వాషింగ్టన్ : గర్భవతిని అయ్యాననే సంతోషం క్రిస్టా డేవిస్‌కు ఎంతో కాలం నిలవలేదు. 18 వారాలు నిండిన తర్వాత చెకప్ కోసం వెళ్లిన ఆమె.. పుట్టిన కొన్ని నిమిషాల్లోనే బిడ్డ మరణిస్తుందనే చేదు వార్త వినాల్సి వచ్చింది. కుదిరితే వెంటనే అబార్షన్ చేయించుకోవాలి లేదా బిడ్డ పుట్టిన తర్వాత అవయవాలు దానం చేసి మరికొంత మందికి పునర్జన్మ ఇవ్వొచ్చని సలహా ఇచ్చారు డాక్టర్లు. క్రిస్టా, ఆమె సహచరుడు డేరెక్ లోవెట్‌కు డాక్టర్లు ఇచ్చిన రెండో ఆప్షన్ నచ్చింది. బిడ్డకు జన్మనిచ్చి ఆమెను చిరంజీవిని చేయాలని నిర్ణయించుకున్నారు. అలా క్రిస్‌మస్ ముందు రోజు తమ గారాల పట్టి ‘రైలీ ఆర్కాడియా లోవెట్’ను భూమ్మీదకు తీసుకువచ్చారు.
వారం రోజుల పాటు బతికింది..
ఎనెన్సీఫలీ(మెదడు భాగం రూపుదిద్దుకోకపోవడం)అనే అరుదైన వ్యాధితో జన్మించిన రైలీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ వారం రోజుల పాటు బతికింది. రైలీని చూసిన వైద్యులు నిజంగా తనో అద్భుతం అని, ఆమెకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కాస్త సంతోషాన్నైనా పంచిందని పేర్కొన్నారు. అనంతరం క్రిస్టా, డెరిక్‌ల అనుమతితో రైలీ హార్ట్ వాల్వ్స్‌ను ఇద్దరు పిల్లలకు అమర్చారు. అంతేకాకుండా ఆమె ఊపిరితిత్తులను కూడా సేకరించి మరొకరికి అమర్చేందుకు సిద్ధంగా ఉన్నారు.
కాగా ఈ విషయం గురించి రైలీ తల్లి క్రిస్టా పీపుల్ మ్యాగజీన్‌తో మాట్లాడుతూ.. ‘ రైలీ పరిస్థితి తెలియగానే షాక్‌కు గురయ్యాం. మా కూతురిని ఇంటికి తీసుకురాలేమని తెలిసినప్పటికీ తనకి జన్మనివ్వాలని నిర్ణయించుకున్నాం. 40 వారాల తర్వాత వైద్యుల పర్యవేక్షణలో తనకి జన్మనిచ్చా. రైలీ మరణించేంత వరకు నేను, డెరిక్ ఆస్పత్రిలోనే ఉన్నాం. ఆ వారం రోజులు తను అస్సలు ఏడవలేదు. కానీ చనిపోయే ముందు మాత్రం చిన్నగా మూలిగింది. బహుషా ఆ సమయంలో తనకి శ్వాస అందలేదేమో. ఏదేమైనా నాలాంటి పరిస్థితి ఏ తల్లికీ రాకూడదు. రైలీ అవయవాలు దానం చేయడం ద్వారా తాను పునర్జన్మ పొందినట్లుగా భావిస్తున్నా’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గత నెల మొదటి వారంలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం నెటిజన్ల మనస్సును ద్రవింపజేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment