విశిష్టమైన నిర్మాణాత్మక కృషి చేశారు(ఆయన బదిలీ తర్వాత పరిస్థితి మళ్లీ మామూలే అయింది). వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ డెరైక్టర్‌గా రెండేళ్ల క్రితం రిటైరైన అశోక్‌కుమార్.. విజిలెన్స్ ప్రత్యేకాధికారిగా, ప్రస్తుతం మెదక్ జిల్లా (తెలంగాణ సీఎం కేసీఆర్ నియోజకవర్గం)గజ్వేల్ ప్రాంతీయాభివృద్ధి ప్రాధికార సంస్థలో వ్యవసాయ విభాగాధిపతిగా సేవలందిస్తున్నారు. శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలోని 30 జగిత్యాల మండల గ్రామాల్లో చేపట్టిన పనులివి.. ఆయన మాటల్లోనే..
రోజుకో ఊళ్లో రైతుల సమావేశమే ముఖ్యం: జగిత్యాల మండల వ్యవసాయాధికారిగా పల్లెలకు వెళ్లి రైతులతో మమేకమై ప్రణాళికాబద్ధంగా పనిచేయడం వల్ల వారి జీవితాలు బాగుపడ్డాయి. మండల కేంద్రంలో రైతు సంక్షేమ మండలి, దానికి అనుబంధంగా ప్రతి గ్రామంలో రైతుమిత్ర సంఘం ఏర్పాటు చేశారు. ప్రతి నెలా నిర్దిష్ట తేదీన ఉదయం 8 గంటలకు ఆరోజు ఆదివారమైనా, పండగైనా సరే రైతులతో సమావేశమయ్యేవాణ్ణి. అందరితోనూ కరచాలనం చేయడం, ఎవరు ఆలశ్యంగా వచ్చినా జరిమానా, అందరూ నేలమీదే కూర్చోవడం.. ఇవీ నిబంధనలు. తక్కువ ఖర్చుతో కూడిన వ్యవసాయంతోపాటు ఐకమత్యం, క్రమశిక్షణ, మంచి అవగాహన-ఆలోచన- ఆచరణ భావనలకు అక్కడేపునాది పడింది. రెండు, మూడు నెలలు టంచనుగా సమావేశాలు జరిగేటప్పటికి.. రైతులందరికీ ఇది ఆధారపడదగిన వేదిక అని అర్థమైంది. రైతుమిత్ర సంఘం పిలుపు ఇచ్చింది అంటే తూ.చ. తప్పకుండా అమలవ్వాల్సిందే అన్నంతగా క్రమశిక్షణ వచ్చింది. సొంత విత్తనం తయారు చేసుకోవడం, కాంప్లెక్స్ ఎరువులు కొనుక్కోవడం కన్నా సొంతంగా తయారు చేసుకోవడం, తగుమాత్రంగా ఎరువులు, పురుగుమందులు వాడటం, పచ్చిరొట్ట ఎరువులతో భూసారం పెంచడంతో సాగు వ్యయం తగ్గింది. పొలం గట్ల మీద, ఇళ్ల దగ్గర టేకు మొక్కలు నాటించడంతో రైతుకు పచ్చని భవిష్య నిధి ఏర్పడింది.
రైతు గుర్తింపుకార్డులు: ఒకసారి రైతు మిత్ర సమావేశంలో నేను నా గుర్తింపు కార్డు చూపించాను. రైతులు మాకూ గుర్తింపుకార్డు కావాలన్నారు. అప్పుడు సంఘం తరఫున బ్యాడ్జిలు చేయించి ఇచ్చాం. బ్యాంకుల్లో, ఇతర ఆఫీసుల్లో రైతులపై గౌరవం పెరిగింది. పనులు చకచకా అయ్యేవి. రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది.
రైతు నుంచి వినియోగదారునికి: ధాన్యం, పప్పుధాన్యాలను నేరుగా అమ్మడం కన్నా బియ్యం, పప్పులుగా ఆడించి అమ్మితే ఎక్కువ ఆదాయం వస్తుందని రైతులకు నచ్చజెప్పాం. జగిత్యాల రైతు బజారులో స్టాల్ పెట్టి ఒక ఏడాది వెయ్యి క్వింటాళ్ల బీపీటీ బియ్యం, పప్పులను రైతులే స్వయంగా అమ్మారు. ఎకరానికి రూ. 8 వేల వరకు అదనపు ఆదాయం వచ్చింది. వినియోగదారులకు కూడా చౌకగా నాణ్యమైన బియ్యం అందుబాటులోకి వచ్చాయి. అప్పటి వ్యవసాయ శాఖ కమిషనర్ అజేయ కల్లం ప్రశంసలు అందిన తర్వాత కొండంత బలం వచ్చింది. ఇక వెనక్కి తిరిగి చూడలేదు.
మండల వ్యవసాయాధికారి అంటే రైతులకు పెద్ద అధికారి కిందే లెక్క. ఆయన పెద్ద దిక్కువంటి వాడు. వ్యవసాయాధికారికే కాదు స్థానిక నాయకులకూ బాధ్యతలు అప్పగించి, విజయవంతంగా రైతును ఒంటరితనం నుంచి, వ్యాపారుల దోపిడీ నుంచి, అవినీతి నుంచి విముక్తం చేసి.. పల్లెల్లో ఆశావహమైన జీవన వాతావరణాన్ని నిర్మించాం. వీటన్నిటికీ ఆత్మీయతను పంచే రైతు మిత్ర సమావేశాలే పునాది అయ్యాయి!
నా జన్మధన్యమైంది!
జనగామ రైతులతో గొప్ప అనుబంధం ఏర్పడింది. ఒక తరం నన్ను మర్చిపోదు. పన్నెండేళ్లు గడచినా అక్కడి రైతులు ఇప్పటికీ ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అది మామూలు ప్రేమ కాదు. నా జన్మ ధన్యమైంది. జీవితానికి అదే తృప్తి. రైతుల ఆశీర్వాదం వల్లనే ఇంత సంతోషంగా ఉన్నా. జనగామ అనుభవంతోనే రైతుబాట, పల్లెనిద్ర వంటి పథకాలను రూపొందించాం. మండల వ్యవసాయాధికారులు ఆ విధంగా పనిచేస్తే రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉండదు. లేదంటే పదేళ్లలో వ్యవసాయం చేసేవాళ్లు మిగలరు. ఆత్మహత్యలు, కరువు వున్నా డబ్బు తీసుకోకుండా ఒక్క ఆఫీసులో పనులు జరుగుతున్నాయా? లంచగొండి సిబ్బందిని, వారిని కంట్రోల్ చేయని వారిని ‘నిర్భయ’ మాదిరి చట్టంతో శిక్షించాలి.
- డి. అశోక్‌కుమార్ (88866 14808), గజ్వేల్ ప్రాంతీయాభివృద్ధి ప్రాధికార సంస్థ, మెదక్ జిల్లా