kidney sale
-
అప్పులు తీర్చేందుకు కిడ్నీలు అమ్మాలని..
ఇల్లు కట్టుకునేందుకు ఆ దంపతులు రూ. కోటికి పైగా అప్పులు చేశారు. కరోనాతో వ్యాపారం దెబ్బతినడంతో ఆర్థికంగా చితికిపోయారు. అప్పులు ఇచ్చినవాళ్లు ఒత్తిడి చేయడంతో చేసేదిలేక ఒక్కో కిడ్నీ అమ్మడానికి నిర్ణయించుకున్నారు. కిడ్నీ అవసరమైన వాళ్ల నెంబర్‌కోసం గూగుల్‌ని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుకుని రూ. 40 లక్షలు పోగొట్టుకున్నారు. దెబ్బమీద దెబ్బపడటంతో ఆ దంపతులు విలవిల్లాడుతున్నారు. హిమాయత్‌నగర్: ఎం.ఎస్.మక్తాలో నివసించే మోడీ వెంకటేష్, లావణ్యలకు ఇద్దరు పిల్లలు. బుక్‌స్టాల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. కొన్ని నెలల క్రితం తాము ఉండే ప్రదేశంలో ఓ ఖరీదైన ఇల్లును నిర్మించుకున్నారు. దీనికి రూ.కోటి పైనే అప్పులు చేశారు. గత ఏడాది, ఈ ఏడాది కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో బుక్‌స్టాల్ వ్యాపారం మూతపడింది. దీంతో ఆర్థికంగా కష్టాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అప్పులు ఇచ్చిన వాళ్లు తిరిగి చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారు. చేసేది లేక ఆ దంపతులు తమ ఒక్కో కిడ్నీని అమ్మి, కష్టాల నుంచి బయటపడాలని నిర్ణయం తీసుకున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి... కిడ్నీ అవసరమైన వాళ్లకోసం ఆ దంపతులు గూగుల్‌లో సెర్చ్ చేయగా ఓ ఫోన్ నంబర్ దొరికింది. అతడికి కాల్ చేయగా.. ఢిల్లీలోని ‘హోప్ కిడ్నీ సెంటర్’లో మీ కిడ్నీ తీసుకునేలా ఏర్పాటు చేస్తాను, ఒక్కో కిడ్నీకి రూ.5 కోట్లు వచ్చేలా సహకరిస్తానని నమ్మించాడు. ఇందుకు గాను ప్రాసెసింగ్, వైద్యుల కమీషన్ తదితర వాటికి రూ.4 లక్షలు ఇవ్వమని కోరాడు. దీంతో ఆ దంపతులు ఆ మొత్తం చెల్లించారు. అనంతరం మరోసారి డబ్బులు అడగడంతో అనుమానం వచ్చి డబ్బు పంపించడం మానుకున్నారు. అనంతరం మరోసారి గూగుల్లోనే వెతికి ఇంకో నంబర్‌ను సంప్రదించారు. అతను కూడా వీరిని నమ్మించి రూ.9 లక్షలు కాజేశాడు. ఇలా నాలుగు పర్యాయాలు ప్రయత్నించి సైబర్ నేరగాళ్ల ఖాతాలో రూ.40 లక్షలు జమచేశారు. చివరకు మోసపోయామని గ్రహించి మంగళవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కిడ్నీ అమ్ముతా కొంటారా? ఫేస్బుక్లో పోస్ట్
బెంగళూరు: కరోనా ప్రభావంతో ప్రపంచమంతటా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ప్రజల స్థితిగతులు మారిపోయాయి. భారతదేశంలో ఆ ప్రభావం చిరుద్యోగులు, మధ్య తరగతి, పేదవారిపై తీవ్రంగా ప్రభావం చూపింది. దాని ప్రభావంతో ఓ వ్యక్తి ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియాలో ‘కిడ్నీలు అమ్ముతా.. ఎవరైనా కొంటారా?’ అని ప్రకటన విడుదల చేశాడు. అంతటి కడు పరిస్థితి ఆయనకు ఏర్పడింది. ఇది చూసిన నెటిజన్లు ఆయనకు అండగా నిలుస్తున్నారు. కిడ్నీలు అమ్మొద్దు అంటూ సలహా ఇస్తున్నారు. కర్ణాటక ఆర్టీసీ ఎన్ఈకేఆర్టీసీలో కండక్టర్‌గా హనుమంత్ (38) పని చేస్తున్నాడు. లాక్డౌన్ ప్రభావంతో సంస్థ జీతాల్లో కోత విధించింది. దీంతో వచ్చే అరకొర జీతంతో కుటుంబ పోషణ భారమైంది. తీవ్రమైన ఆర్థిక సమస్యలు వచ్చిపడ్డాయి. దీంతో తన కిడ్నీని అమ్మకానికి పెడుతున్నట్లు ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. జీతం తగ్గించడం వల్ల రోజూవారీ ఖర్చులను భరించలేకపోతున్నామని, అందుకే తన కిడ్నీని అమ్మాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. ఆయన ఫేస్బుక్లో ఈ విధంగా చెప్పాడు. ‘నేను రవాణా సంస్థలో కండక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నా. నాకు వస్తున్న కోతలతో కూడిన జీతం సరిపోవడం లేదు. రేషన్, ఇంటి అద్దెకు చెల్లించడానికి వచ్చిన జీతం సరిపోవడం లేదు. దీంతో నా కిడ్నీని అమ్మాలని నిర్ణయించుకున్నా. ఆసక్తి ఉన్నవాళ్లు నాకు ఫోన్ చేయండి.’ అంటూ హనుమంతు తన ఫోన్ నెంబర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి నార్త్ ఈస్ట్ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ సంబంధించిన ఫేస్బుక్ పేజీని ట్యాగ్‌ను జత చేశాడు. అయితే దీనిపై మీడియా ప్రశ్నించగా తన బాధనంతా చెప్పుకున్నాడు. ‘సంస్థ ఇచ్చే జీతంతో ఇంటి అద్దె చెల్లించడం, ఇంట్లో కిరాణా సామగ్రి కొనుగోలు చేయడం, పిల్లల చదువులు భారంగా మారాయి’ అని విలపిస్తూ చెప్పాడు. అతడి పోస్టుపై ఆర్టీసీ అధికారులు స్పందించారు. హనుమంతు క్రమంగా ఉద్యోగానికి రాకపోవడంతోనే అతడికి తక్కువ జీతం వస్తుందని వివరణ ఇచ్చారు. ఈ విషయమై అతడికి తాము చాలా సార్లు హెచ్చరించామని తెలిపారు. -
మూడు కిడ్నీలు, ఆరు లివర్లుగా వ్యాపారం..!
సాక్షి, న్యూఢిల్లీ : మూలిగే నక్క మీద తాడిపండు పడ్డట్టు ఆర్థికంగా దివాలా తీసిన ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించడంతో అక్కడ పేదరికం పెచ్చరిల్లుతోంది. కూడు, గుడ్డ కరువైన పేద వారు అక్కడ బతకడం కోసం కిడ్నీల నుంచి కాలేయం వరకు శరీర అవయవాలను అమ్ముకుంటున్నారు. దాంతో మూడు కిడ్నీలు, ఆరు లివర్లుగా అక్కడ అవయవాల వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో టెహరాన్‌లోని ఓ వీధి కాస్త ‘కిడ్నీ స్ట్రీట్’గా మారిందని, అక్కడ పదివేల డాలర్లకు కిడ్నీ, 50 వేల డాలర్లకు లివర్ దొరుకుతోందని పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇరాన్ (ఎన్సీఆర్ఐ)’ వెల్లడించింది. తాము సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాం.. కొనేవాళ్లు తమను సంప్రదించేందుకు వీలుగా టెహ్రాన్‌లోని కిడ్నీ స్ట్రీట్‌లో తమ కిడ్నీలను అమ్ముకోదలచిన వారు తమ పేరు, బ్లడ్ గ్రూప్, ఫోన్ నెంబర్లను రాసిన చీటీలను గోడల మీద అతికించి పోతున్నారని ఎన్సీఆర్ఐ వర్గాలు తెలిపాయి. దివ్యాంగురాలైన తన తల్లి సంరక్షణ కోసం తన కిడ్నీని అమ్మకానికి పెట్టిన పీహెచ్డీ విద్యార్థితోపాటు, రెండు కిడ్నీలతోపాటు ఎముక మూలుగను కూడా అమ్మకానికి పెట్టిన ఓ 26 ఏళ్ల యువకుడి వివరాలు ‘మానవ అవయవాల అమ్మకాలు జరిపే ఓ వెబ్సైట్’లో ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇలా తమ అవయవాలను అమ్మకానికి పెట్టిన వారిలో ఎక్కువ మంది తాము క్రీడాకారులమని, తాము సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామని ఆ వెబ్సైట్లో ప్రకటనలు కూడా ఇస్తున్నారు. ఆ వెబ్సైట్ ద్వారా కాలేయం 15 వేల డాలర్ల నుంచి 50 వేల డాలర్ల వరకు, కిడ్నీలు పదివేల డాలర్ల వరకు, ఎముకల మూలుగ పది వేల డాలర్ల వరకు అమ్ముడు పోతున్నాయని ఆ వర్గాలు వివరించాయి. ఎక్కడ చూసినా అవే వివరాలు.. ‘కిడ్నీ స్ట్రీట్’లోని అన్ని ఆస్పత్రుల వద్ద అవయవ అమ్మకం దార్ల పేర్లు, ఫోన్ నెంబర్ల వివరాలు విరివిగా లభిస్తున్నాయని ఓ ఏజెంట్ తెలిపారు. ఏ గోడ మీద చూసినా, ఏ తలుపు మీద చూసిన వారి వివరాలు ఉంటున్నాయని, తనను ఈ విషయంలో సంప్రదించిన వాళ్లే కొన్ని వందల మంది ఉంటారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఆ ఏజెంట్ తెలిపారు. అమెరికా–ఇరాన్ అణు ఒప్పందం నుంచి ఇరాన్ బయటకు వచ్చిన 2015 సంవత్సరంలో ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. సౌదీ అరేబియాలోని ఓ చమురు క్షేత్రంపై ఇటీవల జరిగిన డ్రోన్ దాడి వెనక కూడా ఇరాన్‌నే ఉందన్న ఆరోపణలతో అమెరికా గురువారం నాడు కూడా మరిన్ని ఆంక్షలు విధించింది. దాంతో ఇరాన్ ప్రజల్లో ఆర్థిక వ్యవస్థ పట్ల భయాందోళనలు తీవ్రమయ్యాయి. -
కిడ్నీలు అమ్ముకున్నా కష్టం తీరలేదు
విధి చేతిలో ఓడిన అభాగ్యులు వీరు..కుటుంబానికి పెద్దాయనను రోడ్డు ప్రమాదం అవిటి వాడిని చేస్తే.. నీలోసగమైన నేనున్నాను కదయ్యా అంటూ ఆమె ధైర్యం చెప్పింది. ఆ ధైర్యాన్ని చూసి కాలానికి కన్ను కుట్టినట్టుంది. ఆమె కాలూ విరిచేసింది. ఇద్దరు పిల్లలతోపాటు బతుకు భారం మోయాలి. ఇప్పుడు వారికే బతకడం భారమైంది. మెతుకు కరువైంది. పిల్లల భవిష్యత్ నిత్యం కన్నీరై కారుతోంది. అందుకే ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్క కిడ్నీ అమ్మేశారు. భార్యాభర్తలిద్దరికీ ఒక్కొక్క కిడ్నీ, ఒక్కొక్క కాలు.. కుంగదీస్తున్న అనారోగ్యం..చిల్లిగవ్వలేని దౌర్భాగ్యం.. కదిలిస్తే ఏడ్చి ఏడ్చి ఇంకిన కన్నీరు ఆదుకోండయ్యా అంటూ మళ్లీ ఉబికివస్తున్నాయి. ప్రతి గుండెనూ బరువెక్కిస్తున్నాయి. చిట్టినగర్(విజయవాడ పశ్చిమం): దేవరకొండ కేశవరావు, వెంకటలక్ష్మిలు భార్యాభర్తలు. కేశవరావు హనుమాన్‌జంక్షన్ రైల్వే గేటు సమీపంలోని పేపరు మిల్లులో సెక్యూరిటీ గార్డుగా పని చేసేవాడు.. ఓ రోజు డ్యూటీకి వెళ్లి వస్తుండగా గేటు వద్ద చోటుచేసుకున్న ప్రమాదంలో కేశవరావు కుడికాలు విరిగిపోయింది. కుటుంబం బాధ్యతను భార్య వెంకటలక్ష్మి భుజానికి ఎత్తుకుంది. భర్త సహకారంతో ముందుకు నడుస్తున్నారు. ఇద్దరి పిల్లలతో నెట్టుకొస్తోంది. అయినా ఆర్థిక బాధలు వెంటాడుతూనే ఉన్నాయి. కొంత కాలానికి వెంకటలక్ష్మి ఇంటి ముందు ఉండగా పాము కాటు వేయడంతో ఆమె కుడి కాలు కూడా తీసేయాల్సి వచ్చింది. అప్పటి వరకు కష్టం అంటే తెలియని ఆ కుటుంబాన్ని కష్టాలు చుట్టుముట్టాయి. కాలు లేకపోయినా పని చేసేందుకు ఎవరి వద్దకు వెళ్లినా నీవు పనికి రావంటూ పంపేసేవారు.. చేతిలో పని లేకపోవడంతో అప్పు చేసి కిళ్లీ కొట్టు పెట్టాడు... అదీ సాగకపోవడంతో అప్పుల పాలయింది, ఆ కుటుంబం.. ఇక చేసేది లేక కిడ్నీ అమ్ముకుని అప్పులు తీర్చారు. కొంత కాలం బాగానే సాగింది... ఆర్థిక పరిస్థితి మళ్లీ మొదటికి రావడంతో వెంకటలక్ష్మి కూడా భర్త అడుగు జాడల్లో కిడ్నీని విక్రయించింది. తరుచూ అనారోగ్యం... కిడ్నీలు విక్రయించడంతో భార్యాభర్తలిద్దరి ఆరోగ్య పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. కేశవరావుకు బైపాస్ సర్జరీ చేయడంతో కుటుంబ పరిస్థితి మరింత దీనస్థితికి చేరింది. హనుమాన్‌జంక్షన్ నుంచి నగరానికి వలస వచ్చిన కేశవరావు కుటుంబం ప్రస్తుతం జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో నివాసం ఉంటుంది. కుమార్తె వాణికి ఎలాగో ఓ ఇంటి దానిని చేశారు. కుమారుడు సాయికిరణ్ పాల ప్రాజెక్టు సమీపంలోని సయ్యద్ అప్పలస్వామి కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చదువుతూనే ఓ ఎలక్ట్రికల్ దుకాణంలో పని చేస్తున్నాడు. అక్కడ వచ్చే డబ్బులతో తల్లిదండ్రులిద్దరికి మందులు, ఇంటి ఖర్చులకు వెచ్చిస్తున్నారు. మాకు ఇళ్ల స్థలం కేటాయించి ఆదుకోవాలని కేశవరావు, వెంకటలక్ష్మి కోరుతున్నారు. కళ్లను అమ్మాలని చూశాం కుటుంబ ఆర్థిక స్థితి సరిగా లేకపోవడం, కనీసం తినడానికి కూడా ఇబ్బందిగా ఉండటంతో ఓ సమయంలో కళ్లను కూడా అమ్మాలని చూశాం.. కళ్లను కొనే వారు హైదరాబాద్, ముంబాయి, ఢిల్లీలోని నేత్ర వైద్యశాల ఉంటారంటే అక్కడు వెళ్లాం.. అయితే అప్పులు పెరిగాయే తప్ప.. మా కష్టం తీరలేదు.: కేశవరావు, వెంకటలక్ష్మి -
నా కిడ్నీ అమ్మాలి.. ఎలా?
ఆర్థికపరమైన కష్టనష్టాల వల్లో, కుటుంబ సమస్యల కారణంగానో.. మరేదైనా ఇబ్బంది ఉందో గానీ కిడ్నీలు అమ్ముకోడానికి మన దేశంలో చాలామంది సిద్ధంగా ఉన్నారు. అయితే అది ఎలాగో వారికి అర్థం కావడం లేదు. అందుకే, దాదాపు రెండు దశాబ్దాలుగా అవయవ దానంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థ మోహన్ ఫౌండేషన్‌ను ఈ ప్రశ్నతో ముంచెత్తుతున్నారు. తమ ఫేస్బుక్ పేజిలోను, ఈమెయిల్‌కు, టోల్‌ఫ్రీ నంబర్లకు పదే పదే చాలామంది ఇదే ప్రశ్న వేస్తున్నారని ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ సునీల్ ష్రాఫ్ చెప్పారు. తమ సోషల్ సైట్లలో వచ్చే ఈ ప్రశ్నలను తొలగించడానికి ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని పెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. ఏవైనా ఖరీదైన వస్తువులు కొనుక్కోడానికి డబ్బు కోసం అమ్మడానికి సిద్ధంగా ఉన్న వస్తువుల్లో కిడ్నీ ఒకటన్నది వాళ్ల భావన అయి ఉండొచ్చని ఆయన చెప్పారు. అలా అమ్మడం చట్టవిరుద్ధమన్న సంగతి వాళ్లకు తెలియకపోవచ్చని తెలిపారు. మానవ శరీర అవయవాలను ఎవరైనా అమ్మినా.. కొన్నా కోటి రూపాయల వరకు జరిమానా, పదేళ్ల జైలుశిక్ష పడుతుంది. ఓ వ్యక్తి ఒక వెబ్సైట్లో ''నా పేరు గణేశ్. నాకు పాస్‌పోర్టు కూడా ఉంది. నా ఏబీ పాజిటివ్ కిడ్నీ అమ్ముతాను. నేను సిగరెట్లు కాల్చను, మద్యం తాగను. ఆసక్తిగల వారు ఫోన్ చేయండి'' అని పోస్ట్ చేశాడు. విచిత్రం ఏమిటంటే, దానికి ముగ్గురు వ్యక్తులు స్పందించారు కూడా. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు తమ కిడ్నీని రూ. 9 లక్షల నుంచి రూ. 45 లక్షల వరకు ధరకు అమ్ముతున్నారట. విపరీతమైన పేదరికం కూడా ఇందుకు కారణం అవుతోంది. ముంబైలోని ఎల్‌హెచ్ హీరానందాని ఆస్పత్రిలో జూలై 14 నుంచి ఇప్పటివరకు ఐదుగురు డాక్టర్లు, తొమ్మిది మంది ఇతరులు అరెస్టయ్యారు. వీళ్లంతా కిడ్నీ రాకెట్లో సభ్యులే. భారతదేశంలో తొలిసారిగా డాక్టర్లు, మధ్యవర్తులతో పాటు దాత, గ్రహీత కూడా అరెస్టయ్యారని డాక్టర్ ష్రాఫ్ చెప్పారు. అవయవ దానానికి సంబంధించిన నిబంధనల గురించి చాలామంది డాక్టర్లకు కూడా సరిగా తెలియదట. దీంతో ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయి.