
గాంధీనగర్: దానం చేయడం అంటేనే మనకు ఉన్నదాంట్లో నుంచి ఇతరులకు పంచడం. ఇక అన్ని దానాల్లోకెల్లా అన్నదానం, విద్యా దానం గొప్పదని చెప్తారు. ఒకటి ఆకలి తీర్చితే.. మరొకటి మనతో పాటు మరి కొందరి ఆకలి తీర్చే మార్గం చూపిస్తుంది. అయితే వీటన్నిటికంటే గొప్పదానం మరొకటి ఉంది. కానీ దాని గురించి జనాలకు పెద్దగా అవగాహన లేదు. అదే అవయవ దానం. అవును మనం చనిపోతూ మరి కొందరిని బతికించడం. ఒక జీవిని మనం మరణం నుంచి తప్పిస్తున్నామంటే.. దైవంతో సమానం. కానీ ఎందుకో మన దగ్గర అవయవ దానం గురించి ఎక్కువగా అవగాహన లేదు.. ప్రభుత్వాలు కూడా ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవు. ఒక మనిషిని మరణం నుంచి తప్పించే అవయవ దానం అన్ని దానాల్లోకెల్ల గొప్పది. గుజరాత్‌కు చెందిన ఓ జంటకు ఈ విషయం బాగా తెలుసు. అందుకే తమను విడిచిపోయిన కుమారుడి అవయవాలు దానం చేసి.. మరి కొందరి ప్రాణాలు నిలిపి.. వారిలో తమ బిడ్డను చూసుకుని కడుపుకోతను మర్చిపోతున్నారు. (చదవండి: 36 కిమీ..28 నిమిషాలు! )
వివరాలు.. గుజరాత్‌కు చెందిన జర్నలిస్ట్ సంజీవ్ ఓజా దంపతులకు యష్ ఓజా అనే రెండున్నరేళ్ల ముద్దులొలికే కుమారుడు ఉన్నాడు. ఆడుతూ పాడుతూ.. సంతోషంగా ఎదుగుతున్న యష్ దురదృష్టవశాత్తు ఓ రోజు రెండో అంతస్తులో ఉన్న తన ఇంటి నుంచి కింద పడ్డాడు. దాంతో మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయింది. చిన్నారి బ్రెయిన్ డెడ్ అయ్యాడని వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలో యష్ గురించి తెలుసుకున్న డోనేట్ లైఫ్ అనే ఎన్‌జీఓ చిన్నారి తల్లిదండ్రులను కలుసుకుని.. వారి బిడ్డ అవయవాలు దానం చేసేలా వారిని ఒప్పించారు. భౌతికంగా తమకు దూరమైన బిడ్డ.. మరి కొందరికి ప్రాణం పోసి.. వారిలో జీవించి ఉంటాడని భావించిన తల్లిదండ్రులు తమ చిన్నారి అవయవాలు దానం చేయడానికి అంగీకరించారు. (చదవండి: రహస్యంగా రూ.58 వేల కోట్ల్ల దానం!)
ఈ క్రమంలో యష్ గుండెని రష్యాకు చెందిన నాలుగేళ్ల చిన్నారికి.. ఊపిరితిత్తులను ఉక్రెయిన్‌కు చెందిన మరో చిన్నారికి.. అహ్మదాబాద్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలకు కిడ్నీలను.. భావ్‌నాగర్‌కు చెందిన మరో రెండేళ్ల చిన్నారికి యష్ లివర్‌ని అమర్చరారు. మరి కొద్ది రోజుల్లో మరణాన్ని చూడాల్సిన ఈ ఐదుగురు యష్ వల్ల తమ ఆయువును పెంచుకున్నారు. ఇక బిడ్డను కోల్పోయిన యష్ తల్లిదండ్రులు వీరిలో తమ చిన్నారిని చూసుకుంటూ ఆ బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment