సాక్షి, అమరావతి: దేశంలో అవయవదానం, అవయవమార్పిడికి నూతన విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సమాఖ్యతో కలిసి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వస్త్య చింతన్ శిబిర్ కార్యక్రమంలో శనివారం రెండో రోజు మంత్రి పలు అంశాలపై మాట్లాడారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయకు పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు.
అసంక్రమిత వ్యాధుల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడటంలో ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం గొప్ప విరుగుడుగా పని చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో 2021 అక్టోబర్‌లో అసంక్రమిత వ్యాధులపై స్క్రీనింగ్ ప్రారంభించామని చెప్పారు. భవిష్యత్తులో క్యాన్సర్, గుండె వ్యాధులకు ముందస్తు నిర్ధారణ పరీక్షలను గ్రామాల్లోనే చేపడతామన్నారు.
ఇప్పటికే 600కుపైగా క్యాన్సర్ చికిత్సలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చి ఏటా రూ.600 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ఉచితంగా వైద్యం అందిస్తున్నామని వివరించారు. రూ.350 కోట్లతో బోధన ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు, వసతులు, స్టేట్ క్యాన్సర్ సెంటర్లను అందుబాటులోకి తెస్తున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్‌హెచ్‌ఎం నిధులను మరింత అదనంగా కేటాయించి సహకరించాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఎన్‌హెచ్‌ఎం మిషన్ డైరెక్టర్, ఏపీ కుటుంబ సంక్షేమ కమిషనర్ జె.నివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment