Wanaparthy Youth Organ Donation Letter Viral After Brain Dead - Sakshi
Sakshi News home page

నా తనువు మట్టిలో కలిసినా.. కన్నీరు పెట్టిస్తున్న నిఖిల్‌ కవిత

Published Thu, May 4 2023 7:17 AM | Last Updated on Thu, May 4 2023 8:18 AM

Wanaparthy Youth Organ Donation Letter Viral After Brain Dead - Sakshi

మనుషుల్లో స్వార్థం పెరిగిపోతోంది. మానవ సంబంధాలు కేవలం డబ్బు చుట్టూరానే తిరుగుతున్నాయి. మనం బాగుంటే చాలూ.. పక్కవాడు ఏమైపోతే మాకేం అనుకునేవాళ్లు మనమధ్యే ఉన్నారు. రోడ్డు మీద ప్రాణం పోతున్నా పట్టించుకోకుండా సెల్‌ఫోన్‌లతో బంధించే యువత ఉన్న ఈ రోజుల్లో.. చదువుకున్న ఓ యువకుడి ఆలోచన శెభాష్‌ అనిపించడమే కాదు.. జీవితాన్ని ముందే పసిగట్టి అతను రాసిన లేఖ కంటతడి పెట్టిస్తోంది కూడా. 


చిన్ని నిఖిల్‌.. వనపర్తి జిల్లా అమరచింతకి చెందిన యువకుడు. బెంగళూరులో బీఏఎంస్‌ చేసి.. అక్కడే ప్రాక్టీస్‌ చేస్తున్నాడు కూడా. అంతా సవ్యంగా ఉందనుకున్న టైంలో విధికి కన్నుకుట్టిందేమో.. 24 ఏళ్ల నిఖిల్‌ను రోడ్డు ప్రమాదం చలనం లేకుండా చేసేసింది. 

ఏప్రిల్‌ 29వ తేదీన బెంగళూరు నుంచి కావలికి వెళ్తున్న సమయంలో నిఖిల్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో.. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స అందించారు కుటుంబ సభ్యులు. చివరకు మే 1వ తేదీన చికిత్స పొందుతున్న నిఖిల్‌కు బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే.. అంత శోకంలోనూ కొడుకు ఆశయం నెరవేర్చాలని ఆ తల్లిదండ్రులు రమేష్‌, భారతిలు ముందుకొచ్చారు. 

ప్రత్యేక ఆంబులెన్స్‌లో నిఖిల్‌ను సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. ఆరుగురికి అవయవదాతగా నిలిచాడు. స్టూడెంట్‌గా ఉన్న టైంలోనే.. ఆర్గాన్‌ డొనేషన్‌ ప్రతిజ్ఞ చేసిన నిఖిల్‌ అందుకు సమ్మతి పత్రాన్ని సైతం ఓ ఆర్గనైజేషన్‌కు అందజేశాడు. ఆ సమయంలో ఆ పత్రాలకు అతను జత చేసిన కవిత ఇలా ఉంది.. 


నా తనువు మట్టిలో కలిసినా.. 
అవయవదానంతో మరొకరిలో జీవిస్తా.. 
ఒక అమ్మకు బిడ్డగా మరణించినా.. 
మరో అమ్మ పిలుపులో బతికే ఉంటా.. 
ఏనాడూ వెలుగులు చూడని అభాగ్యులకు నా కళ్లు.. 
ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్న గుండెకు బదులుగా నా గుండె
కిడ్నీలు కోల్పోయిన వారికి మూత్రపిండాలు
ఊపిరి అందక ఊగిసలాడుతున్న వారికి ఊపిరితిత్తులు
కాలేయం పని చేయక కాలం ముందు ఓడిపోతున్న వారికి నా కాలేయం
నాలోని ప్రతీ అణువూ అవసరమైన వారికి ఉపయోగపడాలి

ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి
ఇదే మీకు నాకు ఇచ్చే గొప్ప బహుమతి
ఇలా మీరు చేస్తే నేను కూడా సదా మీ మదిలో నిలుస్తాను.. చిరంజీవినై ఉంటాను

అవయవదానం చేద్దాం..  మరో శ్వాసలో శ్వాసగా ఉందాం

అంటూ పిలుపు ఇచ్చాడు నిఖిల్‌.

ఇదీ చదవండి: తనలాంటి వాళ్లకు కృష్ణప్రియ చేసే సాయం ఇది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement