బెంగళూరు: కరోనా ప్రభావంతో ప్రపంచమంతటా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ప్రజల స్థితిగతులు మారిపోయాయి. భారతదేశంలో ఆ ప్రభావం చిరుద్యోగులు, మధ్య తరగతి, పేదవారిపై తీవ్రంగా ప్రభావం చూపింది. దాని ప్రభావంతో ఓ వ్యక్తి ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియాలో ‘కిడ్నీలు అమ్ముతా.. ఎవరైనా కొంటారా?’ అని ప్రకటన విడుదల చేశాడు. అంతటి కడు పరిస్థితి ఆయనకు ఏర్పడింది. ఇది చూసిన నెటిజన్లు ఆయనకు అండగా నిలుస్తున్నారు. కిడ్నీలు అమ్మొద్దు అంటూ సలహా ఇస్తున్నారు.
కర్ణాటక ఆర్టీసీ ఎన్ఈకేఆర్టీసీలో కండక్టర్‌గా హనుమంత్ (38) పని చేస్తున్నాడు. లాక్‌డౌన్ ప్రభావంతో సంస్థ జీతాల్లో కోత విధించింది. దీంతో వచ్చే అరకొర జీతంతో కుటుంబ పోషణ భారమైంది. తీవ్రమైన ఆర్థిక సమస్యలు వచ్చిపడ్డాయి. దీంతో తన కిడ్నీని అమ్మకానికి పెడుతున్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. జీతం తగ్గించడం వల్ల రోజూవారీ ఖర్చులను భరించలేకపోతున్నామని, అందుకే తన కిడ్నీని అమ్మాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. ఆయన ఫేస్‌బుక్‌లో ఈ విధంగా చెప్పాడు.
‘నేను రవాణా సంస్థలో కండక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నా. నాకు వస్తున్న కోతలతో కూడిన జీతం సరిపోవడం లేదు. రేషన్, ఇంటి అద్దెకు చెల్లించడానికి వచ్చిన జీతం సరిపోవడం లేదు. దీంతో నా కిడ్నీని అమ్మాలని నిర్ణయించుకున్నా. ఆసక్తి ఉన్నవాళ్లు నాకు ఫోన్ చేయండి.’ అంటూ హనుమంతు తన ఫోన్ నెంబర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి నార్త్ ఈస్ట్ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ సంబంధించిన ఫేస్‌బుక్ పేజీని ట్యాగ్‌ను జత చేశాడు.
అయితే దీనిపై మీడియా ప్రశ్నించగా తన బాధనంతా చెప్పుకున్నాడు. ‘సంస్థ ఇచ్చే జీతంతో ఇంటి అద్దె చెల్లించడం, ఇంట్లో కిరాణా సామగ్రి కొనుగోలు చేయడం, పిల్లల చదువులు భారంగా మారాయి’ అని విలపిస్తూ చెప్పాడు. అతడి పోస్టుపై ఆర్టీసీ అధికారులు స్పందించారు. హనుమంతు క్రమంగా ఉద్యోగానికి రాకపోవడంతోనే అతడికి తక్కువ జీతం వస్తుందని వివరణ ఇచ్చారు. ఈ విషయమై అతడికి తాము చాలా సార్లు హెచ్చరించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment