Manipal Hospital
-
నాడు అద్దె ఇల్లు.. నేడు 6 యూనివర్సిటీలు, 28 ఆస్పత్రులు
ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ న్యూయార్క్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ డేవిడ్సన్ కెంప్నర్ క్యాపిటల్ మేనేజ్మెంట్తో కొనసాగుతున్న రుణ వివాదానికి పరిష్కారం అంచున ఉంది. మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ చైర్మన్ రంజన్ పాయ్ బైజూస్‌లో దాదాపు రూ. 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో డేవిడ్సన్ కెంప్నర్ నుంచి బైజూస్ తీసుకున్న రూ.800 కోట్ల రుణాన్ని సెటిల్ చేసేందుకు రంజన్ పాయ్ రూ.1,400 కోట్లు చెల్లించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎవరీ డాక్టర్ రంజన్ పాయ్.. ఆయన బిజినెస్.. నెట్‌వర్త్ వంటి విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎవరీ డాక్టర్ రంజన్ పాయ్? 1972 నవంబర్ 11న జన్మించిన డాక్టర్ రంజన్ పాయ్ ఒక అర్హత కలిగిన వైద్యుడు, వ్యాపారవేత్త. మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ (MEMG) ఛైర్మన్. ఈ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ఆరు విశ్వవిద్యాలయాలు, 28 ఆసుపత్రులను నడుపుతోంది. రంజన్ పాయ్ తండ్రి పద్మభూషణ్ అవార్డు గ్రహీత రాందాస్ పాయ్. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (MAHE)కి రాందాస్ పాయ్ ఛాన్సలర్‌గా ఉన్నారు. రంజన్ పాయ్ మణిపాల్‌లోని కస్తూర్బా మెడికల్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసి, యూఎస్ వెళ్లి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఫెలోషిప్ పూర్తి చేశారు. అద్దె ఇంట్లో ప్రారంభం డాక్టర్ రంజన్ పాయ్ మలేషియాలోని మెలక మణిపాల్ మెడికల్ కాలేజీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 2000 సంవత్సరంలో రంజన్ పాయ్ బెంగళూరులోని అద్దె ఇంట్లో మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్‌ను ప్రారంభించారు. కేవలం 2 లక్షల డాలర్లతో వ్యాపారాన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు దీని విలువ సుమారు 3 బిలియన్ డాలర్లు ( దాదాపు రూ. 25,000 కోట్లు). నెట్‌వర్త్ ఫోర్బ్స్ ప్రకారం డాక్టర్ రంజన్ పాయ్ నెట్‌వర్త్ 2.8 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 23,000 కోట్లు). మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్‌కు ఇప్పుడు మలేషియా, ఆంటిగ్వా, దుబాయ్, నేపాల్ దేశాల్లో కూడా క్యాంపస్‌లు ఉన్నాయి. ఇదే కాకుండా డాక్టర్ రంజేన్ పాయ్కి మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ అనే సంస్థ కూడా ఉంది. -
మణిపాల్ చేతికి ఆమ్రి హాస్పిటల్స్
కోల్‌కతా/న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ సంస్థ మణిపాల్ హాస్పిటల్స్ తాజాగా ఇమామీ గ్రూప్ సంస్థ ఆమ్రి హాస్పిటల్స్‌లో 84% వాటాను సొంతం చేసుకుంది. సింగపూర్ కంపెనీ టెమాసెక్ హోల్డింగ్స్‌కు 59% వాటాగల మణిపాల్ ఇందుకు రుణాలుసహా రూ. 2,300 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఆమ్రి హాస్పిటల్స్‌లో 15% వాటాతో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామీ గ్రూప్ ఇన్వెస్టర్‌గా కొనసాగనుంది. తాజా కొనుగోలుతో మణిపాల్ హాస్పిటల్స్ దేశ తూర్పు ప్రాంతంలో కార్యకలా పాలు విస్తరించనుంది. సంయుక్త సంస్థ దేశవ్యాప్తంగా 17 పట్టణాలు, నగరాలలో 9,500 పడకలతో 33 ఆసుపత్రులను నిర్వహించనుంది. వెరసి దేశీయంగా రెండో పెద్ద హెల్త్‌కేర్ సేవల సంస్థగా ఆవి ర్భవించనుంది. సంబంధిత వర్గాల సమా చారం ప్రకారం ఆమ్రి రుణ భారం రూ.1,600 కోట్లు కాగా.. రూ.2,400 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో డీల్ జరిగినట్లు తెలుస్తోంది. క్లినికల్ నైపుణ్యాలు, మౌలిక సదుపాయాలుగల ఆమ్రి హాస్పిటల్స్‌ను జత కలుపుకోవడం ద్వారా భారీ నెట్‌వర్క్‌కు తెరలేవనున్నట్లు మణిపాల్ పేర్కొంది. తద్వారా దేశ తూర్పుప్రాంతంలో అత్యంత నాణ్యమైన ఆరోగ్యపరిరక్షణ సేవలకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణమైన సేవలు అందించేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేసింది. అయితే మణిపాల్ 2021లో కోల్‌కతాలోని కొలంబియా ఏషియా హాస్పిటల్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా తూర్పు భారతంలో కార్యకలాపాలు ప్రారంభించింది. కాగా.. హెల్త్‌కేర్ రంగ మరో దిగ్గజం అపోలో హాస్పిటల్స్ 10,000 పడకల సామర్థ్యంతో 64 ఆసుపత్రులను నిర్వహిస్తోంది. -
గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సీఎం జగన్ పరామర్శ
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి వెళ్లి గవర్నర్ ఆరోగ్య స్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారాయన. తీవ్ర కడుపు నొప్పితో సోమవారం మణిపాల్ ఆస్పత్రిలో గవర్నర్ నజీర్ చేరిన సంగతి తెలిసిందే. ఆపై వైద్య పరీక్షల్లో అపెండిసైటిస్‌గా నిర్ధారణ కావడంతో వైద్యులు సర్జరీ చేశారు. ఆపై ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని బులిటెన్ విడుదల చేశారు వైద్యులు. ఇక తిరుమల బ్రహ్మోత్సవాలతో పాటు తిరుపతిలో పలు అభివృద్ధి పనుల్లో సోమవారం బిజీగా ఉన్న సీఎం జగన్.. అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు గవర్నర్ నజీర్ ఆరోగ్యంపై ఆరా తీస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇవాళ డోన్ పర్యటన ముగించుకుని నేరుగా ఆస్పత్రికే చేరుకున్నారాయన. -
గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(65) సోమవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. అయితే వైద్య పరీక్షల అనంతరం.. గవర్నర్‌కు అపెండిసైటిస్‌గా వైద్యులు ధృవీకరించారు. గవర్నర్ అస్వస్థత గురించి రాజ్‌భవన్ అధికారుల నుంచి సమాచారం అందుకున్న వైద్యులు తొలుత విజయవాడకే వచ్చి గవర్నర్‌కు పరీక్షలు చేశారు. ఆస్పత్రిలో చేరాలని ఆయనకు సూచించారు. వైద్య నిపుణుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరిన గవర్నర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం.. అపెండిసైటిస్‌గా తేల్చారు. వెంటనే గవర్నర్ నజీర్‌కు రోబోటిక్ విధానం ద్వారా సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. రేపు డిశ్చార్జ్ ఆయన అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై.. సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి తిరుపతి, తిరుమల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. గవర్నర్ అస్వస్థత సమాచారం అందుకున్న వెంటనే.. సీఎం జగన్ అధికారులతో మాట్లాడారు.గవర్నర్ త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. -
మణిపాల్ హాస్పిటల్స్‌లో షియర్స్‌కు మెజారిటీ వాటా
న్యూఢిల్లీ: మణిపాల్ హాస్పిటల్స్‌లో మెజారిటీ వాటాలు దక్కించుకునే దిశగా షియర్స్ హెల్త్‌కేర్ ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. హెల్త్‌కేర్ రంగంలో ఇదే అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ డీల్ కాగలదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. డీల్‌పై వచ్చే వారం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని వివరించాయి. ఒప్పందం ప్రకారం మణిపాల్ హాస్పిటల్స్ విలువ సుమారు రూ.40,000 కోట్లు – రూ.42,000 కోట్లుగా మదింపు చేసినట్లు పేర్కొన్నాయి. ప్రమోటర్ కుటుంబం, ఇతర ఇన్వెస్టర్లయిన టీపీజీ, ఎన్ఐఐఎఫ్ నుంచి వాటాలు కొనుగోలు చేయడం ద్వారా తన వాటాను పెంచుకునేందుకు షియర్స్ ప్రయత్నాల్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మిగతా ఇన్వెస్టర్ల నుంచి 41 శాతం వాటాను కొనుగోలు చేయడం ద్వారా షియర్స్ తన మొత్తం వాటాను 59 శాతానికి పెంచుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. మణిపాల్ గ్రూప్‌నకు 28 ఆస్పత్రులు, 8,000 పడకలు ఉన్నాయి. సింగపూర్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం టెమాసెక్‌కు సంబంధించిన హెల్త్‌కేర్ డెలివరీ అసెట్లను షియర్స్ నిర్వహిస్తోంది. షియర్స్‌కు మణిపాల్ హాస్పిటల్స్‌లో ప్రస్తుతం 18 శాతం వాటాలు ఉన్నాయి. దానితో పాటు అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీకి 21%, భారత సార్వభౌమ వెల్త్‌ఫండ్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్)కు 8 శాతం వాటాలు ఉన్నాయి. కోల్‌కతాకు చెందిన హాస్పిటల్ చెయిన్ మెడికా సినర్జీ, మెడాంటా హాస్పిటల్స్ ఆపరేటర్ గ్లోబల్ హెల్త్‌లోనూ షియర్స్ వాటాదారుగా ఉంది. -
ఆస్పత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం
బెంగుళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ బెంగుళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆయన శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడతున్నట్లు వెల్లడించాయి. ఆయన వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆయన శ్వాస సంబంధిత మిషన్ సాయంతో కాస్త హాయిగా శ్వాస తీసుకుంటున్నారని, త్వరితగతిన పూర్తిగా కోలుకుంటారని తెలిపింది. కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ దగ్గరుండి మరీ మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. (చదవండి: ఏడాది వయసు కొడుకుతో ఈ రిక్షా నడుపుతున్న మహిళ: వీడియో వైరల్) -
సీఎం పీఏ పేరుతో ఫేక్ మెసేజ్‌లు
సాక్షి, తాడేపల్లి రూరల్: సీఎం పీఏనంటూ ఓ కార్పొరేట్ ఆస్పత్రి ఎండీకి ఫేక్ మెసేజ్ పంపి డబ్బులు డిమాండ్ చేసిన గుర్తుతెలియని వ్యక్తిపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. సీఐ శేషగిరి తెలిపిన వివరాల ప్రకారం సీఎం పీఏ నాగేశ్వరరెడ్డినంటూ మణిపాల్ ఆస్పత్రి ఎండీకి ఓ మెసేజ్ పంపించాడు. ఆ మెసేజ్‌లో ఇంటర్నేషనల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఆంధ్రాకు చెందిన రుక్కిబుయ్ అనే యువకుడు సెలెక్ట్ అయ్యాడని, అతడికి ఇంటర్నేషనల్ క్రికెట్ కిట్ అవసరమయ్యిందని, దానిని కొనుగోలు చేసేందుకు రూ.10,40,440ను పంపించాలని మెసేజ్ పెట్టాడు. బెంగళూరులో ఉన్న మణిపాల్ హాస్పిటల్స్ ఎండీ తాడేపల్లిలోని మణిపాల్ అసోసియేట్ డైరెక్టర్ జక్కిరెడ్డి రామాంజనేయరెడ్డికి ఆ మెసేజ్‌ను పంపించి పరిశీలించాలని ఆదేశించారు. అది ఫేక్ మెసేజ్‌గా గుర్తించి జరిగిన ఘటనపై రామాంజనేయరెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మణిపాల్ హాస్పిటల్ వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెసేజ్ పెట్టిన సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. కాగా, సదరు ఫేక్‌మెసేజ్ పెట్టిన వ్యక్తి ఉమ్మడి ఏపీలో పలువురు ప్రముఖుల పేర్లతో కార్పొరేట్ కంపెనీలకు ఫోన్ చేసి డబ్బులు వసూలు చేసిన ఘటనలపై ఆరు కేసులు నమోదైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మధ్యకాలంలో నెల్లూరులో ఓ మంత్రి పీఏ నంటూ ఫోన్ చేయడంతో అతడ్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: (దుష్ట చతుష్టయం ఎన్ని కుట్రలు చేసినా ఫలితం ఉండదు: అంబటి రాంబాబు) -
మణిపాల్ హాస్పిటల్ సాధించిన విజయాలు ఓ మైలురాయి: వైద్యులు
-
వైద్యపరీక్షలు చేయించుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల ఇంట్లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయన కుడికాలుకు గాయం అయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మళ్లీ వాపు రావటంతో వైద్యుల సలహా మేరకు ఆస్పత్రికి వెళ్లారు. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యనిపుణులు డాక్టర్ అనిల్‌కుమార్, మణిపాల్ ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో సీఎం జగన్‌కు సాధారణ వైద్యపరీక్షలు, స్కానింగ్ నిర్వహించారు. అనంతరం ఆయన తాడేపల్లిలోని ఇంటికి చేరుకున్నారు. -
మణిపాల్‌లో ఆరోగ్యశ్రీ కింద బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్స్
తాడేపల్లిరూరల్: మణిపాల్ హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ కింద బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్స్‌ను చేస్తున్నట్లు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కంటిపూడి సుధాకర్ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మణిపాల్‌లో ఇప్పటివరకు 50 బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్స్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు. క్లిష్టతరమైన, ఖర్చుతో కూడుకున్న ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావటం అభినందించదగ్గ విషయం అన్నారు. బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ డాక్టర్ జి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఈ తరహా క్లిష్టమైన చికిత్సల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లనవసరం లేకుండా మణిపాల్‌లో అద్భుతమైన చికిత్స లభిస్తోందని తెలిపారు. అంకాలజిస్ట్ డాక్టర్ మాధవ్ దంతాల మాట్లాడుతూ.. బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ రెండు రకాలని, వాటిలో ఒకటి ఆటోలోగస్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అని, రెండవది అల్లోజెనిక్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.శ్రావణ్‌కుమార్, డాక్టర్ సీహెచ్ మనోజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పెజావర స్వామీజీ కన్నుమూత
సాక్షి, బెంగళూరు: పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామి (88) కన్నుమూశారు.మణిపాల్ కస్తూర్భా హాస్పిటల్లో చికిత్స పొందిన స్వామీజీ అపస్మారక స్థితికి చేరడంతో డాక్టర్లు తెల్లవారుజామున మఠానికి తరలించారు. అక్కడే చివరివరకు చికిత్సను అందజేశారు. అశేష భక్తులను దుఃఖసాగరంలో ముంచుతూ శివైక్యం చెందారు స్వామి విశ్వేశతీర్థ. స్వామీజీ తుదిశ్వాస విడిచినట్టు ఉడిపి ఎమ్మెల్యే కె.రఘుపతి భట్ ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి ఉదయమే శ్రీకృష్ణమఠానికి చేరుకున్నారు. ఉడిపి అష్ట మఠాల్లో పెజావర మఠం ఒకటి. కాగా శ్వాస పీల్చుకోవడం ఇబ్బందులు తలెత్తడంతో ఈ నెల 20న విశ్వేశ తీర్ధ స్వామీజీని ఆసుపత్రికి తరలించారు. తొలుత న్యుమోనియా సమస్యలకు చికిత్స అందించినట్టు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం మరింత విషమంగా మారిందని, బ్రెయిన్ డిస్ఫంక్షన్ అని పరీక్షలో తేలిందని, ఇంకా స్పృహలోకి రాలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో స్వామీజీ అభిమతం మేరకు లైఫ్ సపోర్ట్‌తోనే ఉదయం మఠానికి తరలించారు. పెజావర మఠాథిపతి విశ్వేశ తీర్ధ స్వామీజీ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్వామీజీ మృతిపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఈ విషాదం నుంచి స్వామీజీ అశేషభక్తులు కోలుకునేలా మానసిక స్థైర్యం కలిగించాలని ఆ కృష్ణ భగవానుని కోరుకుంటున్నానని అన్నారు. విశ్వేశ తీర్థ పరమపదించడం హిందూ జాతికి తీరని లోటు ఉడిపిలో పెజావర్ మఠాధిపతి విశ్వేశ తీర్థ పరమపదించడం పట్ల విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర విచారం వ్యక్తం చేశారు. విశ్వేశ తీర్థ మరణం హిందూ జాతికి తీరని లోటన్నారు. హిందూ సమాజం గర్వించదగ్గ మత గురువుల్లో ఆయన ఒకరని గుర్తు చేసారు. శ్రీమద్వాచార్యుని ప్రధాన శిష్యులు అధోక్షజ తీర్థ నుంచి వేదాంతంపై సంపాయించిన పట్టుతో హిందూ ధర్మ పరిరక్షణకు విశ్వేశ తీర్థ పాటుపడ్డారని కొనియాడారు. బెంగుళూరులో పూర్ణప్రజ్ఞ విద్యాపీఠాన్ని ఏర్పాటు చేసి 63 సంవత్సరాలుగా వేదాంతంలో ఎంతోమంది స్కాలర్స్ ను తయారు చేసారని, శ్రీ మద్వాచార్యులు స్థాపించిన ద్వైత పాఠశాలతోనూ విశ్వేశ తీర్థకు అనుబంధముందని గుర్తు చేసుకున్నారు. -
పెజావర స్వామీజీ ఆరోగ్యం విషమం
సాక్షి, బెంగళూరు: పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామి ఆరోగ్యం క్షీణిస్తోంది. మణిపాల్ కేఎంసీ ఆస్పత్రిలో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్సనందిస్తున్నారు. కోలుకునే అవకాశాలు లేవని వైద్యులు తేల్చడంతో ఆదివారం ఆయనను మఠానికి తరలించనున్నారు. మఠంలోనే తుది శ్వాస వదలాలని స్వామీజీ చెబుతుండేవారు. మరోవైపు స్వామీజీ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా పూజలు, హోమాలు చేస్తున్నారు. ఈ తరుణంలో సీఎం యొడియూరప్ప శనివారం హుటాహుటినా ఉడుపికి బయలుదేరారు. సాయంత్రం 5.30 గంటలకు ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో స్వామిజీ ఆరోగ్యంపై చర్చించారు. సీఎం ఆదివారం శివమొగ్గ జిల్లా పర్యటనను రద్దు చేసుకుని ఉడుపిలోనే ఉండనున్నారు. మఠానికి తరలింపు ఆదివారం పేజావర స్వామీజీని ఉడుపి మఠానికి తరలించినట్లు సీనియర్ స్వామిజీ విశ్వప్రసన్న తీర్థ తెలిపారు. స్వామీజీ కోసం మఠంలోనే ప్రత్యేకంగా వెంటిలేటర్లను ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులెవ్వరూ మఠానికి వచ్చి ఇబ్బందులు పెట్టవద్దని, శీఘ్రంగా కోలుకోవాలని ప్రార్థించాలని కోరారు. మరోవైపు కేంద్ర మాజీమంత్రి ఉమాభారతి ఉడుపి చేరుకున్నారు. పెజావర స్వామిని చూసేందుకు ఆమె ఇవాళ ఉదయం మఠానికి వచ్చారు. -
చిన్నారి ప్రాణంతో చెలగాటం
సాక్షి, గుంటూరు: ఆ చిన్నారి కష్టం పగవాడికి కూడా రాకూడదు..బుడిబుడి అడుగులు వేసే మూడేళ్ల వయస్సులోనే దాదాపు 45 రోజులుగా క్షణం క్షణం నరకం చవిచూస్తోంది. శరీరం వెనుక భాగంలో తీవ్రంగా కాలిన గాయాల బాధతో కొట్టుమిట్టాడుతున్న చిన్నారికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్యం చేసే వీలున్నప్పటికీ.. ఇప్పటికే బకాయిలు అధికంగా ఉండడంతో ప్రైవేటు వైద్యులు ఎవరూ ముందుకు రాని దుర్భర పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా వినుకొండ పాత క్రిస్టియన్‌పాలెంలో నివాసం ఉంటున్న యెలికపాటి ఆదయ్య, కీర్తి దంపతుల చిన్న కుమార్తె అమూల్య తోటి పిల్లలతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గౌనుకు నిప్పంటుకుని వీపు నుంచి కింది భాగమంతా పూర్తిగా కాలిపోయింది. నవంబరు 14వ తేదీన ఘటన జరగడంతో తల్లిదండ్రులు వినుకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొద్దిరోజులు చికిత్స చేయించారు. అక్కడ రూ.50 వేలు ఖర్చు కావడంతో నిరుపేద కుటుంబం కావడంతో అప్పు తేలేక, ఆస్పత్రి నుంచి అమూల్యను ఇంటికి తీసుకెళ్లి మందులు వాడుతున్నారు. అయితే వైద్యుల పర్యవేక్షణ లేకపోవడంతో గాయం మానకుండా పెద్దది అవుతూ వచ్చింది. దీంతో గురువారం తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రి, మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రులకు అమూల్యను తీసుకెళ్లారు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉందని, దాని ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించాలని కోరారు. అయితే ఎన్టీఆర్ వైద్య సేవలో ఉచితంగా చేసే వీలు ఉన్నప్పటికీ అనుమతులు వచ్చే వరకు అయ్యే ఖర్చు భరించాలని, అనుమతులు రాకపోతే పూర్తిగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుందని వైద్యులు తేల్చి చెప్పారు. ఆర్థిక స్థోమత లేని ఆదయ్య దంపతులు అమూల్యను తీసుకుని సాయంత్రం 5.30 గంటల సమయంలో జీజీహెచ్‌కు వెళ్లారు. జీజీహెచ్‌లో బర్న్స్ వార్డు లేదని, చిన్న పిల్లల వార్డులో ఉంచితే ఇన్ఫెక్షన్ వచ్చి ఇంకా ఎక్కువ ఇబ్బంది జరుగుతుందంటూ అక్కడి వైద్యులు చెప్పడంతో చేసేది లేక ఇంటికి బయల్దేరారు. వారి సమీప బంధువు సోషల్ మీడియాలో ఈ వ్యవహారం అంతా పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. దీన్ని గమనించిన జీజీహెచ్ అధికారులు ఆదయ్యకు ఫోన్ చేసి వెనక్కు రావాలని కోరారు. దీంతో గురువారం రాత్రి జీజీహెచ్‌కు తీసుకొచ్చి అమూల్యను అడ్మిట్ చేశారు. ప్రస్తుతం అమూల్య జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. అయితే జీజీహెచ్‌లో దీనికి సంబంధించి ఎటువంటి మందులూ లేకపోవడం గమనార్హం. బర్న్స్ వార్డు నిర్మాణానికి రూ. 8 కోట్లు కేంద్రం మంజూరు చేసినట్లు జారీ చేసిన జీవో బర్న్స్ వార్డుకు కేంద్రం నిధులిచ్చినా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. గుంటూరు జీజీహెచ్‌కు కోస్తాంధ్రలోని ఆరు జిల్లాల నుంచి రోగులు వస్తుంటారు. ఆరు జిల్లాల్లో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా వైద్యులు ఇక్కడకు రిఫర్ చేస్తుంటారు. అయితే ఇంత పెద్ద ఆస్పత్రిలో బర్న్స్ వార్డు లేకపోవడంతో కాలిన గాయాలతో వచ్చిన అనేకమంది రోగులు ప్రాణాలు కోల్పోతున్న దుర్భర స్థితి నెలకొంది. రాజధాని ప్రాంతంలో ఉన్న పెద్ద ఆస్పత్రిలో సైతం బర్న్స్ వార్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయని పరిస్థితి. కాలిన గాయాల నివారణ, నియంత్రణ జాతీయ కార్యక్రమం (ఎంపీపీఎంబీఐ)లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు బోధనా ఆస్పత్రుల్లో బర్న్స్ వార్డుల నిర్మాణానికి ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వం రూ.40 కోట్లు మంజూరు చేసింది. గుంటూరు జీజీహెచ్‌కు సైతం రూ.8 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసినప్పటికీ కనీసం టెండర్లు కూడా పిలిచిన దాఖలాలు లేవు. బర్న్స్ వార్డు నిర్మాణానికి నిధులు ఉన్నా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత చూపకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డబ్బు చెల్లించమని చెప్పిన మాట వాస్తవమే.. కాలిన గాయాలతో అమూల్య అనే చిన్నారిని తీసుకుని మా వద్దకు వచ్చారు. అయితే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుకు అనుమతి కోసం పంపుతామని, అనుమతి వచ్చే వరకు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాం. అనుమతి వస్తే ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని తెలిపాం. అయితే వారు ఆస్పత్రిలో చేర్చకుండా వెళ్లిపోయారు. ఎన్టీఆర్ వైద్యసేవలో ఎక్కువగా కాలిన గాయాలు ఉంటే మాత్రమే అనుమతి వస్తుంది. అందుకే ముందుగా ఎన్టీఆర్ వైద్య సేవలో చేర్చుకోలేకపోయాం. – రామాంజనేయులు,ఎన్నారై ఆస్పత్రిలో ఎన్టీఆర్ వైద్య మిత్ర -
మణిపాల్ చేతికి ‘ఫోర్టిస్’ హాస్పిటల్ వ్యాపారం
న్యూఢిల్లీ: ఫోర్టిస్ హెల్త్‌కేర్ కంపెనీ హాస్పిటల్ వ్యాపారాన్ని మణిపాల్ హాస్పిటల్ ఎంటర్ప్రైజెస్ కొనుగోలు చేయనుంది. ఫలితంగా ఏర్పడే సంస్థ విలువ రూ.15,000 కోట్లుగా ఉంటుందని ఫోర్టిస్ హెల్త్‌కేర్ సీఈఓ భవదీప్ సింగ్ తెలిపారు. ఈ విలీన ప్రక్రియ 10–12 నెలల్లో పూర్తవుతుందని పేర్కొన్నారు.కంపెనీ ప్రమోటర్లు సింగ్ సోదరుల ద్వయం నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అంశంపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్ఎఫ్ఐఓ) దర్యాప్తునకు సహకరిస్తున్నామని తెలిపారు. ఈ దర్యాప్తునకు, ఈ డీల్‌కు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. ఫోర్టిస్ హెల్త్‌కేర్ కంపెనీకి చెందిన హాస్పిటల్ వ్యాపారాన్ని డీమెర్జ్ చేయడానికి ఫోర్టిస్ హెల్త్‌కేర్ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ హాస్పిటల్ వ్యాపారంతో పాటు డయాగ్నస్టిక్స్ చెయిన్ ఎస్ఆర్ఎల్లో 20 శాతం వాటాను కూడా మణిపాల్ హాస్పిటల్స్, టీపీజీ క్యాపిటల్‌లు కొనుగోలు చేస్తాయి. ఈ విక్రయ వార్తలతో ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్ భారీగా నష్టపోయింది. ఇంట్రాడేలో 15 శాతం పతనమైన ఈ షేర్ చివరకు 13 శాతం నష్టంతో రూ.123 వద్ద ముగిసింది. -
మంత్రి కొల్లు రవీంద్రకు తృటిలో తప్పిన ప్రమాదం
♦ గుంటూరు నుంచి విజయవాడకు వెళుతుండగా బోల్తా పడిన కారు ♦ రోడ్డుప్రమాదంలో మంత్రి కొల్లు రవీంద్ర కు స్వల్పగాయాలు ♦ తాడేపల్లిలో మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స ♦ ప్రమాదంలో రవీంద్ర సహా నలుగురికి గాయాలు గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు తృటిలో ప్రమాదం తప్పింది. ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గురువారం అర్థరాత్రి గుంటూరు నుంచి విజయవాడకు వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు మంగళగిరి మండలం టోల్‌ప్లాజా వద్ద పల్టీలు కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో మంత్రి కొల్లు రవీంద్రకు స్వల్పగాయాలు అయినట్టు తెలిసింది. ఆయనతో పాటు మరో నలుగురికి కూడా గాయాలు కావడంతో వారికి తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నలుగురి జీవితాల్లో అశోక దీపం
అతడు జీవితాన్ని ఎంత ఆరాధించాడో తెలియదు కానీ, చనిపోతూ ఆరిపోతున్న దీపాలకు ఆరో ప్రాణమయ్యాడు. అతడు అతడ్ని ఎంతగా ప్రేమించాడో తెలియదు గానీ, నలుగురికి పునర్జన్మ ప్రసాదించి ప్రాణానికి అసలైన అర్థం చెప్పాడు. కళ్ల ముందు తిరుగుతున్న బిడ్డ కుప్పకూలిపోతే.. మరణానికి చేరువైతే.. కూలబడి కూర్చోకుండా కన్నీటిని దిగమింగుతూనే కొడుకు అవయవాలను దానంచేసి ఆదర్శమూర్తులుగా నిలిచారు ఆ తల్లిదండ్రులు. కన్నీటికే కన్నీరు తెప్పించే ఈ విషాద గాథ గుంటూరు నెహ్రూనగర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు నెహ్రూనగర్ తొమ్మిదో లైనుకు చెందిన సూరగాని శివలక్ష్మయ్య, గోవర్ధన లక్ష్మికి ఇద్దరు సంతానం. పెద్దకుమారుడు మహేష్‌కుమార్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా, చిన్న కుమారుడు అశోక్‌కుమార్ (25) అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఆర్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నారు. కుమారులిద్దరూ మంచి భవిష్యత్తు పొందడం ఆ తల్లిదండ్రులకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది. కానీ, ఇంతలోనే విధి వక్రించింది. గత మంగళవారం తమ చిన్న కుమారుడు నిద్రలోనే పెద్దగా గురకపెడుతూ అపస్మారక స్థితిలోకి చేరు కున్నాడు. భయాందోళనతో ఆస్పత్రికి తీసుకువెళ్లిన ఆ తల్లిదండ్రులు చేదువార్త విన్నారు. అశోక్ కోమాలోకి వెళ్లిపోయాడని డాక్టర్లు స్పష్టం చేశారు. అయితే, మెరుగైన వైద్యం కోసం తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రిలో చేర్పించారు. నాలుగు రోజుల అనంతరం శస్త్ర చికిత్సల వల్ల స్పందన లేదని, అశోక్ బ్రెయిన్‌డెడ్ అయ్యాడని అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఉబికి వస్తున్న కన్నీటిని దిగమింగుకుని అవయవదానానికి ముందుకొచ్చారు ఆ తల్లిదండ్రులు. ఈ క్రమంలో జీవన్ దాన్ను ఆశ్రయించారు. జీవన్ దాన్లో అప్పటికే అవయవాల కోసం నమోదు చేసుకున్న వారి జాబితాను అనుసరించి అశోక్ అవయవాలను దానం చేశారు. ఆదివారం వేకువజామున ఈ అవయవ దాన ప్రక్రియను మణిపాల్ వైద్యులు పూర్తిచేశారు. లివర్, ఒక కిడ్నీ మణిపాల్ ఆస్పత్రిలోని ఇద్దరు రోగులకు అమర్చగా, కళ్లు శంకర్ కంటి ఆస్పత్రికి, మరొక కిడ్నీ ఆయుష్ ఆస్పత్రికి అందజేశారు. తాను చనిపోతూ నలుగురిలో తిరిగి జీవించాడు అశోక్. ఈ సందర్భంగా అశోక్ తల్లిదండ్రులు మాట్లాడుతూ అవయవ దానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పడం విశేషం. - తాడేపల్లి రూరల్ -
ఆగమేఘాలపై చేరిన కిడ్నీ
ఓ వ్యక్తికి ప్రాణదానం విశాఖ మెడికల్ : కేవలం ఐదు గంటల వ్యవధిలో గుంటూరు నుంచి విశాఖకు కిడ్నీ తరలించి నగరవాసి ప్రాణాన్ని నిలిపారు పోలీసులు. మణిపాల్ ఆసుపత్రిలో ఈనెల 31న జరిగిన ఈ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలో పోలీసులు పోషించిన పాత్ర అమోఘమని ఆసుపత్రి యాజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. గుంటూరుకు చెందిన 54 సంవత్సరాల వ్యక్తి గత నెల 31న మరణించాడు. అవయవధానం చేసిన అతని నుంచి అదే రోజు కిడ్నీని సేకరించి అంబులెన్స్ ద్వారా గుంటూరు-విజయవాడ మీదుగా విశాఖ నగరానికి కేవలం ఐదు గంటల వ్యవధిలో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేసి రప్పించారు. ఆ కిడ్నీని విశాఖకు చెందిన 51 సంవత్సరాల వ్యక్తికి మణిపాల్ ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా అమర్చి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఇందుకు సహకరించిన పోలీసు విభాగానికి కిడ్నీ గ్రహీత కుటుంబ సభ్యులు, మణిపాల్ ఆసుపత్రి యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. -
అనంతమూర్తి కన్నుమూత
మూఢాచారాలపై పోరాడిన కన్నడ సాహిత్య దిగ్గజం బెంగళూరు: కాలంచెల్లిన కట్టుబాట్లపై కత్తిలాంటి కలంతో పోరాడిన కన్నడ సాహితీ దిగ్గజం, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ యూఆర్. అనంతమూర్తి(82) ఇకలేరు. ఆయన శుక్రవారం సాయంత్రం ఇక్కడి మణిపాల్ ఆస్పత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్నేళ్లుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన వారం కిందట ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందా రు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మూర్తి మృతిపై ప్రధాని మోడీ, యూపీఏ చైర్మన్ సోనియా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం మూడు రోజులను సంతాప దినాలుగా ప్రకటించింది. 1932లో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఉడిపి రాజగోపాలాచార్య అనంతమూర్తి బర్మింగ్‌హామ్ వర్సిటీ నుంచి ఇంగ్లీష్‌లో డాక్టరేట్ పుచ్చుకున్నారు. ఐదు నవలలు, ఒక నాటకంతో పాటు కథలు, కవిత్వం రాశారు. ఆయన రచనలు పలు యూరప్ భాషల్లోకి అనువాదమయ్యాయి. బ్రాహ్మణత్వ మూఢాచారాలను ఖండించిన ఆయన ప్రసిద్ధ వివాదాస్పద రచన ‘సంస్కార’ (1965) ఆధారంగా అదే పేరుతో వచ్చిన సినిమా కన్నడ సమాంతర చిత్రాల్లో మేటిగా వాసికెక్కింది. మూర్తి జ్ఞాన్‌పీఠ్(1994), పద్మభూషణ్(1998) వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. కేరళలోని మహాత్మాగాంధీ వర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా, నేషనల్ బుక్‌ట్రస్ట్, కేంద్ర సాహిత్య అకాడమీల అధ్యక్షులుగా పనిచేశారు. లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. సోషలిస్టు అయిన మూర్తి బీజేపీ, సంఘ్పరివార్లను తీవ్రంగా వ్యతిరేకించి వివాదాలు తెచ్చుకున్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అయితే దేశం నుంచి వెళ్లిపోతానని ఇటీవల లోక్‌సభ ఎన్నికలప్పుడు ప్రకటించారు. అయితే భావోద్వేగంతో అలా అన్నానని తర్వాత వివరణ ఇచ్చారు. గత ఏడాది మాన్ బుకర్ అంతర్జాతీయ బహుమతి పోటీలో నిలిచి పాశ్చాత్య పాఠకుల దృష్టిని ఆకర్షించారు.