ఒకరిగా బతికి.. ముగ్గురిలో జీవించి..
ముగిసిన అవయవదాన శస్త్ర చికిత్సలు
ఇద్దరికి కిడ్నీలు, మరొకరికి కాలేయం
విశాఖ మెడికల్ : విశాఖనగరంలో మంగళవారం ఉదయం సెవెన్‌హిల్స్, కేర్ ఆస్పత్రుల్లో రెండు అవయవమార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. శ్రీకాకుళం పట్టణానికి చెందిన బ్రెయిన్‌డెడ్ రోగి పట్నాన సత్యనారాయణ అవయవదానంతో ముగ్గురిలో సజీవంగా నిలిచారు. ఈనెల 26న రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమవడంతో అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని అదే రోజు నగరంలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చేర్చగా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడక పోవడంతో వైద్యులు బ్రైయిన్‌డెడ్ రోగిగా ప్రకటించిన విషయం విధితమే. అతని అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకు రావడంతో మంగళవారం ఉదయం జీవన్‌ధాన్ సంస్థ అనుమతి మేరకు రెండు కిడ్నీలు, కాలేయాన్ని సేకరించారు.
ఒక కిడ్నీని అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగికి డాక్టర్ రవిశంకర్, అమిత్ సాప్లేలు అవయవ మార్పిడి శస్త్రచికిత్స ద్వారా అమర్చారు. మరోకిడ్నీని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో రోగికి డాక్టర్ క ళ్యాణచక్రవర్తి, మురళీమోహన్ శస్త్రచికిత్స చేసి అమర్చారు. కాలేయాన్ని మాత్రం హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగికి అమర్చేందుకు మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో తరలించారు. రాత్రి వరకు ఈ కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స కొనసాగుతున్నట్లు జీవన్‌ధాన్ విశాఖ కో-ఆర్డినేటర్ ఇందిర తెలిపారు. అతని శరీరంలోని కళ్లు, ఇతర శరీర అవయవాలు దెబ్బతినడంతో సేకరించేందుకు అవకాశం లేకుండా పోయిందని వెల్లడించారు.