అనంతమూర్తి కన్నుమూత | Kannada literary giant anantha mutrthy died | Sakshi
Sakshi News home page

అనంతమూర్తి కన్నుమూత

Published Sat, Aug 23 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM

అనంతమూర్తి కన్నుమూత

అనంతమూర్తి కన్నుమూత

మూఢాచారాలపై పోరాడిన కన్నడ సాహిత్య దిగ్గజం
 
బెంగళూరు: కాలంచెల్లిన కట్టుబాట్లపై కత్తిలాంటి కలంతో పోరాడిన కన్నడ సాహితీ దిగ్గజం, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ యూఆర్. అనంతమూర్తి(82) ఇకలేరు. ఆయన శుక్రవారం సాయంత్రం ఇక్కడి మణిపాల్ ఆస్పత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్నేళ్లుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన వారం కిందట ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందా రు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మూర్తి మృతిపై ప్రధాని మోడీ, యూపీఏ చైర్మన్ సోనియా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం మూడు రోజులను సంతాప దినాలుగా ప్రకటించింది. 1932లో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఉడిపి రాజగోపాలాచార్య అనంతమూర్తి బర్మింగ్‌హామ్ వర్సిటీ నుంచి ఇంగ్లీష్‌లో డాక్టరేట్ పుచ్చుకున్నారు. ఐదు నవలలు, ఒక నాటకంతో పాటు కథలు, కవిత్వం రాశారు. ఆయన రచనలు పలు యూరప్ భాషల్లోకి అనువాదమయ్యాయి.

బ్రాహ్మణత్వ మూఢాచారాలను ఖండించిన ఆయన ప్రసిద్ధ వివాదాస్పద రచన ‘సంస్కార’ (1965) ఆధారంగా అదే పేరుతో వచ్చిన సినిమా కన్నడ సమాంతర చిత్రాల్లో మేటిగా వాసికెక్కింది. మూర్తి జ్ఞాన్‌పీఠ్(1994), పద్మభూషణ్(1998) వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. కేరళలోని మహాత్మాగాంధీ వర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా, నేషనల్ బుక్‌ట్రస్ట్, కేంద్ర సాహిత్య అకాడమీల అధ్యక్షులుగా పనిచేశారు. లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. సోషలిస్టు అయిన మూర్తి బీజేపీ, సంఘ్‌పరివార్‌లను తీవ్రంగా వ్యతిరేకించి వివాదాలు తెచ్చుకున్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అయితే దేశం నుంచి వెళ్లిపోతానని ఇటీవల లోక్‌సభ ఎన్నికలప్పుడు ప్రకటించారు. అయితే భావోద్వేగంతో అలా అన్నానని తర్వాత వివరణ ఇచ్చారు. గత ఏడాది మాన్ బుకర్ అంతర్జాతీయ బహుమతి పోటీలో నిలిచి పాశ్చాత్య పాఠకుల దృష్టిని ఆకర్షించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement