Bangalore Doctor Omicron, No Need To Panic Over Omicron: ఒమిక్రాన్ భయాలతో వణికిపోతున్న వేళ బెంగుళూరులోని బోరింగ్ అండ్ లేడీ కర్జన్ ఆస్పత్రి వర్గాలు ఊరట కలిగించే వార్త చెప్పాయి. కోవిడ్ కొత్త వేరియంట్ బారినపడ్డ బెంగుళూరు డాక్టర్ (46) కోలుకున్నారని, ఆయనకు ఎటువంటి సమస్యలు లేవని వెల్లడించాయి. ప్రైమరీ కాంటాక్టులు అయిన ఆయన భార్య, కూతురు, మరో డాక్టర్ కూడా కోలుకుంటున్నారని తెలిపాయి.
వారందరి చికిత్స కోసం ఆస్పత్రిలో 60 పడకలతో ఉన్న ఓ వార్డు మొత్తం కేటాయించామని చెప్పాయి. ఆ వార్డులో మొత్తం ఆరుగురు చికిత్స పొందుతున్నారని పేర్కొన్నాయి. మరోవైపు బాధితులకు వైద్యం అందించిన డాక్టర్లు, సిబ్బంది ఇతర వార్డులకు వెళ్లొద్దని, ఆస్పత్రి పరిసరాల్లో తిరగొద్దని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.
(చదవండి: మరో రెండు ఒమిక్రాన్ కేసులు)
అదే చికిత్స.. అంతా నార్మల్
ఒమిక్రాన్ కూడా కోవిడ్-19 లాంటిదేనని, దాని గురించి భయపడాల్సింది లేదని బాధితులకు చికిత్స అందించిన బోరింగ్ అండ్ లేడీ కర్జన్ ఆస్పత్రి సీనియర్ డాక్టర్ ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కోవిడ్ 19కు అందించిన చికిత్సనే వీరికి కూడా అందించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. మోనోక్లోనల్ యాంటి బాడీస్‌తో చికిత్స చేసిన తర్వాత ఒమిక్రాన్ బాధితుడు కోలుకున్నారని చెప్పారు.
ఆందోళనకు గురికాకుండా కోవిడ్-19 ప్రోటోకాల్స్ పాటిస్తే సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. ఒమిక్రాన్ సోకిన డాక్టర్‌కు ఒళ్లు నొప్పులు, చలి, తేలికపాటి జ్వరం లక్షణాలు కనిపించాయని ఆయన తెలిపారు. బాధితుడికి శ్వాస, రక్త సంబంధమైన ఇబ్బందులు ఏవీ తలెత్తలేదని అన్నారు. కాగా, దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. తొలుత కర్ణాటకలో రెండు, అటు తర్వాత గుజరాత్‌లో ఒకటి, ముంబైలో మరొకటి బయటపడింది.
(చదవండి: ఖరగ్పూర్ ఐఐటీ రికార్డు.. స్టూడెంట్స్‌కు బంపరాఫర్.. ఏడాదికి రూ.2 కోట్లకు పైనే!)
Comments
Please login to add a commentAdd a comment