ముఠాగా హైదరాబాద్ ఆసుపత్రులు, వైజాగ్ దళారులు
తమిళనాడు, కశ్మీర్ నుంచి సర్జన్లను రప్పించి కిడ్నీ మార్పిడులు
గ్రహీత నుంచి ఒక్కో కిడ్నీకిరూ.60 లక్షల చొప్పున వసూలు
జనని, అరుణ, అలకానంద ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలు
రాచకొండ కమిషనర్ జీ సుదీర్ బాబు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ మూలాలను రాచకొండ పోలీసులు ఛేదించారు. సరూర్‌నగర్‌లోని అలకనంద, మాదన్నపేటలోని జనని, అరుణ ఆసుపత్రులలో అక్రమంగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు.
ఒక్కో కిడ్నీ మార్పి డికి రూ.60 లక్షల చొప్పున గ్రహీత నుంచి వసూలు చేస్తున్న ఈ గ్యాంగ్.. గత రెండేళ్లలో నగరంలో 50కి పైగా కిడ్నీ మార్పిడులు చేయించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ముఠాలోని 9 మందిని అరెస్టు చేయగా.. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. కేసు వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ జీ సు«దీర్ బాబు శనివారం మీడియాకు వెల్లడించారు.
ఆర్థిక కష్టాలతో పక్కదారి
హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సిద్ధంశెట్టి అవినాశ్ 2022లో సైదాబాద్‌లోని మాదన్నపేట రోడ్‌లో ఉన్న జనని, అరుణ ఆసుపత్రులను కొనుగోలు చేసి కొంతకాలం నడిపించాడు. తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా విక్రయించాలని భావించాడు. ఆ సమయంలో విశాఖపట్నంకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి అవినాశ్‌ను సంప్రదించి, ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించాలని సూచించాడు.
ఒక్కో కిడ్నీ మార్పిడికి రూ.2.5 లక్షలు చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఆ ప్రతిపాదనకు అంగీకరించిన అవినాశ్ జనని, అరుణ ఆసుపత్రుల్లో ఏప్రిల్ 2023 నుంచి 2024 జూన్ వరకు అక్రమ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఈ దందాలో వైజాగ్‌కు చెందిన పవన్ అలియాస్ లియోన్, పూర్ణ అలియాస్ అభిషేక్‌లు కీలక పాత్ర పోషించారు.
వీరు తమిళనాడుకు చెందిన డాక్టర్ రాజశేఖర్ పెరుమాల్, జమ్మూకశ్మీర్‌కు చెందిన డాక్టర్ సోహిబ్‌తోపాటు నల్లగొండకు చెందిన మెడికల్ అసిస్టెంట్లు రమావత్ రవి, సపావత్ రవీందర్, సపావత్ హరీశ్, పొదిల సాయి, తమిళనాడుకు చెందిన ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు శంకర్, ప్రదీప్, కర్ణాటకకు చెందిన సూరజ్‌లను కలుపుకొని ముఠాగా ఏర్పడ్డారు.
ఒక్కో కిడ్నీ రూ.60 లక్షలు..
ఈ ముఠా ఒక్కో కిడ్నీకి రూ.60 లక్షల చొప్పున గ్రహీత నుంచి వసూలు చేసేది. ఇందులో కిడ్నీ దాతకు రూ.5 లక్షలు, అవినాశ్‌కు రూ.2.5 లక్షలు, ప్రధాన సర్జన్‌కు రూ.10 లక్షలు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లకు రూ.30 వేల చొప్పున ముట్టజెప్పేవారు. మిగిలిన రూ.42 లక్షలను లక్ష్మణ్, పవన్, పూర్ణ, అభిషేక్‌లు పంచుకునేవారు. శస్త్ర చికిత్స చేసే సర్జన్‌ను తమిళనాడు, జమ్మూకశ్మీర్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తీసుకొచి్చ, స్టార్ హోటల్‌లో బస ఏర్పాటు చేసేవారు.
అలకానందకు ఆపరేషన్ల మార్పు
జనని, అరుణ ఆసుపత్రుల్లో కిడ్నీ మార్పిడి దందా కు బ్రేక్ ఇద్దామని భావించిన డాక్టర్ అవినాశ్.. గతే డాది జూలైలో సరూర్‌నగర్‌లోని అలకానంద ఆసుపత్రి ఎండీ డాక్టర్ గుంటుపల్లి సుమంత్‌ను సంప్ర దించి, దందా గురించి తెలిపాడు. అతడు అంగీకరించటంతో అలకానందలో గతేడాది డిసెంబర్ నుంచి దాదాపు 20 అక్రమ కిడ్నీ మార్పిడి శస్త్ర చికి త్సలు నిర్వహించారు. ప్రతీ సర్జరీకి సుమంత్‌కు రూ.1.5 లక్షలు కమీషన్‌గా అందేవి.
విశ్వసనీయ స మాచారం అందడంతో ఈ నెల 21న రంగారెడ్డి జి ల్లా వైద్యాధికారులతో కలిసి పోలీసులు అలకానంద ఆసుపత్రిపై దాడిచేసి దందా గుట్టను రట్టు చేశా రు. తమిళనాడుకు చెందిన కిడ్నీ దాతలు నస్రీన్ బా ను అలియాస్, ఫిర్దోష్, కర్ణాటకకు చెందిన గ్రహీ త లు బీఎస్ రాజశేఖర్, భట్ ప్రభలను అదుపులోకి తీ సుకున్నారు. ఈ నెల 23న డాక్టర్ సుమంత్, రిసెప్షనిస్ట్ నర్సగాని గోపిలను అరెస్టు చేశారు.
తాజాగా డాక్టర్ అవినాశ్, ప్రదీప్, రవి, రవీందర్, హరీశ్, సా యి, సూరజ్ మిశ్రాలను అదుపులోకి తీసుకున్నా రు. సర్జన్లు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ సోహిబ్, దళారులు పవన్, పూర్ణ, లక్ష్మణ్‌లు పరారీలో ఉన్నారు.
జీవన్‌దాన్ దాతల జాబితా లీక్
అవయవదానానికి సంబంధించిన సేవలు నిర్వహిస్తున్న జీవన్‌దాన్ సంస్థ డేటా లీక్ కావటమే కిడ్నీ దందాకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. పవన్, లక్ష్మణ్‌లు దాతలు, గ్రహీతల వివరాలను అక్రమ మార్గంలో సేకరించి ఈ దందా నిర్వహించినట్లు గుర్తించారు. వారు దొరికితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నా యి. గతంలో ఈ ముఠా శ్రీలంకలో కూడా కిడ్నీ మార్పిడి దందా చేసిందని అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment