ఒకేసారి 103 మంది విద్యార్థులు అవయవదానికి ముందుకొచ్చి తమ గొప్ప మనసును చాటుకున్నారు.
విజయనగరం(చీపురుపల్లి): ఒకేసారి 103 మంది విద్యార్థులు అవయవదానికి ముందుకొచ్చి తమ గొప్ప మనసును చాటుకున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలోని శ్రీహర డిగ్రీ కళాశాలలో మానవీయత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం అవయవదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్పందించిన విద్యార్థులు మరణాంతరం తమ అవయవాలను దానం చేయడానికి అంగీకరిస్తూ అక్కడికక్కడే పత్రాలపై సంతకాలు చేసి మానవీయత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు బి.వి.గోవిందరాజులుకు అందజేశారు.
అంతకుముందు కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో గోవిందరాజులు మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అవయవదానం చేయడం సామాజిక బాధ్యతగా ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు. దేశంలో కేవలం 0.16 శాతం మాత్రమే అవయవదానం జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ డివిజిన్ కార్యదర్శి ఐ.శ్రీను, శ్రీహర డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ ఎమ్.రాము, ప్రిన్సిపాల్ ఎమ్.శంకర్, అకడమిక్ కోఆర్డినేటర్ గోవింద్ తదితరులు పాల్గొన్నారు.