అప్పుడే నూరేళ్లు నిండాయా... నాన్నా
అనంతపురం మెడికల్ : లేయ్ నాన్న లేయ్ కాలేజ్‌కి పోదువు..లేయప్పా...ఎంత పనై పోయిందయ్యా అంటూ అశోక్‌కుమార్ తండ్రి రామాంజనప్ప బోరున విలపించాడు. చెట్టంత కొడుకు కళ్ల ముందే చచ్చిపోయాడ్ సార్...ఇంతకన్నా ఘోరం ఏముంటుందా.. వ్యవసాయం చేసుకుంటూ కష్టపడి చదివించుకుంటున్నాం. అంతలోనే నూరేళ్లు నిండిపోయాయయ్యా...అంటూ కన్నీరుమున్నీరుగా రోధించడం అందరినీ కలచి వేసింది.
మడకశిర-పెనుకొండ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన వారిలో ఇద్దరు అనంతపురం సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. క్షతగాత్రులలో ఏడుగురిని మెరుగైన చికిత్స కోసం ఇక్కడికి తీసుకువచ్చారు. వీరిలో ఆనందపురానికి చెందిన రామాంజప్ప కుమారుడు అశోక్ కుమార్(17), మావుటూరుకు చెందిన సిద్దప్ప కుమారుడు గంగాధర్(18) మృతి చెందారు.
బండ్లపల్లికి చెందిన కదిరప్ప కుమారుడు అశోక్‌కుమార్(18)ను మెరుగైన చికిత్స కోసం నేత్ర ఐ కేర్ నిర్వాహకులు గాంధీ తన అంబులెన్స్‌లో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. మావుటూరుకు చెందిన సుబ్బయ్య కుమారుడు శివశంకర్(17), రొద్దంకు చెందిన పతిమన్న కుమారుడు జీ కొండయ్య(32), మేకలపల్లికి చెందిన రామాంజి కూతురు రాధ(16), రొద్దం మండలం గొబ్బరపల్లికి చెందిన అంజినప్ప కుమారుడు వెంకటేశులు(17) స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదిలా ఉండగా క్షతగాత్రులు, వారి బంధువులతో ఎమర్జెన్సీ వార్డు కిక్కిరిసిపోయింది. మరోవైపు రోగుల ఆర్తనాదాలతో వార్డు మార్మోగింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు, ఆర్‌ఎంఓ డాక్టర్ పద్మావతి, క్యాజువాలిటీ ఇన్‌చార్జ్ డాక్టర్ శివకుమార్ రోగులకు దగ్గరుండి సేవలందించారు. 20 మంది హౌస్‌సర్జన్‌లు, 20 మంది స్టాఫ్‌నర్సులు, ప్రభుత్వ నర్సింగ్ విద్యార్థినిలు శ్రమించారు. ఆక్సిజన్‌ను అందిస్తూ ఎప్పటికప్పుడు పల్స్‌ను గమనించి సేవలందించారు. తహశీల్దార్ షేక్ మహబూబ్ బాషా, ఆర్‌ఐ రవిశంకర్ రెడ్డి పరిస్థితిని అడిగి తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపారు.