పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్‌ జగన్‌ | CM YS Jagan In Korukonda Ichhapuram Gajuwaka Election Campaign | Sakshi
Sakshi News home page

పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్‌ జగన్‌

Published Wed, May 8 2024 3:26 AM | Last Updated on Wed, May 8 2024 3:26 AM

మధ్యాహ్నం 3 గంటలకు..  శ్రీకాకుళం జిల్లా  ఇచ్ఛాపురంలో జరిగిన సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభకు హాజరైన అశేష జనసందోహంలో  ఓ భాగం

మధ్యాహ్నం 3 గంటలకు.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరిగిన సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం

కోరుకొండ, ఇచ్ఛాపురం, గాజువాక ఎన్నికల సభల్లో సీఎం వైఎస్‌ జగన్‌  

జూన్‌ 4న మళ్లీ మీ బిడ్డే వస్తాడు.. విశాఖ నుంచే పాలన.. ప్రమాణ స్వీకారం

మన ప్రభుత్వం మళ్లీ రాగానే వారంలో అన్ని బటన్లూ క్లియర్‌ చేస్తా

ఎన్నికలు వచ్చాయని నొక్కిన బటన్లు కావివి.. అన్నీ కొనసాగుతున్న పథకాలే 

ఐదేళ్లుగా ఏటా బటన్లు నొక్కుతూ పేదలకు మంచి చేస్తున్నాం 

జగన్‌ అంటే పథకాలు... బాబు అంటే మోసాలు, కుట్రలు 

ముందే క్యాలండర్‌ ప్రకటించి మరీ పథకాలతో లబ్ధి చేకూరుస్తున్నాం 

మంచికి అడ్డుపడితే అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతన్నలు ఊరుకుంటారా? 

ఆ కుట్రలకు ఓటుతో బుద్ధి చెప్పండి.. రెట్టించిన ఉత్సాహంతో మీ జగన్‌కు ఓటేయండి.. తుప్పు పట్టిన సైకిల్‌ రిపేర్‌ చేసేందుకు ఢిల్లీ మెకానిక్స్‌ 

వాళ్లూ చేతులెత్తేయడంతో హామీల బెల్లు మోగిస్తున్న చంద్రబాబు 

తిట్టిన వారి చంకనెక్కే విద్యలో చంద్రబాబు నిపుణుడు 

అక్కచెల్లెమ్మలకు డబ్బులు రాకుండా అడ్డు పడుతున్నారు

ఓటు అనే ఆయుధంతో ఢిల్లీ పీఠం కదలాలి
వీళ్లు ఎన్ని కుట్రలు చేసినా.. దేవుడు అంతా గమనిస్తున్నాడు. మీ బిడ్డకు ప్రజల దీవెనలున్నాయి. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నల చేతుల్లో ఓటు అనే బలమైన ఆయుధం ఉంది. ఆ ఓటు అనే ఆయుధంతో వీళ్లను కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కూడా కదులుతుందని గట్టిగా చెబుతున్నా.

విశాఖలోనే ప్రమాణ స్వీకారం..
జూన్‌ 4 తర్వాత మీ బిడ్డ విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తాడు. అదే రోజు పరిపాలనా రాజధానిగా విశాఖ నుంచే పాలన చేయబోతున్నానని గర్వంగా చెబుతున్నా. మూడు రాజధానుల్లో విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తున్నాం. మీ బిడ్డకు మాత్రమే ఆ ధైర్యం ఉంది. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తూ మూడు జిల్లాలను ఆరు జిల్లాలుగా చేసింది మీ బిడ్డ ప్రభుత్వమే.  ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు ఎస్పీలతో పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు పాలన చేరువ చేశాం. శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, మంచినీళ్లపేటలో ఫిషింగ్‌ హార్బర్లు వస్తున్నాయి. ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ వస్తోంది. రూ.4,400 కోట్లతో మూలపేట పోర్టు పనులు వాయువేగంతో జరుగుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను శరవేగంగా చేస్తున్నాం, విశాఖ–భోగాపురం 6 లేన్ల రహదారిని నిర్మిస్తున్నాం. విశాఖలో అదాని డేటా సెంటర్, ఇన్ఫోసిస్‌ మొదలైంది కూడా మీ బిడ్డ పాలనలోనే.
– ఇచ్ఛాపురం సభలో సీఎం జగన్‌

సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, విశాఖపట్నం: ‘దేవుడి దీవెనలు, మీ ఆశీస్సులున్నంత వరకూ మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కరూ ఆపలేరు. జూన్‌ 4న మనందరి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుంది. మనం నొక్కిన బటన్లు అన్నీ వారం రోజుల్లోనే క్లియర్‌ చేస్తాం. ఢిల్లీతో కలిసి మీ బిడ్డ ప్రభుత్వాన్ని దెబ్బ తీసే కుట్రలు చేస్తున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మూడుసార్లు సీఎంగా చేశానంటాడు. అన్నేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే పేదలకు ఒక్క స్కీమ్‌ అయినా గుర్తుకొస్తుందా? జగన్‌ అంటే పథకాలు.. చంద్రబాబు అంటే మోసాలు, కుట్రలు, కుతంత్రాలే గుర్తుకొస్తాయి’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు మోసాలు, కుతంత్రాలకు ఓటు అనే వజ్రాయుధంతో మరోసారి గట్టిగా బుద్ధి చెప్పాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. 

ఇంతలా దిగజారిపోయారు..
కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ జగన్‌ నొక్కిన బటన్ల సొమ్ము నా అక్కచెల్లెమ్మలకు అందకుండా ఢిల్లీ వాళ్లతో కలిసి అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. సాక్షాత్తూ మీ జగన్‌ ఓ ముఖ్యమంత్రిగా కోర్టుకు వెళ్లి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కేసులు వేసే పరిస్థితిలోకి ప్రజాస్వామ్యం దిగజారిపోయిందంటే వీళ్లను ఏమనాలి? మీ జగన్‌ బటన్‌ నొక్కిన పథకాలన్నీ ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా తెచ్చినవి కాదు. గత ఐదేళ్లుగా ఏటా క్రమం తప్పకుండా ఇస్తున్న పథకాలకే మీ జగన్‌ బటన్‌ నొక్కాడు. ఈ స్కీములు ఇవాళ ఏదో కొత్తగా తెచ్చినవి కాదు. ఇవన్నీ ఆన్‌ గోయింగ్‌ స్కీమ్స్‌. బడ్జెట్‌ కేటాయింపులున్నవే. అసెంబ్లీలో బడ్జెట్‌ ద్వారా ఆమోదం కూడా తెలిపినవే. 

58 నెలలుగా ఇస్తున్న పథకాలకు అడ్డుపడుతూ జగన్‌ను కట్టడి చేసేందుకు ఢిల్లీతో కలసి కుట్రలు పన్నుతున్నారు. మీ బిడ్డ బటన్లు నొక్కిన సొమ్మును అక్కచెల్లెమ్మల కుటుంబాలకు అందకుండా అడ్డు తగిలే దౌర్భాగ్య పరిస్థితుల్లోకి వీళ్లు దిగజారిపోయారు. గత ఐదేళ్లుగా క్యాలండర్‌లో చెప్పిన విధంగా క్రమం తప్పకుండా ఇస్తూ పోతున్న మీ జగన్‌ను ఇబ్బంది పెట్టడానికి కుట్రలు పన్నుతున్నారు. చివరిలో అడ్డుపడితే నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటాయా? పెన్షన్‌ సొమ్ము ఇన్నేళ్ల పాటు మీ బిడ్డ ఇంటికే పంపించిన తర్వాత చివరి రెండు నెలలు ఆ డబ్బులు ఇంటికి రాకపోతే ఏం జరిగిందో ఆ అవ్వాతాతలు గ్రహించలేరనుకున్నారా? ఓటు అనే అస్త్రంతో చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుతున్నా. జూన్‌ 4న అధికారంలోకి వచ్చిన వెంటనే ఓ వారం రోజుల్లోనే ఈ బటన్లు అన్నీ మీ బిడ్డ క్లియర్‌ చేస్తాడు. 

బాబు ఒక్క బటనూ నొక్కలేదు..
మనపై ఇన్ని కుట్రలు చేస్తున్న చంద్రబాబు దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన మీ జగన్‌ మాదిరిగా ఎన్నడూ బటన్లు నొక్కలేదు. ఏ రోజూ ఏ ఒక్క అక్కచెల్లెమ్మకూ డబ్బులు, పథకాలు ఇవ్వలేదు. మీ బిడ్డ జగన్‌ ఈ 59 నెలల కాలంలో 130 సార్లు బటన్లు నొక్కి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపాడు. చంద్రబాబు దగ్గర ప్రజలను దోచేసిన సొమ్ము చాలా ఉంది. ఆ దోచేసిన సొమ్ముతో లోబర్చుకునేందుకు ఎన్నికల రోజు రూ.2 వేలు, రూ.3 వేలు, కొన్ని చోట్ల రూ.4 వేలు, రూ.5 వేలు కూడా ఇస్తాడు. చంద్రబాబు ఎన్నికల రోజు ఇచ్చే ఆ డబ్బంతా మనదే. మన దగ్గర దోచేసిన డబ్బే అది. కాబట్టి ఆయన ఇస్తే ఏ ఒక్కరూ వద్దు అనొద్దు. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కటే గుర్తు పెట్టుకోండి. మీకు, మీ కుటుంబానికి ఎవరి వల్ల మంచి జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. 

ఈ అభివృద్ధి, పథకాలను కొనసాగిద్దాం..
మరో ఆరు రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లలో మీ ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించేవి. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడమే. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపటమే. రాష్ట్రంలో గతంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ వచ్చాక ఏకంగా మరో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాడు. మేనిఫెస్టో హామీల్లో 99 శాతం అమలు చేసి చిత్తశుద్ధి చాటుకున్నాం. గడప గడపకూ మేనిఫెస్టోతో వెళ్లి మరోసారి ఆశీర్వదించాలని కోరాం. 

మన పథకాలు.. మచ్చుకు కొన్ని
‘నాడు–నేడు’తో బాగుపడ్డ గవర్నమెంట్‌ బడులు, ఇంగ్లిష్‌ మీడియం, 6వ తరగతి నుంచే క్లాస్‌ రూముల్లో డిజిటల్‌ బోధన, 8వ తరగతికి రాగానే ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబ్‌లు, 3వ తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు, సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, పిల్లల చేతుల్లో బైలింగ్యువల్‌ టెక్టŠస్‌ బుక్స్‌ (ద్విభాషా పాఠ్య పుస్తకాలు), బడులు తెరవగానే పిల్లలకు విద్యాకానుక, రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్ద, పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి, పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యాదీవెన, ఖర్చులకు ఇబ్బంది పడకుండా వసతి దీవెన, అంతర్జాతీయ వర్సిటీల నుంచి ఆన్‌లైన్‌ సర్టిఫైడ్‌ కోర్సులతో భాగస్వామ్యం, తప్పనిసరి ఇంటర్న్‌షిప్‌... ఇలాంటి విద్యా విప్లవాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? 

మహిళా సాధికారత.. వినూత్న వ్యవస్థలు
అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన కోసం ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, 22 లక్షల గృహ నిర్మాణాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అవ్వా­తాతలకు ఇంటికే రూ.3 వేలు పెన్షన్, ఇంటి వద్దకే పౌర సేవలు, రేషన్, పథకాలు.. ఇలా నేరుగా డోర్‌ డెలివరీ చేసిన ప్రభుత్వాలు గతంలో ఉన్నాయా? గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఉచిత పంటల బీమా, సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ, పగటి పూటే 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకేలు, సచివాల­యాలు, వలంటీర్‌ వ్యవస్థలు గతంలో ఉన్నాయా?

స్వయం ఉపాధికి అండగా..
వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, చిరువ్యాపారులకు తోడు, చేదోడు, లా నేస్తం లాంటి పథకాలతో స్వయం ఉపాధికి అండగా నిలిచిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా? రూ.25 లక్షల వరకూ విస్తరించిన ఉచిత ఆరోగ్యశ్రీ, జీవన భృతి అందిస్తూ ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజల ఆరోగ్యంపై ఇంత ధ్యాస పెట్టిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా? ఏ గ్రామానికి వెళ్లినా 600 రకాల సేవలందిస్తున్న సచివాలయం, ఫైబర్‌గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్‌ లైబ్రరీలు, అక్కచెల్లెమ్మల భద్రత కోసం గ్రామంలోనే మహిళా పోలీసు, దిశా యాప్‌ లాంటివి ఇంతకు ముందెప్పుడైనా చూశారా? నాడూ నేడూ అదే రాష్ట్రం.. అదే బడ్జెట్‌. చంద్రబాబు ఏ రోజూ పేదల కోసం బటన్లు నొక్కలేదు. అప్పుల గ్రోత్‌ రేట్‌ కూడా గతంలో కంటే ఇప్పుడే తక్కువ. 

ఇది కాదా అభివృద్ధి..?
మీ జగన్‌ పేరు చెబితే ఎన్నో పథకాలు గుర్తుకొస్తాయి. బాబు పేరు చెబితే ఏ స్కీమూ గుర్తు రాదు కాబట్టి జగన్‌ హయాంలో అభివృద్ధి లేదంటూ అబద్ధాలు చెబుతున్నాడు. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.32,000 కోట్లు అయితే మీ బిడ్డ జగన్‌ పాలనలో రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయంటే అంటే ఇది అభివృద్ధి పాలన కాదా? మూడు ఇండస్ట్రియల్‌ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్‌ నోడ్స్‌ మీ బిడ్డ హయాంలోనే వస్తున్నాయి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీని వరుసగా ఏటా నంబర్‌ వన్‌గా నిలబెట్టాం. 

కొత్తగా 4 సీ పోర్టులు నిర్మిస్తున్నాం. 10 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి. 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. గ్రామ స్వరాజ్యానికి అర్థం తీసుకొచ్చాం. 15,000 గ్రామ సచివాలయాలు, 11,000 విలేజ్, వార్డు క్లినిక్‌లు, 11,000 ఆర్బీకేలు నెలకొల్పాం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్‌ డాక్టర్ల కొరత 61% ఉంటే మన రాష్ట్రంలో మాత్రం 3.95% మాత్రమే ఉంది. వైద్య ఆరోగ్యశాఖలో 54 వేల మందికిపైగా సిబ్బందిని నియమించాం. మీ బిడ్డ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు 11 కాగా కొత్తగా మరో 17 వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టింది మన ప్రభుత్వమే.

మన అభ్యర్థులను దీవించండి..
నాకు సొంత తమ్ముడు లేడనే బాధ ఉండేది. రాజాను (రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా) చూశాక ఆ బాధ పోయింది. నా తమ్ముడిని గొప్ప మెజార్టీతో గెలిపించాలి. మీరు రాజాకు ఓటేస్తే గణేష్, అమ్మ (జక్కంపూడి విజయలక్ష్మి), రాజా భార్య అంతా కలిసి మీ మంచి కోసం ఇంకా ఎక్కువగా కృషి చేస్తారు. మంచి వైద్యుడిగా పేరున్న శ్రీను అన్న (రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌)ను గొప్ప మెజార్టీతో ఆశీర్వదించండి. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అభ్యర్థి విజయమ్మ, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ను దీవించాలని కోరుతున్నా. గాజువాక ఎమ్మెల్యే  అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్, నాకు అక్క లాంటి విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని భారీ మెజార్టీతో గెలిపించండి.

మీ కుటుంబంతో చర్చించండి..
ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. అది క్లాస్‌ వార్‌. పేదవాడు ఒకవైపు, పెత్తందార్లు మరోవైపున నిలిచి ఈ యుద్ధం జరుగుతోంది. మీరంతా ఓటేసేముందు మీ కుటుంబంతో కలసి కూర్చొని చర్చించండి. చిన్న పిల్లల అభిప్రాయాన్ని కూడా తీసుకోండి. ఏ ప్రభుత్వం వల్ల, ఎవరి వల్ల మీ ఇంటికి, మీ కుటుంబానికి మంచి జరిగిందో ఆలోచించండి. ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందో గమనించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. మంచి చేసే ఫ్యాను ఇంట్లో ఉండాలి. చెడు చేసే సైకిల్‌ ఎక్కడ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌లోనే ఉండాలి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్‌ మారాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి చదువులు, వారి బడులు బాగుపడాలన్నా.. మన వ్యవసాయం, హాస్పిటళ్లు మెరుగ్గా ఉండాలన్నా రెండు బటన్లు ఫ్యాన్‌ మీద నొక్కాలి. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో మన అభ్యర్థులను భారీ మెజార్టీలతో గెలిపించాలి.

ఉద్దానం కిడ్నీ కష్టాలకు విముక్తి
దశాబ్దాలుగా ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ సమస్యల పరిష్కారం కోసం రూ.780 కోట్లతో హిరమండలం నుంచి తాగునీటిని తరలించింది మీ బిడ్డ ప్రభుత్వమే. రూ.80 కోట్లతో కిడ్నీ ఆస్పత్రి, రీసెర్చ్‌ సెంటర్‌ను నిర్మించింది మన ప్రభుత్వమే. ఉత్తరాంధ్రలో కొత్తగా మెడికల్‌ కళాశాలలు కడుతున్నాం. పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నం, విజయనగరం జిల్లాల్లో ఇవి ఏర్పాటవుతున్నాయి. సాలూరులో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నది మన ప్రభుత్వమే. కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల కడుతున్నది మన ప్రభుత్వమే. ఐటీడీఏల పరిధిలో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయంటే కారణం మీ బిడ్డే. సెల్‌ఫోన్‌ కనెక్టివిటీ లేని గిరిజన ప్రాంతాల్లో రూ.400 కోట్ల వ్యయంతో టవర్లను ఏర్పాటు చేశాం. 1.53 లక్షల గిరిజన కుటుంబాలకు 3,23,000 ఎకరాల పట్టాలిచ్చి వారికి  రైతు భరోసా అందిస్తూ  జీవనోపాధి చూపించింది కూడా మీ బిడ్డే.

కోరుకొండ భూముల సమస్య పరిష్కరిస్తా..
కోరుకొండ భూముల గురించి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గుర్తుచేశాడు. ఫైల్‌ ప్రాసెస్‌లో ఉన్న సమయంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. మళ్లీ మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భూముల సమస్యను పరిష్కరిస్తామని సవినయంగా తెలియజేస్తున్నా.

తుప్పు సైకిల్‌.. ఢిల్లీ మెకానిక్స్‌!
ఎన్నికల ముందు రకరకాల వాగ్దానాలు గుప్పించే చంద్రబాబు వాటిని అమలు చేయకపోవడం వల్ల తమకు కలిగిన నష్టానికి ప్రతీకారంగా రైతన్నలు, నిరుద్యోగులు, అక్కచెల్లెమ్మలు, వివిధ సామాజిక వర్గాలు, పల్లెలు, పట్టణాల వాసులు అంతా కలసి సైకిల్‌ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్‌కు రిపేరు చేయాలని చంద్రబాబు తంటాలు పడుతున్నాడు. ముందుగా ఎర్రచొక్కాల దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఫలితం లేకపోవడంతో దత్తపుత్రుడి దగ్గరకు వెళ్లాడు. 

తుప్పు పట్టిన సైకిల్‌ కేరియర్‌ మీద మాత్రమే కూర్చుంటా! టీ గ్లాస్‌ పట్టుకుని తాగుతా! మిగిలింది నావల్ల కాదని దత్తపుత్రుడు చెప్పాడు. దీంతో వదిన­మ్మను ఢిల్లీకి పంపాడు. అక్కడి మెకానిక్స్‌ను ఇక్కడికి దింపి సైకిల్‌ను ఓ షేపులోకి తేవాలని కోరాడు. ఆ ఢిల్లీ మెకానిక్స్‌ ఇక్కడికి వచ్చి తుప్పు పట్టిన సైకిల్‌ను చూసి... హ్యాండిల్‌ లేదు! సీటు లేదు! పెడల్స్‌ లేవు! చక్రాలు, ట్యూబులు లేవు! మధ్యలో ఫ్రేమ్‌ కూడా లేదు! ఇంత తుప్పు పట్టిన సైకిల్‌ను ఎలా బాగు చేస్తాం చంద్రబాబూ! అని అడిగితే పిచ్చి చూపులు చూస్తూ.. ఇదొక్కటే మిగిలిందంటూ ట్రింగ్‌ ట్రింగ్‌మని బెల్లు మోగిస్తున్నాడు. ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో!

2014లో బాబు ముఖ్యమైన మోసాలు..
⇒ రైతులకు రూ.87,612 కోట్ల రుణమాఫీ జరిగిందా? 
⇒ డ్వాక్రా సంఘాలకు రూ.14,205 కోట్ల రుణాలను మాఫీ చేస్తానని రూపాయైనా మాఫీ చేశాడా?
⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి స్కీమ్‌ కింద బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్‌ చేస్తామన్నాడు. మరి ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి ఇచ్చాడా?
⇒ ఇంటికో ఉద్యోగం.. లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అన్నాడు. ఐదేళ్లలో ఏ ఇంటికైనా రూ.1.20 లక్షలు ఇచ్చాడా? 
⇒ అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, పక్కా ఇల్లు ఇస్తామన్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా?
⇒ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్, చేనేత పవర్‌ లూమ్స్‌ రుణాల మాఫీ జరిగిందా? 
⇒ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశాడా? 
⇒ సింగపూర్‌ను మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ నిర్మాణం జరిగిందా? 
⇒ రాజానగరంలో ఎవరికైనా కనిపిస్తోందా? 
⇒ ప్రత్యేక హోదా తేకపోగా అమ్మేశాడు. 
⇒ అదే ముగ్గురు మరోసారి కూటమిగా ఏర్పడి సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజి కార్‌ అంటూ నమ్మబలుకుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement