amarachintha
-
నా తనువు మట్టిలో కలిసినా.. కన్నీరు పెట్టిస్తున్న నిఖిల్ కవిత
మనుషుల్లో స్వార్థం పెరిగిపోతోంది. మానవ సంబంధాలు కేవలం డబ్బు చుట్టూరానే తిరుగుతున్నాయి. మనం బాగుంటే చాలూ.. పక్కవాడు ఏమైపోతే మాకేం అనుకునేవాళ్లు మనమధ్యే ఉన్నారు. రోడ్డు మీద ప్రాణం పోతున్నా పట్టించుకోకుండా సెల్ఫోన్లతో బంధించే యువత ఉన్న ఈ రోజుల్లో.. చదువుకున్న ఓ యువకుడి ఆలోచన శెభాష్ అనిపించడమే కాదు.. జీవితాన్ని ముందే పసిగట్టి అతను రాసిన లేఖ కంటతడి పెట్టిస్తోంది కూడా. చిన్ని నిఖిల్.. వనపర్తి జిల్లా అమరచింతకి చెందిన యువకుడు. బెంగళూరులో బీఏఎంస్ చేసి.. అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాడు కూడా. అంతా సవ్యంగా ఉందనుకున్న టైంలో విధికి కన్నుకుట్టిందేమో.. 24 ఏళ్ల నిఖిల్‌ను రోడ్డు ప్రమాదం చలనం లేకుండా చేసేసింది. ఏప్రిల్ 29వ తేదీన బెంగళూరు నుంచి కావలికి వెళ్తున్న సమయంలో నిఖిల్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు కుటుంబ సభ్యులు. చివరకు మే 1వ తేదీన చికిత్స పొందుతున్న నిఖిల్‌కు బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే.. అంత శోకంలోనూ కొడుకు ఆశయం నెరవేర్చాలని ఆ తల్లిదండ్రులు రమేష్, భారతిలు ముందుకొచ్చారు. ప్రత్యేక ఆంబులెన్స్‌లో నిఖిల్‌ను సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. ఆరుగురికి అవయవదాతగా నిలిచాడు. స్టూడెంట్‌గా ఉన్న టైంలోనే.. ఆర్గాన్ డొనేషన్ ప్రతిజ్ఞ చేసిన నిఖిల్ అందుకు సమ్మతి పత్రాన్ని సైతం ఓ ఆర్గనైజేషన్‌కు అందజేశాడు. ఆ సమయంలో ఆ పత్రాలకు అతను జత చేసిన కవిత ఇలా ఉంది.. నా తనువు మట్టిలో కలిసినా.. అవయవదానంతో మరొకరిలో జీవిస్తా.. ఒక అమ్మకు బిడ్డగా మరణించినా.. మరో అమ్మ పిలుపులో బతికే ఉంటా.. ఏనాడూ వెలుగులు చూడని అభాగ్యులకు నా కళ్లు.. ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్న గుండెకు బదులుగా నా గుండె కిడ్నీలు కోల్పోయిన వారికి మూత్రపిండాలు ఊపిరి అందక ఊగిసలాడుతున్న వారికి ఊపిరితిత్తులు కాలేయం పని చేయక కాలం ముందు ఓడిపోతున్న వారికి నా కాలేయం నాలోని ప్రతీ అణువూ అవసరమైన వారికి ఉపయోగపడాలి ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి ఇదే మీకు నాకు ఇచ్చే గొప్ప బహుమతి ఇలా మీరు చేస్తే నేను కూడా సదా మీ మదిలో నిలుస్తాను.. చిరంజీవినై ఉంటాను అవయవదానం చేద్దాం.. మరో శ్వాసలో శ్వాసగా ఉందాం అంటూ పిలుపు ఇచ్చాడు నిఖిల్. ఇదీ చదవండి: తనలాంటి వాళ్లకు కృష్ణప్రియ చేసే సాయం ఇది -
మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కన్నుమూత
సాక్షి, మహబూబ్‌నగర్: అమరచింత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా పని చేశారు. వీరారెడ్డి మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరారెడ్డి మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం ప్రకటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
పెళ్లింట ఆడిపాడి.. మరునాడు కారు డిక్కీలో!
సాక్షి, అమరచింత(వనపర్తి జిల్లా): పెళ్లి వేడుకల్లో హుషారుగా ఆడిపాడి, చిందులేసిన ఓ బాలుడు కొన్ని గంటల్లోనే కారు డిక్కీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వనపర్తి జిల్లా అమరచింత పట్టణానికి చెందిన కతాల్ తన కూతురి వివాహాన్ని ఆదివారం జరిపించారు. ఇదే గ్రామానికి చెందిన మోహిద్(16) సమీప బంధువు కావడంతో ఈ వేడుకలో పాల్గొన్నాడు. తీరా ఆ ఇంటి ఎదుట ఆగి ఉన్న ఓ కారులో సోమవారం సాయంత్రం శవమై కనిపించాడు. దీంతో ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. నా అనే వారు లేక.. అమరచింత పట్టణానికి చెందిన భాను, అఫ్సర్ దంపతులకు మోహిద్ ఒక్కగానొక్క కుమారుడు. గతంలోనే భార్యను వదిలిపెట్టి అఫ్సర్ ఎటో వెళ్లిపోగా రెండేళ్ల క్రితం ఆమె కేన్సర్‌తో మృతి చెందింది. దీంతో నా అనేవారు లేక ఒంటరిగా ఉన్న మోహిద్ చిన్న, చిన్న కూలి పనులను చేసుకుంటూ రోజువారీ జీవనాన్ని సాగించేవాడు. ఈ క్రమంలోనే తమకు దగ్గరి బంధువు అయిన కతాల్ ఇంట్లో జరుగుతున్న పెండ్లి వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ బాలుడు ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో నిద్రించడానికి వెళ్లిపోయాడు. హైదరాబాద్‌కు చెందిన కతాల్ బావమరిది ఇసాక్ తీసుకొచ్చిన కారు డిక్కీలో సోమవారం సాయంత్రం విగతజీవిగా పడి ఉండటం చూసి అందరూ కన్నీరు మున్నీరయ్యారు. డిక్కీలో ఊపిరి ఆడక చనిపోయాడా? లేక ఎవరైనా అందులో పడవేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
అమ్మాపురం రాజా సోంభూపాల్ కన్నుమూత
సాక్షి, కొత్తకోట : అమ్మాపురం సంస్థానాదీశులు, అమరచింత మాజీ ఎమ్మెల్యే రాజా సోంభూపాల్ ఆదివారం హైద్రాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతిచెందారు. అమ్మాపురం సంస్థానానికి రాణి భాగ్యలక్ష్మమ్మ సంస్థానాదీశులుగా కొనసాగిన అనంతరం అమ్మాపురం సంస్థానానికి రాజుగా ముక్కెర వంశానికి చెందిన రాజా సోంభూపాల్‌కు పట్టాభిషేకం చేపట్టారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం సంస్థానాలను విలీనం చేసే సమయంలో 1962, 1967 సంవత్సరాల్లో అమరచింత నియోజకవర్గానికి ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1972లో ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించారు. అనంతరం 1979 ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీరారెడ్డిపై ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచిరాజకీయాలకు దూరంగా ఉన్నారు. కురుమూర్తి స్వామి ఆలయ అభివృద్ధికి కృషిచేశారు. రాజసోంభూపాల్‌కు కుమారుడు రాంభూపాల్, కూతురు గౌరీదేవీ ఉన్నారు. నేడు స్వగ్రామమైన అమ్మాపురంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన తనయుడు రాజాశ్రీరాంభూపాల్ తెలిపారు. -
కాల్వలు దాటడం కష్టమే!
సాక్షి, అమరచింత(వనపర్తి) : అమరచింత మున్సిపాలిటీ ఏర్పడక ముందే గ్రామపంచాయతీలో కొత్తగా నిర్మించిన మురుగు కాల్వలపై అవసరం ఉన్నచోట స్లాబ్‌లను ఏర్పాటు చేయలేదు. దీంతో ఆయా కాలనీల్లోని ప్రజలు, చిన్నారులు మురుగు కాల్వలు దాటే క్రమంలో కిందపడి గాయపడుతున్నారు. సంబంధిత అధికారులు పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ద్విచక్రవాహనదారులతో పాటు రిక్షాలు కూడా కాలనీ, వీధుల్లో వెళ్లలేని దుస్థితి నెలకొంది. పాతకల్లుగేరిలో స్లాబ్లేని మురుగు కాల్వ రూ.16లక్షలతో నిర్మాణం.. అమరచింత మున్సిపాలిటీలోని ఆయా వీధులలో సుమారు రూ.16లక్షల వ్యయంతో 7 చోట్ల మురుగు కాల్వల నిర్మాణం పనులను చేపట్టారు. ప్రస్తుతం సదరు కాంట్రాక్టర్ బిల్లులను చెల్లించకపోవడంతో నిర్మించిన కాల్వలపై స్లాబ్‌లను ఏర్పాటు చేయడం మర్చిపోయారు. దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతున్నా పట్టించుకునే అధికారులు, ప్రజాప్రతినిధులు కరువయ్యారని ఆయా కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. స్లాబులు వేస్తేనే ప్రయోజనం.. అమరచింత మున్సిపాలిటీలోని సయ్యద్‌నగర్, రాణాప్రతాప్‌నగర్, ఆజాద్‌నగర్, శివాజీనగర్‌తో పాటు మరికొన్ని కాలనీల్లో రూ.16లక్షల వ్యయం తో కూడిన మురుగు కాల్వల నిర్మాణ పనులను మాజీ సర్పంచ్ పురం వెంకటేశ్వర్‌రెడ్డి హయాంలో నిర్మించారు. ప్రస్తుతం 7 కాల్వల నిర్మాణాలతో పా టు రాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు రోడ్డుకిరువైపులా నూతనంగా డ్రెయినేజీ పనులను సుమారు రూ.20లక్షలవ్యయంతో నిర్మించారు. గతంలో నిర్మిచిన మురుగు కాల్వల నిధులతోపాటు ప్రస్తుతం నూతనంగా ని ర్మించిన కాల్వల పనులకు కూడా బిల్లులు రాలేదని అవసరం ఉన్న చోట్ల కాల్వలపై స్లాబ్‌లను ఏర్పాటుచేయలేక పోతున్నారు. అధికారులు స్పందించి ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించి మురుగు కాల్వలపై వెంటనే స్లాబ్‌లను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
పల్లెల్లో ప్రయాణం.. ప్రయాసే!
సాక్షి, చిన్నచింతకుంట: ప్రభుత్వాలు, పాలకులు మారిన పల్లెల స్థితిగతులు మారడంలేదు. ఒక గ్రామం అభివృద్ధి చేయాలంటే ప్రధానంగా ఆ గ్రామానికి రోడ్డుసౌకర్యం బాగుండాలి. ఈ మేరకు అన్నిగ్రామాలకు రోడ్డు నిర్మించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ కొన్ని గ్రామాలను మాత్రం అధికారులు పట్టించుకోవడంలేదు. మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉంధ్యాల గ్రామం కొన్ని ఏళ్లుగా మట్టి, గుంతలు తేలిన రోడ్డే వీరికిగతి. బీటీరోడ్డు లేక గ్రామప్రజలు మండల కేంద్రానికి రావడానికి ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు వర్షాకాలం కావడంతో రోడ్డంతా బురదమయంగా మారి వాహనదారులకు ఎన్నో అవస్థలకు గురిచేస్తుంది. కంకరతేలిన రోడ్డుతో అవస్థలు ఏళ్లుగడుస్తున్నా.. ఉంధ్యాల బీటీరోడ్డుకు నోచుకోవడం లేదు. గుంతలుపడి కంకరతేలిన రోడ్డుపై ప్రయాణం నరకాన్ని తలపిస్తుందని పలువురు పేర్కొంటున్నారు. దీంతో గ్రామానికి బస్సులు, ఆటోలు రాలేకపోతున్నాయి. గ్రామప్రజలు ఏ చిన్నపని ఉన్నా.. మండల కేంద్రానికి రావాల్సిందే. అయితే ద్విచక్రవాహనాలు తప్పా.. ఏ వాహనాలు గ్రామం నుంచి మండల కేంద్రానికి రాకపోవడంతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గర్భిణుల ఇబ్బందులు వర్ణనాతీతం. నెలనెలా చికిత్సలు చేయించుకునేందుకు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆటోలోనే అవస్థల మధ్య కంకరతేలిన బీటీరోడ్డుపై తిరుగుతున్నారు. ఒకవేళ పురిటినొప్పులు వచ్చాయంటే.. అంబులెన్స్ సైతం రోడ్డు బాగోలేదంటూ ఊర్లోకి రావడం లేదు. ఆటోలో తరలిస్తుంటే కంకర రోడ్డుపై మార్గమధ్యంలోనే ప్రసవాలు అవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యలోనే నిల్చిన పనులు ఇదిలా ఉండగా మద్దూర్ నుంచి ఉంధ్యాల వరకు రెండు కిలోమీటర్ల బీటీరోడ్డు వేశారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. మిగతా 6 కిలోమీటర్లు అలాగే వదిలేశారు. వర్షాకాలంలో రోడ్లపై గుంతలు పడి వాహనదారులకు పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామస్తులు వాపోతున్నారు. ఎందరో గాయపడ్డారు మండల కేంద్రం నుంచి గ్రామానికి రావాలంటే గుంతలు, కంకరతేలిన రోడ్డేగతి. ఇప్పుడు వర్షాకాలంలో బురదగా మారి గుంతలుపడి రాత్రివేళల్లో గుంతల రోడ్డుపై వాహనాలను నడుపుతూ కిందపడి గాయపడ్డ సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైన పాలకులు, ఆర్అండ్బీ అధికారులు తక్షణమే స్పందించి బీటీగా మార్చాలి. – ఆర్.రమేష్, ఉంద్యాల అధికారులు స్పందించాలి అన్ని నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే రోడ్ల విస్తరణ చేపట్టారు. బీటీరోడ్డు, సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యే అధికారులు స్పందించాలి. మా గ్రామం నుంచి మండల కేంద్రం వరకు బీటీరోడ్డు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. – ఆర్.రాములు, ఉంద్యాల -
కురుమూర్తిరాయా.. కోటి దండాలయ్యా.!
సాక్షి, చిన్నచింతకుంట (దేవరకద్ర): పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీకశుద్ధ సప్తమి సందర్భంగా ఈ నెల 14న జరగనున్న ఉద్దాల ఉత్సవ వేడుకల్లో స్వామివారి పాదుకలను తాకి పునీతులయ్యేందుకు భక్తజనం సిద్ధమవుతున్నారు. కాగా, బ్రహ్మోత్సవాల ఆరంభాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో యాగం జరిపారు. ఈ మేరకు తొలిరోజే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కల్యాణం.. కమనీయం కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గు రువారం పూర్తి లాంఛనాలతో స్వామి, అమ్మవార్ల కల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధాన ఆర్చ కులు వెంకటేశ్వరాచార్యుల ఆధ్వర్యంలో వేదపండితులు ఆధ్వర్యాన ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు పెద్దసంఖ్యలో హాజరైన భక్తులు కురుమూర్తి స్వామితో పాటు లక్ష్మీదేవి, ఆంజనేయస్వామిని, ఉద్దాల పాదుకలను దర్శించుకున్నారు. దాసంగాలతో మొక్కులు సమర్పించారు. కాగా, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె.దయాకర్‌రెడ్డి, టీఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్కరణ్రెడ్డి, టీఎస్ ఐడీసీ ఎస్ఈ కిశోర్‌కుమార్, టీఎస్ ఐడీసీ మహబూబ్‌నగర్ ఏఈ నయీంఖాన్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ సురేందర్, ఆలయ మాజీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, బత్తుల బాల్‌రాజు, ప్రతాప్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్, వెంకట్రాములుయాదవ్, ఆలయ ఉద్యోగులు శివానందచారి, సాయిరెడ్డి, శ్రీకర్, పూజారులు వెంకటయ్య, విజయ్, అమ్మాపురం బాల్‌రాజ్ పాల్గొన్నారు. ఆలయ చరిత్ర ఆకాశరాజు కూతు రు పద్మావతి దేవిని శ్రీనివా సుడు వివా హం ఆడేందుకు తన అన్న గోవిందరాజును భరోసాపెట్టి కుబేరుడి నుంచి అప్పు తీసుకుంటాడు. ఆ అప్పు స్వామివారు చెల్లించకపోవడంతో కుబేరుడు ఒత్తిడి తెస్తాడు. దీంతో తన మనస్సు కలతచెంది ఆయన ప్రతిరూపాన్ని అక్కడే వదిలి అర్ధరాత్రి ఎవ్వరికి చెప్పకుండా ఉత్తరదిశగా కాలినడకన పయనమై వస్తారు. మహబూబ్‌నగర్ జిల్లా గుండాల జలపాతం వద్ద కృష్ణానదిలో స్వామివారు స్నానం చేస్తారు. అప్పటివరకు తెలుపురంగులో ప్రవహిస్తున్న కృష్ణమ్మ స్వామివారు స్నానం చేశాక నీలివర్ణంలోకి మారుతుంది. దీంతో నదిని ఆయన కృష్ణా అంటూ సంబోధిస్తారు. ఆయన పిలుపుతో సంతోషపడిన గంగాదేవి స్వామివారికి ప్రత్యేక్షమై పాదాలు కంది పోకుండా పాదుకలను బహుకరిస్తుంది. అనంతరం నిర్మానుష్యంగా ఉన్న కురుమూర్తి ఏడుకొండలకు స్వామివారు చేరుకుని సేదతీరుతారు. స్వామివారి జాడను తెలుసుకుంటూ పద్మావతిదేవి కురుమూర్తి కొండలకు చేరుకుంటుంది. తిరుమలకు రావాలని స్వామివారిని వేడుకుంటుంది. చివరికి స్వామిని ఒప్పించి ఇద్దరి ప్రతిరూపాలను దేవరగట్టు కాంచనగుహలో వదిలి తిరుమలకు వెళ్లారని చరిత్ర చెబుతుంది. అందుకే కురుమూర్తిస్వామిని ఏడుకొండల వెంకన్నా అంటూ భక్తులు కొలుస్తారు. 12న అలంకారోత్సవం స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నెలరోజుల పాటు స్వామివారికి ముక్కెరవంశపు రాజులు బహుకరించిన బంగారు ఆభరణాలు అలంకరించడం ఆనవాయితీ. ఆత్మకూర్ ఎస్బీఐలో భద్రపర్చిన స్వామివారి బంగారు ఆభరణాలను పోలీసు బందోబస్తు మధ్య ఆత్మకూర్ నుంచి మదనాపురం మండలం కొత్తపల్లి, దుప్పల్లి గ్రామాల మీదుగా మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మం డలంలోని అమ్మాపూర్‌కు తరలిస్తారు. అమ్మాపురంలో సంస్థానాధీశులు రాజా శ్రీరాంభూపాల్ ఇంట్లో ప్రత్యేక పూజల అనంతరం అంబోరు మధ్యన కాలినడకన ఆభరణాలను కురుమూర్తి గిరులకు చేరుస్తారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుం ది. ఉద్దాల ఉత్సవం బ్రహ్మోత్సవాల్లో ఉద్దాలకు ప్రత్యేకత ఉంది. జాతరలో ఇదే ప్రధాన ఘట్టం. ఈ వేడుకకు లక్షలాధి మంది భక్తులు హాజరవుతారు. శివసత్తుల ఆటలు, పాటలతో ఏడుకొండలు మార్మోగుతాయి. చిన్నవడ్డెమాన్ గ్రామ దళితులు వారం పాటు నియమనిష్టలతో ఉంటూ స్వామివారికి పాదుకలను తయారుచేస్తారు. బ్రహ్మోత్సవాల వివరాలు 9వ తేదీ శుక్రవారం : ఉదయం 8గంటలకు అవాహిత దేవతాపూజ, హోమం, సాయంత్రం 6:25 గంటలకు హంసవాహన సేవ 10వ తేదీ శనివారం : సాయంత్రం 6:25 గంటలకు గజవాహనసేవ 11వ తేదీ ఆదివారం : సాయంత్రం 6:30 గంటలకు శేషవాహనసేవ 12వ తేదీ సోమవారం : సాయంత్రం 5:30కి స్వర్ణాభరణాలతో స్వామివారి దర్శనం, రాత్రి 10గంటలకు అశ్వవాహనసేవ 13వ తేదీ మంగళవారం : రాత్రి 9:30 గంటలకు హనుమత్‌వాహన సేవ 14వ తేదీ బుధవారం : సాయంత్రం 6:30 గంటలకు ఉద్దాల ఉత్సవం, రాత్రి 10:45 గరుడవాహన సేవ 15వ తేదీ గురువారం : పుష్పయాగం -
అభివృద్ధిలో భాగస్వాములు కండి
అమరచింత : గ్రామాల అభివృద్ధికి సమష్టిగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని, అప్పుడే గ్రామాభివృద్ధిలో భాగస్వాములు అవుతారని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పాంరెడ్డిపల్లిలో సీడీసీ నిధులు రూ.5లక్షల వ్యయంతో బీసీ కమ్యూనిటీ భవనాన్ని ఆ యన ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భూత్పూర్ రిజర్వాయర్ నుంచి వచ్చే ఏడాది పాంరెడ్డిపల్లికి సాగునీరు అందించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సర్పంచ్ మార్క సరోజ ఆధ్వర్యంలో గ్రామపెద్దలు ఎమ్మెల్యేను శాలువా, పూలమాలలతో సత్కరించారు. అదేవిధంగా అమరచింత పంచాయతీ పరిధిలోని దీప్లానాయక్ తండాకు రూ.58లక్షలతో బీటీరోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. Aటీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎస్ఎ.రాజు , మార్కెట్‌యార్డు కమిటీ చైర్మన్ రాజేందర్‌సింగ్, ఆత్మకూర్ టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రవికుమార్ యాదవ్, జిల్లా రైతుసమన్వయ సమితి సభ్యుడు జ యసింహారెడ్డి, టీఆర్ఎస్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు గోపాల్‌నాయక్ పాల్గొన్నారు. -
అమరచింత మండలం ఏర్పాటుపై సంబురాలు
ఆత్మకూర్ (నర్వ) : కొత్తజిల్లాల ఏర్పాటుతో పాటు కొత్త మండలాల ప్రక్రియలో అమరచింతను కొత్త మండలంగా ఏర్పాటుచేసిన విషయంపై శనివారం అమరచింత అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఒకప్పడు అమరచింత నియోజకవర్గ కేంద్రంగా కొనసాగి కూగ్రామంగా కనుమరుగైన నేపథ్యంలో నేడు గ్రామానికి చెందిన అఖిలపక్ష నాయకులతో పాటు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ దేశాయిప్రకాష్ రెడ్డి, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చొరవతో కొత్త మండలాల్లో అమరచింత ఉండడం హర్షించదగ్గ విషయమని బాణాసంచా పేల్చి మిఠాయిలను పంచుకున్నారు. అనంతరం దేశాయిప్రకాష్ రెడ్డిని కలిసి పూలమాలతో సన్మానించి అభినందనలను తెలియజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు నరేష్‌రెడ్డి, అఖిలపక్షం నాయకులు అయ్యూబ్‌ఖాన్, నాగభూషణం గౌడ్, ఫయాజ్, గోపాల్‌నాయక్, కలాంపాష, రామన్‌గౌడ్, గోపి, నర్సింహులు గౌడ్, మాజీ సర్పంచ్ గోపాల్‌నాయక్ , టీఆర్ఎస్ నాయకులు షానవాజ్ ఖాన్, తోకలి రమేష్, తెలుగు రమేష్, రాజేష్, అంబేద్కర్ జాతరకమిటీ జిల్లా కార్యదర్శి విజయ్ పలువురు పాల్గొన్నారు. -
తాగునీటి కోసం రాస్తారోకో
ఆత్మకూర్ (నర్వ): అమరచింత గ్రామంలోని సంతోష్‌నగర్ కాలనీ వాసులకు వారం రోజుల నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ఆ కాలనీ వాసులు బుధవారం రోడెక్కి రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీకి చెందిన పలువురు మహిళలు ఖాళీ బిందెలతో ర హదారిపై వాహన రాకపోకలను అడ్డుకుని బైఠాయించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి వ్యవస్థ అçస్తవ్యస్తంగా కొనసాగుతుందన్నారు. పాలకులు, అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. వారంరోజుల నుంచి నీటి కష్టాలను అనుభవిస్తున్న పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడమేమిటని నిరసన వ్యక్తం చేశారు. రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించడంతో మరికల్ – ఆత్మకూర్ రహదారిపై వాహన రాకపోకలు భారీ స్థాయిలో నిలిచిపోయాయి. ఈ మేరకు ఉపసర్పంచు మమతసత్యనారాయణ ఆందోళన కారుల వద్దకు వచ్చి తాగునీరు సకాలంలో సరఫరా అయ్యేల తనవంతు కషి చేస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు. -
అమరచింతలో కలకలం
ఆత్మకూర్(నర్వ) : అమరచింతలోని శివాజీనగర్‌లో సోమవారం రాత్రి క్షద్రపూజలు నిర్వహించి రక్తాన్ని పరిసరాల్లో చల్లారనే పుకార్లు మంగళవారం తెల్లవారుజామున వినిపించా యి. దీంతో గ్రామస్తులు శివాజీనగర్‌లోని ఆ ప్రదేశానికి తరలివచ్చారు. ఎస్ఐ సీహెచ్ రాజు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. శివాజీనగర్‌లో జన్ను నాగరాజు ఇంట్లో అద్దెకు ఉంటున్న గాజుల ఖాజా పై అనుమానంతో విచారించారు. ఖాజా తన భార్య అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ఇంట్లో దిష్టి తీసే పనులకు తన బావమరుదులను పిలిపించుకున్నట్లు తెలిపారు. అయితే కోసిన కోళ్ల రక్తంతో పాటు కోడి తలకాయలు, పేగులను కుండలో ఉడకబెట్టి కుంకుమ, పసుపును చల్లి దిష్టితీసిన అనంతరం వాటిని దూరప్రాంతానికి విసిరివేయడానికి వెళ్తుండగా పొరపాటున చేయి జారి కుండ పలిగిపోయిందని ఎస్ఐకి తెలిపాడు. రాత్రివేళ ఆ ప్రదేశాన్ని నీటితో కడిగామని తెలిపాడు. అయితే కాలనీవాసులు మాత్రం క్షుద్ర పూజలు జరిపి గుప్తనిధులను తీయడానికి ప్రయత్నించి ఉంటారని అనుమానం వ్యక్తం చేయగా ఖాజా ఇంటికి వచ్చిన నఫీజ్ పాష, మక్సూద్ అహ్మద్, సులేమాన్‌ను పోలీస్‌స్టేçÙన్కు తరలించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు వెల్లడించి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు.