నా కిడ్నీ అమ్మాలి.. ఎలా? | how can i sell my kidney, many ask in india | Sakshi
Sakshi News home page

నా కిడ్నీ అమ్మాలి.. ఎలా?

Published Wed, Aug 24 2016 9:17 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

నా కిడ్నీ అమ్మాలి.. ఎలా?

నా కిడ్నీ అమ్మాలి.. ఎలా?

ఆర్థికపరమైన కష్టనష్టాల వల్లో, కుటుంబ సమస్యల కారణంగానో.. మరేదైనా ఇబ్బంది ఉందో గానీ కిడ్నీలు అమ్ముకోడానికి మన దేశంలో చాలామంది సిద్ధంగా ఉన్నారు. అయితే అది ఎలాగో వారికి అర్థం కావడం లేదు. అందుకే, దాదాపు రెండు దశాబ్దాలుగా అవయవ దానంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థ మోహన్ ఫౌండేషన్‌ను ఈ ప్రశ్నతో ముంచెత్తుతున్నారు. తమ ఫేస్‌బుక్ పేజిలోను, ఈమెయిల్‌కు, టోల్‌ఫ్రీ నంబర్లకు పదే పదే చాలామంది ఇదే ప్రశ్న వేస్తున్నారని ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ సునీల్ ష్రాఫ్ చెప్పారు. తమ సోషల్ సైట్లలో వచ్చే ఈ ప్రశ్నలను తొలగించడానికి ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని పెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. ఏవైనా ఖరీదైన వస్తువులు కొనుక్కోడానికి డబ్బు కోసం అమ్మడానికి సిద్ధంగా ఉన్న వస్తువుల్లో కిడ్నీ ఒకటన్నది వాళ్ల భావన అయి ఉండొచ్చని ఆయన చెప్పారు. అలా అమ్మడం చట్టవిరుద్ధమన్న సంగతి వాళ్లకు తెలియకపోవచ్చని తెలిపారు.

మానవ శరీర అవయవాలను ఎవరైనా అమ్మినా.. కొన్నా కోటి రూపాయల వరకు జరిమానా, పదేళ్ల జైలుశిక్ష పడుతుంది. ఓ వ్యక్తి ఒక వెబ్‌సైట్‌లో ''నా పేరు గణేశ్. నాకు పాస్‌పోర్టు కూడా ఉంది. నా ఏబీ పాజిటివ్ కిడ్నీ అమ్ముతాను. నేను సిగరెట్లు కాల్చను, మద్యం తాగను. ఆసక్తిగల వారు ఫోన్ చేయండి'' అని పోస్ట్ చేశాడు. విచిత్రం ఏమిటంటే, దానికి ముగ్గురు వ్యక్తులు స్పందించారు కూడా. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు తమ కిడ్నీని రూ. 9 లక్షల నుంచి రూ. 45 లక్షల వరకు ధరకు అమ్ముతున్నారట. విపరీతమైన పేదరికం కూడా ఇందుకు కారణం అవుతోంది.

ముంబైలోని ఎల్హెచ్ హీరానందాని ఆస్పత్రిలో జూలై 14 నుంచి ఇప్పటివరకు ఐదుగురు డాక్టర్లు, తొమ్మిది మంది ఇతరులు అరెస్టయ్యారు. వీళ్లంతా కిడ్నీ రాకెట్‌లో సభ్యులే. భారతదేశంలో తొలిసారిగా డాక్టర్లు, మధ్యవర్తులతో పాటు దాత, గ్రహీత కూడా అరెస్టయ్యారని డాక్టర్ ష్రాఫ్ చెప్పారు. అవయవ దానానికి సంబంధించిన నిబంధనల గురించి చాలామంది డాక్టర్లకు కూడా సరిగా తెలియదట. దీంతో ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement