పిచ్చాటూరు: తాను మరణించినా.. తన అవయవాలతో ఏడుగురికి పునర్జన్మనిచ్చింది కీర్తి అనే యువతి. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం రామాపురం ఎస్సీ ప్రాంతానికి చెందిన సి.సంపత్‌కుమార్, అమ్ములు దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. సంపత్‌కుమార్ ఎడ్లబండి నడుపుతూ వ్యవసాయ కూలీగా పని చేస్తున్నారు. మొదటి కుమార్తె కీర్తి గత ఏడాది బీకామ్ పూర్తి చేసి చెన్నై అరుబాక్కంలోని కాల్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తుండేది. రెండో కుమార్తె స్వాతి డిగ్రీ, మూడవ కుమార్తె స్మృతి ఫార్మసీ, కుమారుడు సారథి ఇంటర్ చదువుతున్నారు.
కీర్తి ఆదివారం చెన్నై నుంచి స్వగ్రామం రామాపురం వచ్చింది. ఆ సమయంలో పెళ్లి చేసుకోవాలని కీర్తిని తల్లిదండ్రులు కోరారు. చెల్లెళ్లు, తమ్ముడి చదువులు కొలిక్కి వచ్చాక పెళ్లి చేసుకుంటానని అమ్మ, నాన్నలకు నచ్చజెప్పింది. సాయంత్రం తమిళనాడులోని కరడిపుత్తూరులో ఓ పెళ్లికి గ్రామంలోని తమ బంధువుతో కలసి ద్విచక్ర వాహనంపై వెళ్లింది. తిరుగు ప్రయాణంలో కరడిపుత్తూరు సమీపంలో రోడ్డుపై ఉన్న ఓ పెద్ద గుంతలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి దిగబడిపోవడంతో వెనుకవైపు కూర్చుని ఉన్న కీర్తి కిందపడిపోయింది. ఆమె తలకు, చేతికి తీవ్ర గాయమై స్పృహ కోల్పోయింది. వాహనం నడుపుతున్న రాబర్ట్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
స్థానికులు 108 సాయంతో ఇద్దరినీ సమీపంలో ఉన్న తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైలోని రాజీవ్‌గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కీర్తిని పరీక్షించిన వైద్యులు ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్టు నిర్థారించారు. గుండె సహా మిగిలిన అన్ని అవయవాలు పనిచేస్తున్న విషయాన్ని గుర్తించారు. కీర్తి అవయవాలను దానం చేయడం ద్వారా మరికొంత మందిని బతికించే అవకాశం ఉందని వైద్యులు వివరించడంతో కీర్తి అవయవాలు దానం చేయడానికి తల్లిదండ్రులు అంగీకరించారు.
కీర్తికి గౌరవ వందనం
చెన్నై జీహెచ్ వైద్యులు కీర్తి శరీరం నుంచి గుండె, రెండు మూత్రపిండాలు, రెండు కళ్లు, గుండె వాల్వు, కాలేయం, మూత్రనాళాలు, ఊపిరితిత్తులను మంగళవారం రాత్రి సేకరించారు. స్టాండ్లీ ప్రభుత్వ ఆస్పత్రికి రెండు అవయవాలను తరలించి.. మిగిలిన వాటిని అదే ఆస్ప త్రిలోని రోగులకు అమర్చినట్టు వైద్యులు వెల్లడించా రు. రాగా, మంగళవారం అర్ధరాత్రి కీర్తి పార్థివదేహం వద్ద ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో వందలాది మంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment