శ్రీకాకుళం రూరల్/గోపాలపట్నం(విశాఖ పశ్చిమ)/తిరుపతి తుడా : పుట్టెడు దుఖంలోనూ తమ కుమార్తె అవయవాలు దానం చేసి పలువురికి పునర్జన్మను ప్రసాదించిందో కుటుంబం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొత్తపేటకు చెందిన మౌనిక(23) వీఆర్వోగా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను శ్రీకాకుళంలోని రిమ్స్‌కు, అనంతరం మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖలోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. మౌనిక మెదడు పూర్తిగా డెడ్ అయినట్టు అక్కడి వైద్యులు నిర్ధారించారు.
తమ కుమార్తె అవయవాలు వేరేవారికి పునర్జన్మను ప్రసాదిస్తాయని తెలుసుకున్న తల్లిదండ్రులు.. దుఃఖాన్ని దిగమింగుకుని అవయవాల దానానికి ముందుకొచ్చారు. దీంతో శ్రీకాకుళం జిల్లా రాగోలులోని జెమ్స్ ఆస్పత్రిలో మౌనిక శరీరం నుంచి అవయవాలు వేరుచేశారు. గుండెను తిరుపతి పద్మాలయ హృదయాలయ ఆస్పత్రికి గ్రీన్ చానల్ ద్వారా ప్రత్యేక విమానంలో తరలించారు.
ఒక మూత్ర పిండాన్ని వైజాగ్‌లోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి, మరో మూత్ర పిండాన్ని శ్రీకాకుళం జెమ్స్ ఆస్పత్రికి పంపగా.. రెండు కళ్లను రెడ్‌క్రాస్ సంస్థకు అప్పగించారు. ఈ సందర్భంగా మృతురాలి తల్లిదండ్రులు గోవిందరావు, ఉమాదేవి మాట్లాడుతూ తమ కూతురు చనిపోలేదని.. అవయవాలను దానం చేసి.. వారిలో బతికే ఉందని చెప్పారు.
గుండె మార్పిడితో పునర్జన్మ
తిరుపతిలోని శ్రీ పద్మావతి గుండె చికిత్సాలయం మరో యువతికి గుండె మార్పిడి చేసి పునర్జన్మను ప్రసాదించింది. నెల్లూరు పట్టణానికి చెందిన 21 ఏళ్ల యువతి డైలేటెడ్ కార్డియో మయోపతి సమస్యతో బాధపడుతోంది. ఈ నెల ఒకటో తేదీన ఆస్పత్రికి రావడంతో ఆ యువతికి వైద్య పరీక్షలు చేసి.. గుండె సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయిందని, మార్పిడి అనివార్యమని వైద్యులు నిర్ధారించారు.
ఈ క్రమంలో మౌనిక కుటుంబ సభ్యులు అవయవదానం చేయడంతో విషయాన్ని సీఎం కార్యాలయం చొరవ తీసుకుని సమాచారాన్ని సీఎం వైఎస్ జగన్‌కు వివరించింది. విశాఖ నుంచి గుండెను తీసుకొచ్చేందుకు చాపర్ విమానాన్ని అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులను విడుదల చేయాలని సూచించారు.
ఈ మేరకు ప్రత్యేక విమానంలో తెచ్చిన గుండెను యువతికి అమర్చారు సుమారు రూ.12 లక్షలకు పైగా ఖర్చయ్యే గుండె మార్పిడి చికిత్సను ఉచితంగా చేసి యువతికి పునర్జన్మను ప్రసాదించారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి నేతృత్వంలోని వైద్యుల బృందం సుమారు 5.30 గంటల పాటు శ్రమించి విజయవంతంగా గుండెమార్పిడిని పూర్తిచేసింది.
Comments
Please login to add a commentAdd a comment