సాక్షి, చిన్నచింతకుంట (దేవరకద్ర): పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీకశుద్ధ సప్తమి సందర్భంగా ఈ నెల 14న జరగనున్న ఉద్దాల ఉత్సవ వేడుకల్లో స్వామివారి పాదుకలను తాకి పునీతులయ్యేందుకు భక్తజనం సిద్ధమవుతున్నారు. కాగా, బ్రహ్మోత్సవాల ఆరంభాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో యాగం జరిపారు. ఈ మేరకు తొలిరోజే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కల్యాణం.. కమనీయం
కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గు రువారం పూర్తి లాంఛనాలతో స్వామి, అమ్మవార్ల కల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధాన ఆర్చ కులు వెంకటేశ్వరాచార్యుల ఆధ్వర్యంలో వేదపండితులు ఆధ్వర్యాన ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు పెద్దసంఖ్యలో హాజరైన భక్తులు కురుమూర్తి స్వామితో పాటు లక్ష్మీదేవి, ఆంజనేయస్వామిని, ఉద్దాల పాదుకలను దర్శించుకున్నారు. దాసంగాలతో మొక్కులు సమర్పించారు. కాగా, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె.దయాకర్‌రెడ్డి, టీఎస్‌ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్‌కరణ్‌రెడ్డి, టీఎస్ ఐడీసీ ఎస్‌ఈ కిశోర్‌కుమార్, టీఎస్ ఐడీసీ మహబూబ్‌నగర్ ఏఈ నయీంఖాన్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ సురేందర్, ఆలయ మాజీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, బత్తుల బాల్‌రాజు, ప్రతాప్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్, వెంకట్రాములుయాదవ్, ఆలయ ఉద్యోగులు శివానందచారి, సాయిరెడ్డి, శ్రీకర్, పూజారులు వెంకటయ్య, విజయ్, అమ్మాపురం బాల్‌రాజ్ పాల్గొన్నారు.
ఆలయ చరిత్ర
ఆకాశరాజు కూతు రు పద్మావతి దేవిని శ్రీనివా సుడు వివా హం ఆడేందుకు తన అన్న గోవిందరాజును భరోసాపెట్టి కుబేరుడి నుంచి అప్పు తీసుకుంటాడు. ఆ అప్పు స్వామివారు చెల్లించకపోవడంతో కుబేరుడు ఒత్తిడి తెస్తాడు. దీంతో తన మనస్సు కలతచెంది ఆయన ప్రతిరూపాన్ని అక్కడే వదిలి అర్ధరాత్రి ఎవ్వరికి చెప్పకుండా ఉత్తరదిశగా కాలినడకన పయనమై వస్తారు. మహబూబ్‌నగర్ జిల్లా గుండాల జలపాతం వద్ద కృష్ణానదిలో స్వామివారు స్నానం చేస్తారు. అప్పటివరకు తెలుపురంగులో ప్రవహిస్తున్న కృష్ణమ్మ స్వామివారు స్నానం చేశాక నీలివర్ణంలోకి మారుతుంది. దీంతో నదిని ఆయన కృష్ణా అంటూ సంబోధిస్తారు. ఆయన పిలుపుతో సంతోషపడిన గంగాదేవి స్వామివారికి ప్రత్యేక్షమై పాదాలు కంది పోకుండా పాదుకలను బహుకరిస్తుంది. అనంతరం నిర్మానుష్యంగా ఉన్న కురుమూర్తి ఏడుకొండలకు స్వామివారు చేరుకుని సేదతీరుతారు. స్వామివారి జాడను తెలుసుకుంటూ పద్మావతిదేవి కురుమూర్తి కొండలకు చేరుకుంటుంది. తిరుమలకు రావాలని స్వామివారిని వేడుకుంటుంది. చివరికి స్వామిని ఒప్పించి ఇద్దరి ప్రతిరూపాలను దేవరగట్టు కాంచనగుహలో వదిలి తిరుమలకు వెళ్లారని చరిత్ర చెబుతుంది. అందుకే కురుమూర్తిస్వామిని ఏడుకొండల వెంకన్నా అంటూ భక్తులు కొలుస్తారు.
12న అలంకారోత్సవం
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నెలరోజుల పాటు స్వామివారికి ముక్కెరవంశపు రాజులు బహుకరించిన బంగారు ఆభరణాలు అలంకరించడం ఆనవాయితీ. ఆత్మకూర్ ఎస్‌బీఐలో భద్రపర్చిన స్వామివారి బంగారు ఆభరణాలను పోలీసు బందోబస్తు మధ్య ఆత్మకూర్ నుంచి మదనాపురం మండలం కొత్తపల్లి, దుప్పల్లి గ్రామాల మీదుగా మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మం డలంలోని అమ్మాపూర్‌కు తరలిస్తారు. అమ్మాపురంలో సంస్థానాధీశులు రాజా శ్రీరాంభూపాల్ ఇంట్లో ప్రత్యేక పూజల అనంతరం అంబోరు మధ్యన కాలినడకన ఆభరణాలను కురుమూర్తి గిరులకు చేరుస్తారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుం ది.
ఉద్దాల ఉత్సవం
బ్రహ్మోత్సవాల్లో ఉద్దాలకు ప్రత్యేకత ఉంది. జాతరలో ఇదే ప్రధాన ఘట్టం. ఈ వేడుకకు లక్షలాధి మంది భక్తులు హాజరవుతారు. శివసత్తుల ఆటలు, పాటలతో ఏడుకొండలు మార్మోగుతాయి. చిన్నవడ్డెమాన్ గ్రామ దళితులు వారం పాటు నియమనిష్టలతో ఉంటూ స్వామివారికి పాదుకలను తయారుచేస్తారు.
బ్రహ్మోత్సవాల వివరాలు
9వ తేదీ శుక్రవారం : ఉదయం 8గంటలకు అవాహిత దేవతాపూజ, హోమం, సాయంత్రం 6:25 గంటలకు హంసవాహన సేవ 10వ తేదీ శనివారం : సాయంత్రం 6:25 గంటలకు గజవాహనసేవ
11వ తేదీ ఆదివారం : సాయంత్రం 6:30 గంటలకు శేషవాహనసేవ
12వ తేదీ సోమవారం : సాయంత్రం 5:30కి స్వర్ణాభరణాలతో స్వామివారి దర్శనం, రాత్రి 10గంటలకు అశ్వవాహనసేవ
13వ తేదీ మంగళవారం : రాత్రి 9:30 గంటలకు హనుమత్‌వాహన సేవ
14వ తేదీ బుధవారం : సాయంత్రం 6:30 గంటలకు ఉద్దాల ఉత్సవం, రాత్రి 10:45 గరుడవాహన సేవ
15వ తేదీ గురువారం : పుష్పయాగం
Comments
Please login to add a commentAdd a comment